శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతి ఏడాది హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి కూడా చాలా ముఖ్యమైనది. మహా శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.
ఈ శివరాత్రి రోజు శివ భక్తులంతా శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా ఉపవాసాలు కూడా ఉంటారు. ఇక రాత్రి వేళల్లో నిద్రాహారాలు మాని శివనామస్మరణతో జాగరణ చేస్తూ ఉంటారు.
అలా శివరాత్రి రోజు శివుడి ధ్యానలో మునిగి శివుడికి పూజలు చేయటం వల్ల అంత మంచే జరుగుతుంది. ఇక ఈ శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు.. అసలు ఆరోజు ఉపవాసాలు, జాగరణ ఎందుకు చేస్తారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏడాది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రిని శివరాత్రిగా భావిస్తారు. శాస్త్రం ప్రకారం అమావాస్య ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి రోజు శివరాత్రి జరుపుకుంటారు.
ఇక ఈ పండుగను అర్ధరాత్రి జరుపుకుంటారు. అర్ధరాత్రి 12 గంటలకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇక ఆ శివరాత్రి రోజు శివ భక్తులు పగలంతా ఉపవాసాలు ఉండి రాత్రి సమయంలో నిద్రాహారాలు మాని శివ భజనలు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ పర్వదినాన శివుడికి చేయాల్సిన ముఖ్యమైన మూడు నియమాలు ఏంటంటే.. ఉపవాసం ఉండటం, రాత్రి జాగరణ చేయడం, శివనామస్మరణతో అభిషేకాలు చేయడం.
కాబట్టి ఎవరైతే ఈ మూడు నియమాలను భక్తి శ్రద్ధలతో చేస్తారో.. వాళ్లు గతంలో చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక ఈ రోజున శివుడు లింగోద్భవమూర్తి గా అవతరించడానికి ఒక కథ కూడా ఉంది. చాలా వరకు ఈ కథ ఎవరికి తెలియక పోగా.. అందులో మాత్రం నిజాయితీ అనేది కనిపిస్తుంది.
ఇంతకు ఆ కథ ఏమిటంటే.. ఒకరోజు బ్రహ్మ, విష్ణువుల మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే మాటల యుద్ధం జరుగుతుంది. దీంతో వారిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవడానికి సిద్ధ పడుతుంటారు. వీరి మధ్య జరుగుతున్న వాదనను శివుడు గమనించి.. వారికి తన శక్తి ఏంటో చూపించాలి అని మాఘ మాస చతుర్దశి తిథి రోజు వారిద్దరి మధ్య జ్యోతిర్లింగం రూపంలో దర్శనమిస్తాడు.
దీంతో ఆ బ్రహ్మ, విష్ణువులు జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివుడి ఆది, అంతం తెలుసుకోవడానికి వెతుకుతూ ఉంటారు. కానీ వారికి ఆది, అంతం తెలియక పోవటంతో అలసిపోతారు. అలా చివరికి శివుని వద్దకు చేరుకొని మీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అంటూ కుంగిపోతారు. దీంతో శివుడు ఇదంతా మీలో ఉన్న పోటీని తగ్గించడానికి ఈ లింగ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని అంటాడు.
దీంతో ఆ రోజే శివలింగం అవతారం ఏర్పడిందని.. అందుకే ఆ రోజునే మహాశివరాత్రి అయిందని శాస్త్రాలు తెలిపాయి. ఇక అప్పటి నుంచి ఆ లింగవతారంలో ఉన్న శివుడికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు చేస్తూ వస్తున్నారు.