భార్యాభర్తలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..!
భార్యాభర్తల బంధం బలంగా ఉండాలన్నా.. జీవితం సాఫీగా, ఎలాంటి గొడవలు, కొట్లాటలు జరగకూడదన్నా ఇంద్దరి మధ్య అండర్ స్టాండిగ్ ఉండాలి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి.
భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే పెద్దగా కష్టపడిపోవక్కర్లేదు. కొన్ని పనులు చేస్తే చాలు వైవాహిక జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. ఏ బంధమైనా సరే మొదట్లో ఎంతో అందంగా ఉంటుంది. ఆనందంగా సాగుతుంది. కానీ కొన్ని జంటలు కాలం గడుస్తున్న కొద్దీ ఎక్కువగా గొడవ పడుతుంటాయి. గొడవలు, కొట్లాటలు లేని రిలేషన్ షిప్ ఉండదు. అందులోనూ చిన్న చిన్న గొడవల వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు. అయితే భార్యాభార్తల బంధం విడాకుల వరకు వెళ్లకూడదంటే ఇద్దరూ కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భాగస్వామితో నిజాయితీగా ఉండటం
మీ బంధం సాఫీగా, ఆనందంగా సాగాలంటే మాత్రం మీరు మీ భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. విషయాలను దాచడం, సీక్రేట్స్ ను మెయింటైన్ చేయడం అస్సలు మంచిది కాదు. ఇది మీ ఇద్దరినీ విడదీసేదాకా వెళుతుంది. మీ బంధం బలంగా ఉండాలంటే మాత్రం మీ భాగస్వామికి అన్నీ నిజాలే చెప్పండి. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి. రిలేషన్ షిప్ లో మోసం మీ ఇద్దరినీ విడదీస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితులోనైనా నిజాన్నే చెప్పండి.
గతాన్ని భవిష్యత్తులోకి లాగకండి
ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. అందులో ఎన్నో మంచి చెడులు ఉంటాయి. వాటినే పట్టుకుని కూర్చుంటే ముందుకు సాగలేం. అందుకే మీ రిలేషన్ షిప్ బాగుండాలంటే గతాన్ని భవిష్యత్తులోకి లాగకండి. అలాగే మీ భాగస్వామి గతం గురించి ప్రతీది తెలుసుకోవడానికి వారిపై ఒత్తిడి చేయకండి. ఎందుకంటే గతం మీ ప్రస్తుత జీవితాన్ని దెబ్బతీస్తుంది. మీ మధ్యన గొడవలకు కారణమవుతుంది. అందుకే ఇలాంటి విషయాలను ప్రస్తుత లైఫ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి.
భాగస్వామి స్వేచ్ఛను గౌరవించడం
ఏ బంధమైన సరే స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలి. మీరు మీ భాగస్వామిపై ఒత్తిడి తెచ్చినా.. ఇవి చేయొద్దు, అవి చేయొద్దు అని ఆంక్షలు పెట్టినా.. వారికి స్వేచ్ఛ లేకుండా చేసినా మీ బంధం సాఫీగా సాగదు. అది రాబోయే రోజుల్లో మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మీ భాగస్వామికి స్వేచ్ఛనివ్వండి. అలాగే వారి అభిరుచులను అభినందించండి.
కమ్యూనికేషన్
రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. ఇది ఎన్నో సమస్యలను పరిష్కరించగలదు. మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోతే ఉన్న సమస్యలే కాదు కొత్త సమస్యలు కూడా వస్తాయి. కమ్యూనికేషన్ సరిగ్గా లేని ఏ బంధమైనా సరే ఎక్కువ కాలం కొనసాగదు.
మీ భాగస్వామిని గౌరవించడం
మీ భాగస్వామి భావాలను, అవసరాలను గౌరవించండి. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అయితే మీరు మీ భాగస్వామిని గౌరవించకపోతే లేదా ఎప్పుడూ అతన్ని ముఖ్యం కాదని భావిస్తే నెమ్మదిగా క్రమంగా మీ సంబంధం దెబ్బతింటుంది.