మీది ప్రేమా లేక ఇన్‌ఫాక్చువేషనా? ఇలా తెలుసుకోండి..
ప్రేమకు, ఇన్‌ఫాక్చువేషన్ కు చాలా తేడా ఉంది. ఈ తేడాలను తెలుసుకోలేక చాలా మంది తాము లవ్ లో ఉన్నామాని అనుకుంటారు. కానీ కొన్ని రోజులకే ఇది తెలిసిపోతుంది. ఆ కొన్ని రోజుల జర్నీ బాధను కలిగిస్తుంది. అందుకే ప్రేమకు, ఇన్‌ఫాక్చువేషన్ కు తేడాను ముందే తెలుసుకోవడం మంచిది.
అబ్బాయ్ నన్ను ఎంత ప్రేమిస్తున్నావ్.. నేనంటే ఎంత ఇష్టం చెప్పు అని ప్రేమలో ఉన్నవారు ఖచ్చితంగా అడుగుతుంటారు. నిజమేంటంటే.. ప్రేమను మాటల్లో చెప్పలేం. ఇంత, అంత అంటూ లవ్ ను కొలవలేం. కానీ ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే.. అతను పక్కన ఉన్నా.. లేకున్నా.. అతని ప్రేమను ఫీల్ అవుతారు. అతని పేరు విన్నా పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది. ప్రేమకున్న పవర్ అలాంటిది. ఈ సంగతి పక్కన పెడితే చాలా మంది మొదటి చూపులోనే లవ్ లో పడిపోతుంటారు. ఇంకొంత మంది చాలా కాలం పాటు స్నేహం చేసి.. ఆ తర్వాత ప్రేమించుకుంటారు. ఇందంతా బానే ఉంది. కానీ తమది నిజంగా ప్రేమేనా? లేక ఇన్‌ఫాక్చువేషనా? అన్నది తెలుసుకోలేక పోతుంటారు. ఈ రెండు భిన్నమైన భావాలు. అందుకే మీరు మీ భాగస్వామితో నిజంగా ప్రేమలో పడిపోతున్నారా లేదా ఇన్‌ఫాక్చువేషన్ లో ఉన్నారా తెలుసుకోవాలి.
ప్రేమ వర్సెస్ ఇన్‌ఫాక్చువేషన్
మోహం అనేది ఒకరిపై ఆకర్షణ, ఆసక్తిని కలిగి ఉండటం. ఇది కొంతకాలం వరకే ఉంటుంది. అదే ప్రేమ అయితే మీ భాగస్వామితో జీవితాంతం కలిసుండాలనే మధురమైన అనుభూతి. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ప్రతి సంబంధం మోహంతో ప్రారంభమవుతుంది. కానీ ఈ మోహం నిజమైన నమ్మకంగా, గౌరవంగా మారినప్పుడు ప్రేమ పుడుతుంది. అయితే ప్రేమలో ఉన్నామని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ భాగస్వామి పేరును ఎప్పుడూ తలచుకుంటారు
నిజంగా ప్రేమలో ఉన్నవారు వారి భాగస్వామి పేరును ఎప్పుడూ తలచుకుంటారు. అదికూడా మాటలతో సంబంధం లేకుండా. మీ భాగస్వామి గురించి తరచుగా మాట్లాడితే.. మీరు ఆ వ్యక్తి ప్రేమలో ఖచ్చితంగా ఉన్నారని అర్థం చేసుకోండి.
వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు
మీ భాగస్వామి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారా? అయితే మీ మధ్యనున్నది ప్రేమే. మీ బంధం చాలా ప్రత్యేకమైనదిగా అనిపించి.. అతను లేదా ఆమెను సంతోషపెట్టడానికి మీరు ఏదైనా, లేదా ప్రతిదీ చేస్తారని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ప్రేమలోనే ఉన్నారు.
కొత్త పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారు
మీ భాగస్వామి మిమ్మల్ని కొత్త పనులు చేయమని అడిగితే.. ఇంతకు ముందెప్పుడు మీరు దానిని చేయకపోయినా ప్రయత్నిస్తే వాళ్లంటే మీకు చాలా చాలా ఇష్టం. ఇది మీ మధ్యనున్న బంధాన్ని తెలుపుతుంది.
"మేము" అని మాట్లాడుతారు
ప్రేమలో ఉన్నవారు ‘నేను’ అనే పదానికి బదులుగా ‘మేము’అని మాట్లాడుతారు. మీ భాగస్వామితో ఎలా కలిసి బతకాలి? ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తరచుగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలు మీరు ప్రేమలో ఉన్నప్పుడే వస్తాయి.
లవ్ సాంగ్స్ నచ్చుతాయి
ప్రేమగీతాలు తెగ నచ్చడం మొదలయ్యిందా? నిజానికి ఇలా అందరికీ నచ్చకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు. కానీ ప్రేమలో ఉన్న కొంతమంది ప్రేమ పాటలను వింటునప్పుడు మరింత రొమాంటిక్ అనుభూతి చెందుతారు.
valentine's day
మీ బ్రెయిన్ వారి గురించే ఆలోచిస్తుంది
వాళ్లతో నేను ఖచ్చితంగా ప్రేమలో పడతానని అనుకుంటారు చాలా మంది. అయితే మీరు నిజంగా వాళ్లను ప్రేమిస్తే వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఎలాంటి పనిలో ఉన్నా వారే గుర్తుస్తొంటారు. ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నా మీకు ఇష్టమైన వాళ్లు పక్కాగా గుర్తొస్తారు. అంటే ఎల్లప్పుడూ మీ ఆలోచనలలో వారు ఉంటే ఇది ప్రేమకు సంకేతం.
Image: Getty Images
మీరు వారితో సురక్షితంగా భావిస్తారు
ఏ బంధానికైనా నమ్మకమే పునాది. బలం, ప్రేమ వేరు వేరు కాదు! వారు మీకు భావోద్వేగ, మానసిక, శారీరక భద్రత భావాన్ని ఇస్తే.. మీ బంధం కలకాలం అలాగే ఉంటుంది. ఎందుకంటే వారి పట్ల మీ ప్రేమ చాలా బలంగా ఉంటుంది.