పిల్లలు మానసికంగా బాధపడుతున్నారా? పెరెంట్స్ తెలుసుకునేదెలా?
పెద్దవాళ్లకు ఏవైనా సమస్యలు ఉంటే, మనసులో బాధగా ఉంటే మాటల్లో వ్యక్తపరచగలరు. కానీ, పిల్లలు అలా వారి మనసులోని బాధ, భయాన్ని బయటపెట్టలేరు.

పేరెంటింగ్ టిప్స్..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు సంతోషంగా, ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. పిల్లలు బాధపడకూడదు అని వారు అడిగిందల్లా కొనిచ్చే పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ ఉంటారు. అయితే.. అన్నీ ఇచ్చినా కూడా ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లల స్వభావం మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. చదువుల ఒత్తిడి, సోషల్ మీడియాలో ఒకరిని చూసి మరొకరు పోల్చుకోవడం, కుటుంబ వాతావరణం ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
పెద్దవాళ్లకు ఏవైనా సమస్యలు ఉంటే, మనసులో బాధగా ఉంటే మాటల్లో వ్యక్తపరచగలరు. కానీ, పిల్లలు అలా వారి మనసులోని బాధ, భయాన్ని బయటపెట్టలేరు.మరి, అలాంటి పరిస్థితిలో పిల్లల మనసులోని బాధ, భయాన్ని ఎలా తెలుసుకోవాలి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం...
పిల్లల్లో సడెన్ గా వచ్చే మార్పులు..
ఎప్పుడూ సంతోషంగా ఉండే పిల్లలు.. అకస్మాత్తుగా చిరాకు, కోపం లేదా చాలా నిశ్శబ్దంగా మారితే, మీరు చాలా తేలికగా తీసుకోవద్దు.. పిల్లలు ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడినప్పుడే వారి ప్రవర్తన ఇలా మారుతుంది. పిల్లలు ఎక్కువ సమయ డల్ గా ఉండటం, ఏడ్వడం లాంటివి చేయడం కూడా వారి మానసిక ఆరోగ్యం సరిగా లేదని అర్థం చేసుకోవాలి. గతంలో ఇష్టపడిన వాటిని ఇప్పుడు అస్సలు ఇష్టపడకపోవడం, చిన్న విషయానికే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం కూడా పిల్లల మానసిక ఆరోగ్యం సరిగా లేదు అనడానికి సంకేతాలే అనే విషయం మర్చిపోవద్దు.
చదువులో ఏకాగ్రత..
పిల్లలు చదువులో ఏకాగ్రత తగ్గిపోవడం, టీచర్లు చెప్పేవి సరిగా వినకపోవడం,మార్కులు తగ్గడం, పరధ్యానంగా ఉండటం, చెప్పిన విషయాలను మర్చిపోవడం కూడా పిల్లల మానసిక ఆరోగ్యం సరిగా లేదని చెప్పడానికి సంకేతాలే. స్కూల్ కి వెళ్లడానికి భయపడటం లేదా అనారోగ్యం గురించి పదేపదే సాకులు చెప్పడం కూడా పిల్లలు మానసిక ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవాలి.
శారీరక ఫిర్యాదులు
చాలా సార్లు పిల్లలు తమ మానసిక సమస్యలను శారీరక సమస్యల రూపంలో చూపిస్తారు. తలనొప్పి, కడుపు నొప్పి, అలసట మొదలైనవి. వారి శక్తి తక్కువగా ఉంటుంది.
నిద్ర, ఆహారపు అలవాట్లలో మార్పులు
నిద్రలేమి, తరచుగా పీడకలలు, ఎక్కువగా తినడం లేదా అస్సలు తినకపోవడం కూడా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తాయి.కొందరు పిల్లలు మానేసిన చెడు అలవాట్లను మళ్లీ మొదలుపెడతారు. పేరెంట్స్ ని వదిలి ఉండకపోవడం, కొత్త వ్యక్తులు లేదా వాతావరణం పట్ల చాలా భయపడటం లాంటివి కూడా పిల్లలు చేసే అవకాశం ఉంది.
పేరెంట్స్ ఏం చేయాలి..?
పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు పేరెంట్స్ భయపడకూడదు. పిల్లలను కొట్టడం, తిట్టడం, అరవడం లాంటివి కూడా చేయకూడదు. నెమ్మదిగా మాట్లాడటానికి ప్రయత్నించండి. నిపుణుల సహాయం తీసుకోండి. వారి కౌన్సిలింగ్ తో పిల్లలు మళ్లీ నార్మల్ గా మారే అవకాశం ఉంది.