పిల్లలకు ఫోన్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా?
పిల్లలు బయటకు వెళ్లొదనో, పని చేస్తుంటే డిస్టబ్ చేయొద్దనో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇస్తుంటారు. కానీ దీనివల్ల పిల్లలకు ఏం జరుగుతుందో తల్లిదండ్రులు ఊహించలేరు. అసలు ఫోన్ల వల్ల పిల్లలకు వచ్చే సమస్యలేంటో తెలుసా?

children
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఎంటర్ టైన్మెంట్ అయినా, చదువైనా, పని అయినా అన్నింటి కోసం ఫోన్లనే వాడుతున్నాం. ఏం చేస్తున్నా ఇది మనతోనే ఉంటుంది.
ఒక్క పెద్దవారే కాదు.. పిల్లలు కూడా ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. స్కూలు నుంచి ఇంటికి రాగానే ఫోన్లకు అతుక్కుపోతున్నారు. కానీ ఇది వారి బాల్యాన్ని ఎలా నాశనం చేస్తుంది? వారికి ఎలాంటి సమస్యలు వచ్చేలా చేస్తుందో తల్లిదండ్రులు ఊహించలేకపోతున్నారు. అసలు తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లలకు ఫోన్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది
పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది
పిల్లలు ఫోన్లను ఎక్కువగా చూడటం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ను ఎప్పుడూ చూడటం వల్ల వారి ఏకాగ్రత తగ్గుతుంది. దీనివల్ల వారి చదువుపై , ఇతర కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. అంతేకాదు ఎక్కువగా ఫోన్ చూసే పిల్లలు ఎప్పుడూ చిరాగ్గా, కోపంగా ఉంటారు. ఊరికే కోపం వస్తుంటుంది.
నిద్ర సమస్యలొస్తాయి
పిల్లలు రాత్రిళ్లు ఎక్కువ సేపు ఫోన్ చూడటం అలవాటు చేసుకుంటుంటారు. దీనివల్ల వారికి కంటినిండా నిద్ర ఉండదు. ఇది వారికి నిద్రలేమి సమస్య వచ్చేలా చేస్తుంది. ఫోన్ బ్లూ లైట్ వల్ల నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ప్రభావితం అవుతుంది. దీంతో పిల్లలు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోక రోజంతా బాగా అలసటగా ఉంటారు.
కళ్లపై చెడు ప్రభావం పడుతుంది
ఫోన్ల స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్, రేడియేషన్ వల్ల పిల్లల సున్నితమైన కళ్లు దెబ్బతింటాయి. దీనివల్ల పిల్ల కళ్లు మసకబారడం, కళ్ల చిరాకు, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లద్దాలు వచ్చే అవకాశం ఉంది.
శారీరక శ్రమ లేకపోవడం
ఎప్పుడూ ఫోన్ చూసే పిల్లలు అవుట్ డోర్ గేమ్స్ అస్సలు ఆడరు. దీనివల్ల శారీరక శ్రమ చాలా మటుకు తగ్గుతుంది. దీనివల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే పిల్లలు బాగా బరువు పెరిగిపోయి ఊబకాయం బారిన పడతారు. ఫోన్ చూస్తూ ఎప్పుడూ కూర్చోవడం వల్ల వారి వెన్నెముక, మెడపై ప్రభావం పడుతుంది.
సామాజిక నైపుణ్యాలపై ప్రభావం పడుతుంది
ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు సామాజికంగా బలహీనంగా ఉంటారు. అంటే ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు కుటుంబ సభ్యులతోనే కాదు ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడరు. వీళ్లకు ఇతరులతో మాట్లాడే ఇంట్రస్ట్ అసలే ఉండదు. కాబట్టి దీనివల్ల మీ పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం తగ్గుతాయి.
ఫోన్ వాడకాన్ని నియంత్రించడం ఎలా?
పిల్లలకు ఫోన్ ఇవ్వడానికి బదులుగా వారికి అవుట్ డోర్ గేమ్స్ నేర్పించండి. అలాగే రకరకాల కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయండి. వారిని బిజీగా ఉంచండి. పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడకూడదంటే ఖచ్చితంగా మీరు వారు ఫోన్ చూడటానికి ఒక టైం ని నిర్ణయించాలి. ఆ టైం ప్రకారమే ఫోన్ చూసేలా చేయాలి. అలాగే నిద్రపోవడానికి గంట ముందు పిల్లలు ఫోన్ చూడకుండా చేయాలి. అలాగే వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఎలా ఉపయోగించాలో నేర్పండి. లేదంటే వారు ఫోన్ ను చెడు పనుల కోసం ఉపయోగించొచ్చు.