గంగపుత్రులకు మరింత సాయం: పెరగనున్న''మత్స్యకార భరోసా'' లబ్దిదారులు
కడలే కన్నతల్లనుకుని వెళ్లే గంగపుత్రుల జీవనానికి వేట నిషేధం అతిపెద్ద జీవన ఆటంకం. జీవనాధారమైన చేపల వేట లేకుండా, అరకొర ఆర్థిక సాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు మత్స్యకారులు. ఇప్పుడా పరిస్థితి మారింది. వేట విరామ సాయం వారి జీవితాలకు ఆసరా అవుతోంది.
వేట విరామ సమయంలో ఆర్థికసాయం
61 రోజుల వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఉపాధికోల్పోతారు. కనుక వారికి ప్రభుత్వాలు పరిహారం అందిస్తున్నాయి. 2007 నుంచీ ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంలో మోటార్ బోట్లు, నాటుపడవలతో వేట నిషేధం అమలౌతోంది. గత ప్రభుత్వం కుటుంబానికి రూ.4000 ఇస్తున్న భృతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.10,000 చేసింది. 2019లో తొలిసారి ఈ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా వారి ఖాతాల్లో జమ చేసింది
సబ్సిడీతో సహకారం
ఆర్థికసాయం అందిచడంతోపాటు మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లకు డీజిల్ పై 9రూపాయిల సబ్సిడీనికూడా అందిస్తోంది వైసీపీ సర్కార్. అలాగే డీజిల్ కోసం ప్రత్యేక బంకులను కూడా ఏర్పాటు చేయనుంది.
లక్షకు పైగా లబ్దిపొందుతున్న కుటుంబాలు
2019లో సెప్టెంబర్ లో మత్స్యకారభరోసా పథకాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చినా ఈ ఏడాది వేట నిషేధ ఆరంభంలోనే అందిస్తున్నారు. 2020 సంవత్సరానికి మే 6వ తేదీన లబ్దిదారుల ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. గతంలో 1.35 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగి, 1.9 లక్షల మంది మత్స్యకార భరోసా అందుకోబోతున్నారు. మర పడవలకే కాకుండా తెప్పల్లో వెళ్లే మత్స్యకారులను కూడా లబ్దిదారులుగా చేర్చారు.
సంక్షేమం దిశగా మరిన్ని చర్యలు
సముద్రంలోకి వెళితే తిరిగొచ్చేవరకూ మత్స్యకారుల ప్రాణాలు నీటిలో దీపాలే. గతంలో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లి మరిణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. అయితే చాలా కుటుంబాలకు ఆ సాయం అందడానికి సంవత్సరాల సమయం పట్టేది. సీఎం వైయస్ జగన్ ఆ నష్టపరిహారం మొత్తాన్నీ 10 లక్షలకు పెంచారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. అలాగే పరిహారాన్ని వెనువెంటనే అందించేలా ఆదేశాలిచ్చారు.
ఏపీ నుంచి దాదాపు 25000 మంది జాలర్లు గుజరాత్ లోని వీరావళీకి వేట కోసం వలస వెళ్తుంటారు. ఇందులో సుమారు 13000 మందికి పైగా శ్రీకాకుళం నుంచే ఉంటారు. మరబోట్లు కొనే స్తోమత లేక వీరంతా దూరప్రాంతాలకు కూలీలుగా వలసలు వెళ్తుంటారు. ఈ వలసలు ఆపేందుకు త్వరలో 8 చోట్ల ఫిష్షింగ్ హార్బర్లు, ఒక జెట్టీ నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ హామీ ఇచ్చారు. హేచరీస్, కోల్డ్ స్టోరుజీల విషయంలోనూ చొరవ తీసుకుంటున్నారు. ఆక్వా రైతులకు రూ.1.50 కే విద్యుత్ అందిస్తున్నారు.