క్లారిటీ: అన్న జగన్ వ్యూహంతోనే తెలంగాణలో షర్మిల
2023 ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిసారించిన షర్మిల ఎన్నికల్లో అనుసరించబోయే స్ట్రాటజీ విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగా అవగతమవుతుంది. విషయానికి వస్తే అన్న జగన్ మోహన్ రెడ్డి స్ట్రాటజీని ఫాలో అయి విజయం సాధించాలని అనుకుంటున్నారట.
తెలంగాణ రాజకీయాల్లోకి అనూహ్య రీతిలో ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. తెలంగాణ కోడలిని అంటూ ఆంధ్రప్రదేశ్ ని వదిలి తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభ లో ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేసేందుకు ఆ రాజన్న పాదయాత్రను ప్రారంభించిన ఏప్రిల్ 9నే పార్టీ ప్రారంభించడానికి ముహూర్తంగా ఎంచుకున్నారు.
ఇప్పటికీ ఇంకా షర్మిల పార్టీ పెట్టడం వెనుక ఎవరు ఉన్నారు, జగన్ తో అభిప్రాయభేధాలతోనే పార్టీని స్థాపించబోతున్నారా అనే ప్రశ్నలకు ఇంకా సరైన సమాధానాలు దొరకడంలేదు అని అంతా తికమకపడుతుండగానే ఆమె మాత్రం చకచకా పార్టీని స్థాపించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసేసుకుంటున్నారు. అంతే కాకుండా తాను పోటీచేయబోయే నియోజకవర్గం పేరును కూడా ఆమె ఇప్పటికే ప్రకటించేసారు కూడా.
2023 ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిసారించిన షర్మిల ఎన్నికల్లో అనుసరించబోయే స్ట్రాటజీ విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగా అవగతమవుతుంది. ఆమె ఎన్నికల విషయానికి వస్తే అన్న జగన్ మోహన్ రెడ్డి ఏ స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యారో అదే స్ట్రాటెజిని ఫాలో అయి విజయం సాధించాలని అనుకుంటున్నారట.
జగన్ మోహన్ రెడ్డి 2014లో కానీ, 2019లో కానీ ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. వైసీపీ సొంతగా ఎన్నికలకు వెళ్ళింది. 2014, 2019లో బీజేపీతో పొత్తు ఉండబోతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ... అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. జగన్ ఒంటరిగానే పోటీచేశారు. 2014లో విజయం సాధించలేకపోయినప్పటికీ... 2019లో మాత్రం ల్యాండ్ స్లైడ్ విజయాన్ని నమోదు చేసారు జగన్ మోహన్ రెడ్డి.
2014లో పొత్తు లేకపోవడం వల్లే ప్రతిపక్షంలో కూర్చున్నాము అని కొందరు వైసీపీ నేతలు లోలోన మదనపడ్డప్పటికీ... 2019 ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీతో టీడీపీ పొత్తును ఎత్తిచూపడం వైసీపీకి బాగా కలిసొచ్చిందన్న వాదనను ఎవరూ కాదనలేరు.
ఇప్పుడు షర్మిల సైతం అన్న బాటలోనే పయనిస్తూ తెలంగాణాలో ఎవరితో కూడా పొత్తుకు సంసిద్ధంగా లేరని సమాచారం. తెరాస పిలిస్తేనో, బీజేపీ చెబితేనో తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టడానికి రాలేదని... తమకు ప్రజాబలం, ఆ దేవుని ఆశీస్సులు రెండు ఉన్నాయని, ఎన్నికల్లో తమను గెలిపించడానికి అవి రెండు సరిపోతాయని ఆమె అన్నారు. ఈ నమ్మకం తోనే 2023 ఎన్నికల్లో ఒంటరి పోరుకు సై అంటున్నారు.