జగన్ చేసిన పొరపాట్లే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీకి పురుడు
శాయశక్తులను ఒడ్డి జగన్ ను ముఖ్యమంత్రిని చేయడంకోసం కష్టపడ్డ తనకు సరైన గుర్తిపు ఇవ్వలేదనేది షర్మిల మనసును కలిచివేస్తున్న అంశం అనేది బయట వినబడుతున్నమాట. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ మాటిచ్చి నిలబెట్టుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ను వదిలి తెలంగాణ కోడలిని అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 9 ముహూర్తం అని వార్తలు వస్తున్నాయి కూడా. ఇప్పటికే తెలంగాణలోని కొందరు నేతలను కలుస్తూ లోటస్ పాండ్ దగ్గర హడావుడి చేస్తూ రోజు వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో పాదయాత్రను కూడా ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక షర్మిల పార్టీని ప్రారంభించబోతున్నారు అని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చినప్పుడు ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇదో గాలి వార్త అని అందరూ కొట్టిపారేశారు. షర్మిలకు తెలంగాణాలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక వేళా అన్నతో బేదాభిప్రాయాలు ఉంటే ఏపీలో పెడుతుంది కానీ తెలంగాణాలో ఎందుకు ప్రారంభిస్తారు అని ప్రశ్నలు లేవనెత్తారు. కానీ అందరిని విస్మయానికి గురిచేస్తూ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సన్నద్ధమయ్యారు.
ఇకపోతే షర్మిల రాజకీయ పార్టీ పెట్టడానికి జగన్ తో వచ్చిన పొరపచ్చాలే కారణం అనే విషయం బలంగా వినబడుతుంది. ఆ పొరపచ్చాలకు కారణం షర్మిలకు తగిన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది వినబడుతున్న వాదన. జగన్ విజయం కోసం షర్మిల చాలా తీవ్రంగా కష్టించారనేది నిర్వివాదాంశం. జగన్ జైలులో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. ఎన్నికలప్పుడు సైతం పూర్తిస్థాయిలో ప్రచారం చేసారు.
శాయశక్తులను ఒడ్డి జగన్ ను ముఖ్యమంత్రిని చేయడంకోసం కష్టపడ్డ తనకు సరైన గుర్తిపు ఇవ్వలేదనేది షర్మిల మనసును కలిచివేస్తున్న అంశం అనేది బయట వినబడుతున్నమాట. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ మాటిచ్చి నిలబెట్టుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఆ వాదనకి బలం చేకూరుస్తూ తాజాగా విలేఖరుల సమావేశంలో తనకు రాజ్యసభ సీటెందుకు ఇవ్వలేదో వెళ్లి జగన్ నే అడగండి అనే మాట అనడంతో అంతా కూడా షర్మిలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే పార్టీ పెడుతున్నారు అనే ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ నాలుగు రాజ్యసభ ఖాళీలకు గానూ జగన్ మోపిదేవి, పిల్లి, అయోధ్య రమి రెడ్డి, పరిమళ్ నత్వాని ల పేర్లను ప్రతిపాదించారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా వచ్చి జగన్ ని కలిసేసరికి రాజకీయంగా ఏర్పడ్డ తప్పనిసరి పరిస్థితుల వల్ల ఆ సీటును నత్వానికి కట్టబెట్టవలిసి వచ్చింది. అయోధ్య రామిరెడ్డి పేరును సైతం ఎందుకు ప్రతిపాదించారో అర్థం చేసుకోవచ్చు.
కానీ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ మీద కోపంతో, మండలిలో అన్ని బిల్లులకు అడ్డుపడుతున్నారని కారణంతో మండలిని రద్దు చేస్తానని నిర్ణయం తీసుకోవడం వల్ల వారితో మంత్రి పదవికి సైతం రాజీనామా చేపించి వారిని రాజ్యసభకు పంపించారు. ఎలాగూ జగన్ మండలిని రద్దు చేపించగలిగింది లేదు. ఇప్పుడు రద్దు చేయాలనీ అనుకోవడంలేదు కూడా. ఒకవేళ గనుక అప్పుడే ఒక్క క్షణం ఆలోచించి ఉంటే... షర్మిలకు సైతం రాజ్యసభ సీటు దక్కి ఉండేదనే వాదన వినబడుతుంది. ఒకవేళ అదే జరిగితే షర్మిల నేడు తెలంగాణలో పార్టీ పెట్టేదే కాదు కదా..! సో మొత్తానికి టీడీపీ పై జగన్ పంతం నెగ్గించుకునే ప్రయత్నం.... చుట్టు తిరిగి తెలంగాణ లో ప్రకంపనలు సృష్టిస్తుందన్నమాట.