బిజెపికి జగన్ క్లోజ్: పవన్ కల్యాణ్ ముందు నుయ్యి వెనక గొయ్యి
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నడుమ పూర్తి సందిగ్ధావస్థలో పడ్డాడు పవన్ కళ్యాణ్. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది జనసేనాని పరిస్థితి. బీజేపీ వైసీపీతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుండడంతో..... మిత్రపక్షమైన జనసేన పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు వైసీపీని హిందుత్వ కార్డు ప్రయోగిస్తూ టార్గెట్ చేసిన బీజేపీ నాయకత్వం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కేంద్ర నాయకుల మాట అటుంచినప్పటికీ.... రాష్ట్ర నాయకులు సైతం పూర్తిగా మౌనం వహిస్తున్నారు.
జగన్ ఏకంగా ఢిల్లీ వెళ్లి హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ వంటివారిని వరుసగా కలవడం, జగన్ ను ఎన్డీఏ లోకి బీజేపీ ఆహ్వానించిందన్న వార్తలు సైతం వెలువడ్డాయి. రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తే బీజేపీ వైసీపీకి ప్రాధాన్యత ఇస్తుందనేదయితే తేటతెల్లం.
ఇక ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నడుమ పూర్తి సందిగ్ధావస్థలో పడ్డాడు పవన్ కళ్యాణ్. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది జనసేనాని పరిస్థితి. బీజేపీ వైసీపీతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుండడంతో..... మిత్రపక్షమైన జనసేన పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది.
జగన్ అంటే పవన్ కళ్యాణ్ కి ససేమిరా పడదు. ఆయన జగన్ ని ఏ విధంగా టార్గెట్ చేసారో అందరికి తెలిసిన విషయమే. జగన్ అధికారం చేబట్టిన తరువాత కూడా పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో దూకుడును ప్రదర్శిస్తున్నాడు. కానీ ఇప్పుడు బీజేపీ వైసీపీతో సన్నిహితంగా మెలగడం ఆయనకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టేలా కనబడడమే కాకుండా... చేసిన పాత తప్పులని మరల చేపించేలా కూడా పరిస్థితులు తలెత్తబోతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారును విపరీతంగా టార్గెట్ చేసారు. ప్రతిపక్షం ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని, కానీ ఆయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి మీదనే ఎదురుదాడికి దిగారు.
ఆయన వైఖరి వల్ల జనసేన, టీడీపీ ఒక్కటే అని జనాల్లోకి బలంగా వైసీపీ తీసుకెళ్లి లాభపడగలిగింది. ఇప్పుడు రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితుల వల్ల మరొకమారు అదే పరిస్థితి ఎదురయ్యేలా కనబడుతుంది.
బీజేపీ గనుక వైసీపీ మీద వారి ఎదురుదాడిని తగ్గిస్తే రాజకీయంగా లాభపడడానికి వారు టీడీపీ మీద రాజకీయ దాడిని ముమ్మరంచేయాల్సి ఉంటుంది. అదే గనుక జరిగితే మిత్రపక్షం అయినందువల్ల జనసేన కూడా అదే బాట పట్టాలి.
గతంలోనూ ప్రతిపక్షంపైన్నే దాడి చేసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు కూడా మరొకమారు ప్రతిపక్షంపైన్నే దాడిచేయాల్సి ఉంటుంది. ప్రశ్నిస్తాను, నిలదీస్తాను అని అనే పవన్ కళ్యాణ్ ఇక ఎవరిని నిలదీస్తున్నట్టు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించనిది ఆయన ప్రజల కోసం ఏమి పోరాటం చేసినట్టు? ప్రజల తరుఫున నిలబడే నాయకుడు ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలు కూడా గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు బ్రహ్మరథం పడతారు.
కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే ప్రశ్ననార్థకంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే అమరావతి విషయంలో ఒకసారి బీజేపీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్.... ఇప్పుడు మరోమారు చేసిన తప్పునే మరోమారు చేసే పెద్ద తప్పును చేయబోతున్నట్టుగా కనబడుతోంది.