టీడీపీ దిగదుడుపు: వైఎస్ జగన్ ను చంద్రబాబు ఎదుర్కోగలరా?
గత అసెంబ్లీ ఎన్నికల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) ప్రతి ఎన్నికలోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంటే టిడిపి (TDP) మాత్రం ఘోర పరాభవాలను చవిచూస్తూనే వుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ (YS Jaganmohan Reddy) ను చంద్రబాబు (Chandrababu Naidu) ఎదుర్కోగలరా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది.
తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పుంజుకోగలదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన టీడీపీ పుంజుకోవడానికి చాలా కష్టమే పడాల్సి ఉంటుంది. టీడీపీకి తిరిగి జీవం పోయడానికి తగిన వ్యూహరచన, ప్రణాళిక చంద్రబాబు వద్ద ఉందా అనేది సందేహం. జగన్ చేస్తున్న ఎదురుదాడిని ఎదుర్కోవడానికే టీడీపీ నాయకులు సత్తా సరిపోవడం లేదనే మాట వినిపిస్తోంది.
చంద్రబాబు ఎక్కువ కాలం హైదరాబాదులో ఉంటూ పార్టీ నాయకులకు తగిన సూచనలు చేస్తున్నారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ఎంపిక చేసిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అచ్చెన్నాయుడు రాష్ట్రవ్యాప్తంగా నాయకులను, కార్యకర్తలను కదిలించే పని చేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు టీడీపీ సీనియర్ నాయకులను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్నే అనుసరిస్తున్నారు.
దేవినేని ఉమామహేశ్వర రావు, చింతమనేని ప్రభాకర్, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి వంటి పలువురు సీనియర్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటి నుంచి బయటపడడానికే వారికి సమయమంతా సరిపోతోంది. రాష్ట్రంలోని సమస్యలపై పోరాటం చేయడానికి తగిన వ్యవధి కూడా వారికి దోరుకుతున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగిక, ఇతర దాడులపై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు గాలికి కొట్టుకుపోతున్నాయి.
వివిధ అంశాలపై చంద్రబాబు పార్టీ నాయకులను, కార్యకర్తలను కదిలిస్తూ నిలకడగా ఉద్యమాలను లేదా ఆందోళనలను నిర్వహించలేకపోతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, మూడు రాజధానుల అంశం వంటి అంశాలపై కూడా టీడీపీ నిర్వహించిన పోరాటాలు సుదీర్ఘ కాలం సాగడం లేదు. చంద్రబాబు ఈ విషయంలో విఫలమైనట్లుగా కనిపిస్తున్నారు.
చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చురుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులను పలకరిస్తూ, జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు పెడుతున్నారు. తద్వారా కార్యకర్తల్లో జోష్ నింపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇది కూడా అంతగా ఫలితం ఇస్తున్నట్లు కనిపించడం లేదు.
కాగా, శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉంది. ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాల్సే ఉంది. అయితే, జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించనున్నారు. గతంలో చెప్పిన మాట ప్రకారం చాలా మంది మంత్రులను మార్చవచ్చు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రివర్గం కూర్పు ఉంటుందని భావిస్తున్నారు. కొంత మంది సీనియర్ మంత్రులను కొనసాగిస్తూ దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్యేలను కొందరిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని అంటున్నారు.