విజయసాయి రెడ్డికి వైఎస్ జగన్ షాక్: అసలేం జరిగింది, ఏం జరుగుతుంది?
విజయ సాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేయడం, రాష్ట్ర కార్యాలయ బాధ్యతల నుండి కూడా తప్పించడం .... ఇవన్నీ చూస్తుంటే, ఆయనకు పార్టీలో ప్రాముఖ్యత తగ్గుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గానే ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న కొత్త పరిణామాలతో... ఫ్రెష్ గా చూసే ప్రజలకు రంజుగా మారుతున్నాయి. అచ్చెన్నాయుడు రిలీజ్ హై డ్రామాల మధ్య కూడా ఇంకో ఆసక్తికర అంశం చర్చకు రావడం ఆ విషయం ప్రత్యేకతను చెప్పకనే చెబుతుంది.
ఈ అంశం ఏ విపక్ష అధికార పక్ష గొడవో కాదు. స్వయంగా అధికార పక్షంలోని ఒక అంతర్గత వ్యవహారం. అదే విజయసాయి రెడ్డి వ్యవహారం. ఆయన పార్టీలో నెంబర్ 2 గా కొనసాగారు. ఎన్నికల ముందు నుండి జగన్ వెన్నంటి నడిచారు. కానీ హఠాత్తుగా ఆయన ప్రాభవం పార్టీలో తగ్గుతున్నట్టుగా కనబడుతుంది.
నిన్న జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు కీలక నేతలకు అప్పగించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసమని ఈ మార్పులు అన్నారు.
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల, వైవీ సుబ్బారెడ్డికి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల, సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను అప్పగించారు.
అంతేకాకుండా తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. మొన్నటివరకు ఈ బాధ్యతలను విజయసాయి రెడ్డి చూసుకునేవారు.
విజయ సాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేయడం, రాష్ట్ర కార్యాలయ బాధ్యతల నుండి కూడా తప్పించడం .... ఇవన్నీ చూస్తుంటే, ఆయనకు పార్టీలో ప్రాముఖ్యత తగ్గుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతాన్ని విశాఖకు తరలిస్తున్నారు కాబట్టి, విశాఖ ప్రాంతంలో పూర్తిగా పట్టు సాధించడానికి వియజయసాయి రెడ్డి గారికి ఆ బాధ్యతహలను అప్పగించారు అని అనొచ్చు. కానీ... వర్ధమాన పరిస్థితులు చూస్తుంటే మాత్రం వేరేలా కనబడుతున్నాయి. అక్కడ ఇప్పటికే బొత్స వంటి సీనియర్ మాస్ లీడర్స్ ఉన్నారు, అక్కడకు విజయసాయి రెడ్డిని ఇంఛార్జిగా నియమించడానికి కారణాలు జగన్ కే తెలియాలి.
కొన్ని రోజుల కింద జగన్ వాహనంలో విజయసాయి రెడ్డిని దింపేశారని వార్తలు వచ్చాయి. ఆయన వైజాగ్ పర్యటన సందర్భంగా వీడియో బయటకు కూడా వచ్చింది. కానీ మంత్రి ఆ పర్యటనలో కీలకం అవడం వల్ల దిగిపోయారు అని దానికి వివరణ కూడా ఇచ్చారు.
ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటి నుండి ఆయన విషయంలో అన్ని రాజకీయ పరిణామాలను గనుక దగ్గరగా పరిశీలిస్తేమనకు అనేక విషయాలు అవగతమవుతాయి. విజయసాయి రెడ్డి పై రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలే తీసుకోండి. ఆయన పదే పదే విజయసాయి ఆధ్వర్యంలోని సోషల్ మీడియా సెల్ తనను టార్గెట్ చేసిందని అన్నారు.
రఘురామ బీజేపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు అన్న విషయాన్నీ పక్కకుంచితే.... తాను ఒక వెబ్ సైట్ తనను కించపరుస్తూ రాసిన కథనంపై స్పీకర్ కి ఫిర్యాదు చేసినందుకు కూడా షో కాజ్ నోటీసు జారీ చేస్తారా అని రఘురామా అన్న విషయం మనకు గుర్తుండే ఉంటుంది.
ఢిల్లీలో మొన్నామధ్య రఘురామకృష్ణంరాజు వ్యవహారం గురించి కొందరు కేంద్ర మంత్రులతో వైసీపీ ఎంపీ బాలశౌరి వరుసగా భేటీ అయ్యారు. వాస్తవానికి ఢిల్లీలోని వైసీపీ అన్ని కార్యక్రమాలను చూసుకునేది విజయసాయి రెడ్డి. కానీ ఆయన బదులుగా బాలశౌరీ అలా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవడం విజయసాయి ప్రాముఖ్యతపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇక అంతర్గతంగా వైసీపీలోనే ఒక చర్చ ఉంది. ఆయన రాయలసీమ ప్రాంత రెడ్లను జగన్ కు దగ్గరవ్వనీయకుండా అడ్డుపడుతున్నారు అని కొందరు వాదిస్తున్నారు. వైసీపీలో కొందరు నేతలు దీనిపై బాహాటంగానే కొన్ని సమావేశాల్లో సైతం ప్రస్తావించారు. జగన్ బంధువులు సైతం ఈ విషయంలో నొచ్చుకున్నట్టు సమాచారం.
ఆయన కేవలం కోస్తా ప్రాంతీయ రెడ్లకే పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనే అపవాదు కూడా ఉంది. రాయలసీమ రెడ్లకు ఎదగడానికి అవకాశం ఇవ్వకుండా కేవలం ఆంధ్రప్రాంత రెడ్లకు మాత్రమే ఆయన అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
మరో అంశం నెల్లూరు. నెల్లూరు పెద్దా రెడ్లు మంత్రి అనిల్ కుమార్ వ్యవహారంలో చాలా గుర్రుగా ఉన్నారు. వారిని కలుపుకుపోవడంలేదని వారు బహిరంగ విమర్శలు చేసారు. ఆనం నుంచి మొదలుకొని నల్లపురెడ్డి వరకు అందరూ ఇదే పాట పాడారు. వారి మధ్య ఏర్పడ్డ అగాధాన్ని కూడా విజయసాయి రెడ్డి పూడ్చలేకపోయారట.
సోషల్ మీడియా కూడా చాలాసార్లు జగన్ కి కొన్ని తలనొప్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా రమేష్ కుమార్ వ్యవహారంలో. ఆ సోషల్ మీడియాకి హెడ్ గా వ్యవహరిస్తోంది కూడా వియజయసాయి రెడ్డియే. ఆ ఒక్క సందర్భంలోనే కాకుండా అనేక సార్లు సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని విషయాలపై వివరణ ఇచ్చుకోవలిసి వచ్చింది. కోర్టులను సైతం వారు తప్పుబడుతూ... న్యాయవస్థపైన్నే తీవ్ర వ్యాఖ్యలను చేసి కోర్టు ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది.
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ప్రాధాన్యత పార్టీలో తగ్గినట్టుగా చెబుతున్నారు. ఆయన వైఖరి పట్ల పార్టీలోని చాలామంది సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ జగన్ దాక వెళ్లినట్టు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అంటున్నారు. పార్టీ ఆఫీస్ బాధ్యతలనుండి కూడా ఆయనను తప్పించడం, సజ్జల రామకృష్ణ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించడం జరిగిందంటున్నారు.