తెలంగాణ పీసీసీ: రేవంత్ రెడ్డికి కొర్రీలు పెడుతున్న నేతలు వీరే...
తెలంగాణ కాంగ్రెసులో పలువురు సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కకుండా కొర్రీలు వేస్తున్నారు. కాంగ్రెసులో పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు
తెలంగాణ కాంగ్రెసులో పలువురు సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కకుండా కొర్రీలు వేస్తున్నారు. కాంగ్రెసులో పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. వారంతా సీనియర్ నేతలు కావడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే మొదటి నుంచీ కాంగ్రెసులో ఉంటున్నావారికి, కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి మధ్య అంతర్గత పోరుగా ఇది మారింది.
మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలనే ప్రతిపాదనను బహిరంగంగానే తప్పు పడుతున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తన దారి తాను చూసుకుంటానని ఆయన పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు కూడా. విహెచ్ ఇందిరా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఒక రకంగా నమ్మినబంటు. అందుకు ఆయనకు రాజ్యసభ సీటు కూడా దక్కింది
రేవంత్ రెడ్డిని అడ్డుకుని తాను పీసీసీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలనే ఎత్తుగడల్లో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు. ఆయన చాలా కాలంగా పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఇందుకుగాను ఆయన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా వ్యతిరేకించిన సందర్భాలున్నాయి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. తాను కూడా పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడినే అని చెబుకున్నారు. పిసిసి అధ్యక్ష పదవికి సూచించిన పేర్లలో తన పేరు లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన అండదండలు అందించారు
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తీరే వేరు. కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రిని అవుతానని ఆయన నమ్ముతూ ఉంటారు. ఆయన ప్రత్యక్షంగా ఎవరినీ వ్యతిరేకించరు, ఎవరినీ తప్పు పట్టారు. కానీ తాను వేసే ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆయన నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ ఎన్నిక పేరు చెప్పి ఆయన పీసీసీ అధ్యక్షుడి నియామకం ప్రక్రియను ఆపించారు
మల్లు భట్టి విక్రమార్క కూడా పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ ఉండవచ్చు. కానీ ఆయన బయపడడానికి సిద్ధంగా లేరు. అదే సమయంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా ముందుకు రావడానికి సిద్ధంగా లేరు. కానీ ఆయన కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేవారిలో ఉన్నారని అంటారు.
మొత్తంగా కాంగ్రెసు పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు అందరు కూడా పిసిసి అధ్యక్ష పదవులకు అర్హులమనే చెబుకుంటారు. మొదటి నుంచి కూడా కాంగ్రెసు పార్టీ అంతర్గత కుమ్మలాటలే కొంప ముంచుతున్నాయి. పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ కావడం కాంగ్రెసు పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఇలాంటి స్థితిలో తెలంగాణలో కాంగ్రెసు నెట్టుకు రావడం అంత సులభమేమీ కాదు.