తెలంగాణ మున్సిపోల్స్: బిజెపికి పవన్ కల్యాణ్ కరివేపాకు
మరో మూడు రోజుల్లో జరగనున్న తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో బీజేపీ వ్యవహరించిన తీరు ఇప్పుడు జనసైనికులను మాత్రమే కాదు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో, ప్రజల తరుఫున పాలకులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒక బలమైన ముద్రను వేయలేకపోయారు. మొదట బీజేపీకి మద్దతిచ్చి ఆ తరువాత కమ్యూనిస్టులతో జతకట్టి బీజేపీని మతతత్వ పార్టీ అంటూ విమర్శించినా... పవన్ కళ్యాణ్ మరల పార్టీ మనుగడ కోసం అదే బీజేపీతో పొత్తు కట్టారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీతో పీడీపీ సైతం పొత్తు పెట్టుకుంది. కాబట్టి రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నేతల ఇష్టం. కానీ బీజేపీతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ కి పెద్దగా ఒరిగింది మాత్రం ఏమీ లేదు. పై పెచ్చు తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కోవలిసి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇటు తెలంగాణలో సైతం అదే పరిస్థితి కనబడుతుంది. ఒకసారి పొత్తు ఏపీ వరకే పరిమితం అంటారు, మర్నాడు పవన్ తో కలిసి బీజేపీ పనిచేస్తుంది అంటారు. ఈ పరిస్థితుల్లో అయోమయం చెందడం జనసైనికుల వంతవుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగంగా తెరాస అభ్యర్థికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో బీజేపీ జనసేనల పొత్తు ఉండబోదు అని అంతా ఒక నిర్ణయానికి వస్తున్న తరుణంలోనే తెలంగాణలోని మునిసిపల్ ఎన్నికలు వచ్చేసాయి.
మరో మూడు రోజుల్లో జరగనున్న తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో బీజేపీ వ్యవహరించిన తీరు ఇప్పుడు జనసైనికులను మాత్రమే కాదు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు అవసరం అంటూనే వారికి దక్కాల్సిన న్యాయమైన వాటాను మాత్రం ఇవ్వడంలేదని అందరి నోటా వినబడుతున్న మాట. ఈ విషయమై జనసైనికులైతే తీవ్రమైన కోపంతో ఉన్నట్టుగా తెలియవస్తుంది.
ఈ మునిసిపల్ ఎన్నికల్లో జనసేన ఖమ్మంలో బలంగా ఉంది. ఇక్కడ జనసేన ఒంటరిగా పోటీచేసినా కొన్ని సీట్లు దక్కించుకోవచ్చని జనసైనికులు ఎప్పటినుండో కూడా లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోవడం, కాంగ్రెస్ కి బలమైన నాయకత్వం లేకపోవడం, బీజేపీ ఖమ్మంలో ఇంకా బలపడకపోవడం అన్ని వెరసి తమకు కలిసివస్తాయని వారు లెక్కలుకట్టారు.
కానీ అనూహ్యంగా వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఖమ్మంలో తాము బలహీనంగా ఉన్నామని గుర్తించిన బీజేపీ... అక్కడ జనసేనతో పొత్తుకు సిద్ధపడింది. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ 60 సీట్ల ఖమ్మం కార్పొరేషన్లో జనసేనకు దక్కవలిసిన న్యాయమైన వాటా మాత్రం వారికి దక్కలేదు.
జనసేనకు తొలుత 12 సీట్లను కేటాయించాలంటూ మొదలైన చర్చల్లో బేరాలాడసాగారు బీజేపీ నేతలు. తరువాత ఆరు సీట్లిస్తామని చివరకు 5 సీట్లకు తెగ్గొట్టారు. ఇందులో కూడా రెండు సీట్లలో బీజేపీ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. సో ఓవరాల్ గా జనసేనకు దక్కింది 3 సీట్లు. ఇక్కడింకొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బీజేపీ జనసేన కలిసి మొత్తం 60 వార్డులకు గాను కేవలం 52 వార్డుల్లోని అభ్యర్థులను నిలబెట్టగలిగారు.
ఇక బీజేపీ బలంగా ఉన్న వరంగల్ లో తమకు సీట్లు దక్కుతాయని భావించిన జనసేన ఆశావహులకు చుక్కెదురైంది. వరంగల్ లో పొత్తుకు బీజేపీ నిరాకరించింది. ఇది పవన్ కళ్యాణ్ ను కూరలో కరివేపాకులా వాడుకొని వదిలేయడం మాత్రమే కాకుండా వెన్నుపోటు పొడవడమేనని జనసైనికులు వాపోతున్నారు.