కరోనా కట్టడి: రంగంలోకి దిగిన తమిళసై, కేసీఆర్ కు మరిన్ని చిక్కులు
గతంలో తెలంగాణాలో టెస్టులను ఎందుకు ఎక్కువగా నిర్వహించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తే,... ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తమ వద్ద ఎక్విప్మెంట్ లేదు అని, తమకు రావలిసిన మెషీన్లను పశ్చిమ బెంగాల్ కి కేంద్రం తరలించుకుపోయిందని ఆరోపించారు.
కరోనా వైరస్ మహమ్మారి దాడి ప్రారంభమైన తొలినాళ్లలో పారాసిటమాల్ చాలు అని వ్యాఖ్యానించిన కేసీఆర్ ఆతరువాత ఒకింత సర్దుకొని తెలంగాణాలో కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు రంగంలోకి దిగారు. రోజు ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ కరోనా పై పోరులో తెలంగాణ ముందుందంటూ చెప్పారు.
అప్పట్లో కేసీఆర్ అందరికంటే ముందుగా లాక్ డౌన్ విధించడం దగ్గరి నుండి మొదలు రాష్ట్రంలో చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు హామీ ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా కూడా నిలిచారు. వలస కార్మికులను రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములుగా పేర్కొంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు.
లాక్ డౌన్ కాలంలో ఎంతోపేరు తెచ్చుకున్న కేసీఆర్... ఆతరువాతి కాలంలో మాత్రం చాలా అపఖ్యాతిని మూటగట్టుకోవాలిసి వస్తుంది. రాష్ట్రంలో తక్కువగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు ఇందుకు ముఖ్యకారణం. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారని కేంద్రం నుండి మొదలు హైకోర్టు వరకు అందరూ పదే పదే విమర్శించారు.
కేంద్ర బృందం హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణాలో టెస్టులను పెంచారు. తొలుత టెస్టులను పెంచితే కరోనా కేసులు పెరుగుతాయా అని వాదించిన ప్రభుత్వానికి ఇప్పుడు టెస్టులతోపాటుగా కేసులు పెరగడం, అది కూడా దేశంలోనే అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవడం కలవరానికి గురి చేసే అంశం.
ఇక కరోనా వైరస్ ప్రగతి భవన్ కి కూడా చేరుకోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కి మకాం మార్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కనబడకుండా పోవడంతో వేర్ ఈజ్ కేసీఆర్ అని ప్రజలు బాహాటంగానే గొంతెత్తి విమర్శించారు. ఏకంగా ప్రగతి భవన్ ముందుకే వచ్చి ఒక యువకుడు ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
ఇక గతంలో తెలంగాణాలో టెస్టులను ఎందుకు ఎక్కువగా నిర్వహించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తే,... ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తమ వద్ద ఎక్విప్మెంట్ లేదు అని, తమకు రావలిసిన మెషీన్లను పశ్చిమ బెంగాల్ కి కేంద్రం తరలించుకుపోయిందని ఆరోపించారు.
ఇప్పటికే కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో, సోషల్ మీడియాలో ఒకింత వ్యతిరేకత ఎదురవుతున్న వేళ.... తమిళిసై సౌందరరాజన్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు.
నిన్న ఆమె కేంద్ర మంత్రి గాంగ్వర్ కి ఈఎస్ఐ ఆసుపత్రిలో రోజుకి 300 రాపిడ్ టెస్టులను నిర్వహించేందుకు వీలుగా సదుపాయాలను మంజూరు చేయడంతోపాటుగా, కోవిడ్ ఐసీయూ బెడ్లను, వెంటిలేటర్లను సాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫోన్లో మాట్లాడగానే ఒప్పుకున్నందుకు థాంక్స్ అని రాసుకొచ్చారు.
ఆ ట్వీట్ చేసిన కొద్దీ సేపటికి, మరో ట్వీట్ లో ఈఎస్ఐ ఆసుపత్రి సేవలను సాధారణ ప్రజలు కూడా ఉపయోగించుకునేలా ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలించండి అని మరో ట్వీట్ చేసారు.
వాస్తవానికి రాష్ట్రంలో ప్రజల కష్టాలను తీర్చాల్సిన ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా గవర్నర్ ఈ విధంగా చేయడం ప్రజల్లో కేసీఆర్ సర్కార్ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చే ఆస్కారాన్ని మరింతగా పెంచుతుంది. ముఖ్యమంత్రి కానీ, ఆరోగ్య మంత్రి కానీ కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి అవసరమైనసామాగ్రిని తెప్పించాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ గవర్నర్ రాష్ట్రంలో కరోనా టెస్టులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ అని చెప్పక తప్పదు.
ఇప్పటికే కేసీఆర్ ను కరోనా విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు సమాయత్తమవుతున్న బీజేపీ.... ఈ సంఘటనను చూపెట్టి కేసీఆర్ ను మరింతగా ఇరుకునపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే రాష్ట్రంలో యాక్టీవ్ గా వ్యవహరిస్తున్న గవర్నర్ ఈ చర్యలతో మరింతగా పాపులారిటీ సంపాదిస్తున్నారు.
గవర్నర్ ట్విట్టర్ చూస్తే..... చాలా మంది సామాన్యులు సైతం తమ సమస్యలను నేరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆమె సైతం ప్రో యాక్టీవ్ గా నెటిజెన్ల సమస్యలన్నిటికీ సమాధానాలిస్తున్నారు. కేసీఆర్ అందుబాటులోలేని వేళ ఆమె నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఇప్పుడు గవర్నర్ ఇలాంటి చర్యల వల్ల తెరాస సర్కార్ మరింతగా ఇబ్బందిపడే ఆస్కారం ఉంది.