సంక్షోభంలో చంద్రబాబు టీడీపీ: జూ. ఎన్టీఆర్ మాటల ఆంతర్యం ఇదేనా...
పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి దింపాలనే డిమాండ్ వచ్చింది. అది మొదలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ సాగుతూనే ఉంది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కష్టకాలం వచ్చినట్లే. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓటమి పాలైంది. తన సొంత చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు ప్రభావం చూపలేకపోయారు. స్వయంగా ఆయన కొన్ని చోట్ల ప్రచారం కూడా చేశారు. అయినా ఫలితం దక్కలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత శాసనసభా నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీ చేతులెత్తేసింది.
పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి దింపాలనే డిమాండ్ వచ్చింది. అది మొదలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ సాగుతూనే ఉంది. వైసీపీ నాయకులు సైతం చంద్రబాబును విమర్శించడానికి జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీని కాపాడలేరని భావించి జూనియర్ ఎన్టీఆర్ కావాలని ఆ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సోమవారంనాడు అన్నారు.
చంద్రబాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీని బలోపేతం చేసి, ముందుకు నడిపించడంలో నారా లోకేష్ విఫలమవుతున్నారనే అభిప్రాయం ఉంది. నిత్యం వైఎస్ జగన్ మీద కొత్త కొత్త పదాల కూర్పుతో ట్విట్టర్ లో నారా లోకేష్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ, పార్టీని నిలబెట్టి ముందుకు నడిపించే సత్తా ఆయనకు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ను ఎదుర్కోగలిగే వ్యూహాలు రచించి, వాటిని అమలు చేయడంలో నారా లోకేష్ సత్తా సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థితిలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ముందుకు వస్తోంది.
అటువంటి పరిస్థితిలోనే పొలిటికల్ ఎంట్రీపై తనకు వచ్చిన ప్రశ్నకు నర్మగర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. మీలో ఎవరు కోటీశ్వరులు షో ప్రోమో విడుదల సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందించారు. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అడిగిన ప్రశ్నకు మీరే జవాబు చెప్పాలి, మీకు తెలుసు అని అన్నారు. ఎన్టీఆర్ కావాలి, రావాలి అంటున్నారు అని అన్నప్పుడు దానిపై మాట్లాడేందుకు ఇది సమయం కాదు, సందర్భం కాదని ఎన్టీఆర్ అన్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి మాట్లాడుకుందామని అన్నారు వేడివేడి కాఫీ తాగుతూ దానిపై మాట్లాడుకుందామని ఆయన అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన జవాబును బట్టి చూస్తే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకోవడం లేదని అనిపిస్తోంది. పొలిటికల్ ఎంట్రీపై కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు కూడా అర్థమవుతోంది. అయితే, ఆయనకు తన తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీపైనే మక్కువ ఎక్కువ. దానికోసమే ఆయన పనిచేయాలని అనుకుంటారు. ఆ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు కూడా. అయితే, టీడీపీలో పరిస్థితి ఆయనకు అనుకూలంగా ఉందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది.
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు క్రియాశీలక పాత్ర ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ పడుతుందనేది ఆయన అభిప్రాయం కావచ్చు. అదే సమయంలో ఎన్టీఆర్ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించడం బాబాయ్ నందమూరి బాలకృష్ణకు కూడా ఇష్టం లేదు. నారా లోకేష్ బాలయ్య కూతురిని వివాహం చేసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టడానికి చంద్రబాబుకు అవకాశం లభించిందని అంటారు
తనను దూరం పెట్టిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు తాను టీడీపీ కోసం పనిచేయడానికి, టీడీపీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. కానీ, చంద్రబాబు నుంచి గానీ బాలయ్య నుంచి గానీ సరైన ప్రతిస్పందన రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీకి దూరంగా ఉంచాలనే పట్టుదలతోనే వారున్నట్లు కనిపించారు. ఈ స్థితిలో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఎలా వస్తుందనేది అర్థం కాని విషయం
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా ఆయనను మరో మెట్టు పైకి లేపుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో మీలో ఎవరు కోటీశ్వర్లు షోను హోస్ట్ చేయడానికి కూడా ఆయన అంగీకరించారు. ప్రస్తుతం తన కేరీర్ మీద దృష్టి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం సమయాన్ని, సందర్భాన్ని వెతుక్కుంటారనే మాట వినిపిస్తోంది.