సోము వీర్రాజు నో కామెంట్: చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దగ్గరవుతున్నారా?
బద్వేల్ ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని మిత్రపక్షం జనసేన నిర్ణయించుకోవడంతో బిజెపి ఒంటరిగానే తమ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ పరిణామాలు చూస్తుంటే పవన్ కల్యాణ్ బిజెపికి దూరమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి దగ్గరవుతున్నారనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అదే సమయంలో పవన్ కల్యాణ్ బిజెపికి దూరమవుతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. దీనిపై కూడా ఓ ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ దగ్గరువుతున్నారనే విషయంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. అయితే, భవిష్యత్తులో బిజెపి, జనసేన పొత్తు కొనసాగుతుందని చెప్పారు.
బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పవన్ కల్యాణ్ నిర్ణయంతో బిజెపి విభేదించి తమ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సోము వీర్రాజు కూడా నిర్ధారించారు. తమ మిత్రమపక్షమైన జనసేనకు బిజెపి బద్వేలు సీటును కేటాయించింది. అయితే, వైసీపీ అభ్యర్థి దాసరి సుధను ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశ్యంతో పోటీకి దూరంగా ఉండాలని జనసేన నిర్ణయం తీసుకుంది.
అయితే, పోటీకి దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించుకోవడంతో బిజెపి బద్వేలులో తమ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయించి, కడప జీల్లా నాయకులు ఆ విషయంపై చర్చించారు కూడా. నలుగురు అభ్యర్థులతో ఓ జాబితాను రూపొందించి అధిష్టానానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో పవన్ కల్యాణ్ బిజెపికి దూరమవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, పవన్ కల్యాణ్ ను ప్రచారానికి ఆహ్వానిస్తామని సోము వీర్రాజు చెప్పారు. అయితే, పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడమనేది సందేహమేనని చెప్పవచ్చు. పోటీకి దిగకూడదని నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ బిజెపికి ఓటు వేయాలని అడగడానికి బద్వేలు ప్రచారంలో పాల్గొంటారని అనుకోవడానికి కుదరదు. ఆయన బహుశా దూరంగానే ఉండవచ్చు.
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో తీవ్రమైన విమర్శలు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వైసీపీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడానికి జనసేన టీడీపీతో జత కట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అందులో భాగంగానే టీడీపీపై గానీ, చంద్రబాబుపై గానీ పవన్ కల్యాణ్ పెద్గగా విమర్శలు చేయడం లేదని అంటున్నారు. అదే సమయంలో బిజెపి రాష్ట్ర నాయకుల తీరు పట్ల చాలా కాలంగా పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఒకటి, రెండు సార్లు బయటపడ్డారు కూడా.