సారంగ ధరియా పాట వివాదం: ఎత్తిపోతలపై అశోక్ తేజ బుకాయింపు
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ చిత్రంలోని సారంగధరియా పాటపై విపరీతమైన కాంట్రవర్సీ నడుస్తున్న విషయం సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాట ఎంత వైరల్ గా మారిందో... దాని చుట్టూ అలుముకున్న వివాదాలు కూడా అంతే వైరల్ గా మారాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీలో చిత్రీకరించిన సారంగధరియా పాట యూట్యాబ్ లో దుమ్ము రేపుతోంది. అదే సమయంలో దాని మాతృక (ఒరిజనల్) పాట కూడా అదరగొడుతోంది. సినిమాలో జనపదగేయంలోని పంక్తులను కొన్నింటిని యతతథంగా వాడుతూ అదే బాణీలో అశోక్ తేజ పాట రాశారు. ఆ పాట విడుదల కాగానే ప్రేక్షకుల మనసులను దోచుకుంది.
ఆ పాట చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. సాయి పల్లి స్టెప్స్, ఆమె ప్రదర్శన అదరగొట్టింది. సాయి పల్లవి ప్రదర్శనలో ఓ ఈజ్ కనిపించింది. ఆ పాటకు సాయి పల్లవి ప్రదర్శన మరింత ఊపును తెచ్చి పెట్టింది. ఈ పాట విడుదల కాగానే నెటిజన్లు అశోక్ తేజపై విరుచుకుపడ్డారు. ఇది కూడా ఎత్తిపోతలేనని వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించినవారిలో అశోక్ తేజను బాగా ఎరిగినవారు, అశోక్ తేజ ఎరిగినవారు ఉన్నారు.
సారంగధరియా పాటను తాను సేకరించానని కోమలి చెప్పుకున్నారు. నిజానికి ఆ పాటకు తాను కర్తను అని ఆమె చెప్పుకోలేదు. సేకరణ అని మాత్రమే వేసుకున్నారు. తన అమ్మమ్మ నుంచి తాను ఈ పాటను నేర్చుకున్నట్లు ఆమె తెలిపారు. ఆ పాట రేలారేలో ఒక ఊపు ఊపింది. ఆ పాటను శిరీష పాడింది. అందుకు కారణాన్ని కోమలి కూడా వివరించారు. శిరీష్ గానీ కోమలి గానీ అడిగింది, అడుగుతున్నది చాలా తక్కువ.
అశోక్ తేజ ఆ పాటను రాసినప్పుడు తనకు కొంత క్రెడిట్ ఇస్తే బాగుండేదని కోమలి అన్నారు. అలా అడగడంలో న్యాయం ఉంది. ఆ పాటను సేకరించి, వెలుగులోకి తెచ్చింది కోమలి. అయితే, ఈ విషయంలోనే అశోక్ తేజ వింతగా ప్రవర్తించారు. ఆయన ఓ వింత వాదనను ముందుకు తెచ్చారు. ఆయన వాదన కూడా నిజమే కావచ్చు గానీ న్యాయం కాదనేది మాత్రం తెలిసిపోతోంది. జానపదం ఎవరి సొత్తూ కాదని ఆయన వాదించారు. నిజమే అది ప్రజల సొత్తు, ఎవరి వ్యక్తిగతం కూడా కాదు.
తాను జానపద బాణీని అనుసరించానని అశోక్ తేజ చెప్పారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయని ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. బిరుదురాజు రామరాజు వంటి పరిశోధకులు జానపద గేయాలను సేకరించారు. తాము ఎవరి నుంచి ఆ పాటను రికార్డు చేశామనే విషయాన్ని వాళ్లు నిజాయితీగా చెప్పుకున్నారు. అలా కొంత క్రెడిట్ కోమలికి అశోక్ తేజ ఇచ్చి ఉండవచ్చు. కానీ చేయలేదు.
ప్రజా కవులు జానపద బాణీలను చాలా ఎక్కువగా వాడుకున్నారు. ప్రజల నుంచి తీసుకుని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వారు ఆ పనిచేశారు. జానపద బాణీలను తీసుకుని వస్తువును మార్చి రాసి, ప్రజలకు తిరిగి వినిపించారు. వారు ప్రజల్లోకి ఆ పాటల ద్వారా వెళ్లారు. ప్రజా కవి సుద్దాల హనుమంతు వారసుడిగా ఇది అశోక్ తేజకు తెలియదని కాదు. కానీ, ప్రజల పట్ల ప్రజా కవులు విశేషమైన గౌరవమర్యాదలు పాటించారు. గద్దర్, శివసాగర్ ఆ పనిచేశారు. శివసాగర్ తన కవిత్వ సంపుటిలో ఏ కవిత లేదా పాట ఏ జానపద గేయానికి అనుసరణో కూడా చెప్పారు.
అశోక్ తేజ జానపద బాణీని వాడుకుంది ఫక్తు వ్యాపారానికి. అలా వాడకూడదని కూడా ఎవరూ అనడం లేదు. కనీసం మాతృక పట్ల, దాన్ని సేకరించినవారి పట్ల కనీస గౌరవ మర్యాదలు ఆయన పాటించలేదని ఆయన వాదన వల్ల అర్థమవుతోంది. వివాదం చెలరేగినప్పుడైనా కాస్తా మర్యాదగా, కాస్తా తగ్గి మాట్లాడి ఉంటే బాగుండేదని తెలంగాణ మేధావుల ఆలోచనగా కనిపిస్తోంది.
కోమలి ఆ పాటను 2008లో తన అమ్మమ్మ నుంచి సేకరించానని చెప్పుకున్నారు. 2010లో తొలిసారి పాడినట్లు చెబుకున్నారు. ఆమె గొంత ద్వారా ఆ పాట ప్రజల్లోకి వెళ్లిపోయింది. విశేష ప్రజాదరణ పొందిన పాటను అనుకరించే సందర్భంలో అశోక్ తేజ పాటించాల్సిన మర్యాదను పాటించలేదనేది అందరు నొచ్చుకునే విషయం. అశోక్ తేజ కాపీ రైట్ గురించి మాట్లాడుతున్నారు. ఆయనను ప్రశ్నించేవాళ్లు విలువల గురించి మాట్లాడుతున్నారు.
కాగా, అతి చిన్నదానికే కోమలి తెగ సంతోషపడిపోయింది. శేఖర్ కమ్ముల ముందుకు వచ్చి క్రెడిట్ ఇస్తామని, రెమ్యూనరేషన్ ఇస్తామని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె చేత పాట పాడిస్తామని ఆయన హామీ ఇచ్చినందుకు ఆమె ఉప్పొంగిపోయింది. శేఖర్ కమ్ములకు పరి పరి విధాల ధన్యవాదాలు చెప్పుకుంది. పాట పాడించే విషయంలో, ఎవరితో పాడించాలనే విషయంలో, తనతో మాట్లాడినప్పుడు తాను ఎందుకు నిరాకరించాననే విషయంలో అశోక్ తేజతో ఆమె ఏమీ విభేదించడం లేదు. ఇది పల్లే గుండె నిజాయితీ. ఆ నిజాయితీ ఫక్తు వ్యాపారంగా మారిన సినీ పరిశ్రమలోనివారికి ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారిపోయింది.
తాజాగా, వేణు ఉడుగల దర్శకత్వం వహిస్తున్న విరాటపర్వం నుంచి ఓ పాట విడుదలైంది. ఆ పాటను చంద్రబోస్ రాశారు కోలు కోలోయమ్మ అంటూ ఆ పాట ప్రారంభమవుతుంది. ఉయ్యాలో మాదిరిగా కోలు కోలోయమ్మ అనేది కూడా జానపదుల పాటల్లో తరుచుగా వచ్చే పంక్తి. అయితే, పాటలో మొత్తం చంద్రబోస్ సొంత ముద్ర కనిపిస్తుంది. సారంగధరియా పాట కాపీలాగా అనిపిస్తుంది. చరణాలు సొంతం కావచ్చు గానీ ఆ సొంత ముద్ర ఆ పాటలో లోపించింది.
జానపద గేయాల్లోని ఫంక్తులను సినీ గేయరచయితలు అశోక్ తేజ చెప్పిన మాట నిజమే. అమయాకుడు సినిమాలోని పట్నంలో శాలిబండ కూడా బహుశా జానపదం నుంచే వచ్చింది. ఆ పాట కూడా బంపర్ హిట్ అయింది. కొసరాజు రాసిన పాటల మూలాలను కూడా వెతకాల్సే ఉంటుంది.ఇలా వాడుకోవడంలో అశోక్ తేజ మొదటివారేమీ కాదు. కానీ, సారంగధరియా పాట విషయమే ఎందుకు వివాదమవుతోందంటే అశోక్ తేజ వ్యవహారశైలి మాత్రమే కావచ్చు.