పీసీసీ పదవిపై: రేవంత్ రెడ్డి తాడోపేడో, కొండా సురేఖ సహా లాబీ ఇదే...
రేవంత్ రెడ్డి పక్కన ఉన్నవారు ఎవరనే విషయం రావిరాల బహిరంగ సభ ద్వారా దాదాపుగా తేలిపోయింది. కొండా సురేఖ ఈ సభలో పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఇదే రీతిలో కాంగ్రెసు నాయకులు అడ్డుకున్నారని అంటూ రేవంత్ రెడ్డిని ఆమె బలపరిచారు.
తెలంగాణ పీసీసీ పదవి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాజీవ్ రైతు భరోసా యాత్ర చేసినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేశారని అంటున్నారు. పలువురు సీనియర్ నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్న తరుణంలో తాను తప్ప మరొకరు పీసీసీ అధ్యక్ష పదవికి పనికి రారని, చెప్పడానికి కాకుండా తాను మాత్రమే పార్టీని ముందుకు నడిపించగలనని చెప్పడానికి ఆయన ఈ యాత్రను చేపట్టి, రంగారెడ్డి జిల్లా రావిరాలలో బహిరంగ సభ నిర్వహించినట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టగానే పలువురు సీనియర్ కాంగ్రెసు నేతలు ఉలిక్కి పడ్డారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భట్టి మల్లు విక్రమార్క పాదయాత్రలు చేస్తామని చెప్పారు. మల్లు భట్టి విక్రమార్క ఇది వరకే పొలం బాట నిర్వహిస్తున్నారు. తాము కూడా పాదయాత్ర చేస్తామని జగ్గారెడ్డి, కోమిటిరెడ్డి వెంకట రెడ్డి ప్రకటించారు. వీరు కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్నారు.
రేవంత్ రెడ్డి పక్కన ఉన్నవారు ఎవరనే విషయం రావిరాల బహిరంగ సభ ద్వారా దాదాపుగా తేలిపోయింది. కొండా సురేఖ ఈ సభలో పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఇదే రీతిలో కాంగ్రెసు నాయకులు అడ్డుకున్నారని అంటూ రేవంత్ రెడ్డిని ఆమె బలపరిచారు. కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధపడిన వైఎస్ షర్మిల వైపు వెళ్తారని భావించిన కొండా సురేఖ రేవంత్ రెడ్డిని బలపరచడం ద్వారా కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
ఎమ్మెల్యే సీతక్క మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నారు. ఆమె రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు. ఆమె తన నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ చురుగ్గా ఉంటున్నారు. రేవంత్ రెడ్డికి ఆమె మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు అర్థమవుతోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె గతంలో నొచ్చుకున్నారు.
ఇద్దరు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల మద్దతు కూడా రేవంత్ రెడ్డికి ఉన్నట్లు అర్థమవుతోంది. ఉత్తర తెలంగాణకు చెందిన పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నారు. ఆయనతో పాటు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ కూడా రేవంత్ రెడ్డి సభలో పాల్గొన్నారు. తద్వారా వారిద్దరి మద్దతు కూడా రేవంత్ రెడ్డికి ఉన్నట్లు భావించవచ్చు.
మాజీ ఎంపీుల బలరాం నాయక్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్యల మద్దతు కూడా రేవంత్ రెడ్డికి లభిస్తోంది. మల్లు రవి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి పిసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన బహిరంగంగానే కోరారు. తాను అలా కోరడానికి గల కారణాన్ని కూడా వివరించారు.
పలువురు మాజీ ఎమ్మెల్యేల మద్దతు కూడా రేవంత్ రెడ్డికి లభిస్తోంది. రాంమోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఆయనకు మద్దతు ఇస్తున్నారు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్ తదితరుల మద్దతు కూడా రేవంత్ రెడ్డికి లభిస్తోంది.
రేవంత్ రెడ్డికి మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి మద్దతు గట్టిగానే ఉంది. కొండా విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి మద్దతు రేవంత్ రెడ్డి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. షబ్బీర్ అలీ వంటి నాయకులు పాదయాత్రలకు అధిష్టానం మద్దతు ఉందని చెబుతుండగా కొంత మంది లేదని ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తటస్థంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అధిష్టానం ఆమోదం ఉన్నా లేకున్నా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడం ద్వారా తానేమిటో చాటి చెప్పాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.