వ్యూహంలో విభజన అంశం.. చపాతీని రెండు ముక్కలు చేసినట్టు.. జగన్‌లో ఆందోళన, సోనియాపై విసుర్లు..
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఇందులో ఏపీ రాజకీయాలతో పాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కూడా ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు ఆర్జీవీ.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ కూడా విడుదల అయింది. తాజాగా వ్యూహం సినిమా టీజర్-2ను ఆర్జీవీ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వైఎస్ జగన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
అయితే చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఆర్జీవీ తన కోణంలో చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాను జగన్ గురించి ఏమనుకుంటున్నాడో ఆర్జీవీ ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే జగన్‌ను వ్యతిరేకించే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారి పాత్రలను ఈ చిత్రంలో పూర్తిగా నెగిటివ్‌గా చూపించే అవకాశం ఉన్నట్టుగా టీజర్స్‌ను చూస్తే అర్థం అవుతుంది.
ఏపీ రాజకీయాలతో పాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కూడా ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు ఆర్జీవీ. అదే సమయంలో సోనియా గాంధీని పోలిన పాత్రను నెగిటివ్ కోణంలో చూపించినట్టుగా కనిపిస్తోంది.
వాస్తవానికి వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆయన ఇదే వైఖరితో ఉన్నారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో రాష్ట్ర విభజనకు అనుకూలంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కేంద్రం నుంచి ప్రకటన కూడా వెలువడింది. అయితే ఆ తర్వాత ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలతో విభజనలో తీవ్ర జాప్యం జరిగింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా ఏపీ విభజనను వ్యతిరేకించింది. అయితే చివరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయంలోనే ఏపీ పునర్విభజనకు ఆమోద ముద్ర పడింది. ఇందులో సోనియాది కీలక భూమిక అని చెప్పక తప్పదు.
అయితే వ్యూహం టీజర్ 2లో విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ.. బైఫరికేషనా అంటూ జగన్ ఆందోళకు గురయ్యారని చూపించారు. అదే సమయంలో సోనియా పాత్ర చపాతీని రెండు ముక్కలు చేసినట్టుగా చూపిస్తూ.. రాష్ట్రాన్ని అలా విభజించేశారనే సూచించేలా చేశారు.
తద్వారా రాష్ట్ర విభజనకు జగన్ వ్యతిరేకమనే సంకేతంతో పాట.. సోనియా కూడా చపాతీని చించేసినంతా సులువుగా అన్యాయంగా రాష్ట్ర విభజన చేశారనే విధంగా ఈ చిత్రంలో చూపించనున్నారనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. తద్వారా సోనియాపై కూడా సెటైర్లు వేశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.