క్లియర్: జగన్ తో కటీఫ్, మోడీకి జైకోట్టిన రఘురామకృష్ణంరాజు
పార్టీకి తాను వీరవిధేయుడనని, వైసీపీలోనే కొనసాగాలి అనుకుంటున్న రఘురామ, పార్టీతో సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టేలా ఉన్న సందర్భంలో ప్రధానికి లేఖ రాయడం ఆయన ఉద్దేశ్యాన్ని బయటపెడుతున్నాయి.
రఘురామకృష్ణంరాజు - ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. అచ్చెన్నాయుడి అరెస్టు, విజయసాయి రెడ్డి పవర్ ను జగన్ తగ్గించారు వంటి విషయాల మధ్య కూడా ఆయన గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతుండడం ఆయన క్రేజ్ ను చెప్పకనే చెబుతున్నాయి.
తనకన్నా పెద్ద స్వామి భక్తుడు వైసీపీలో అని చెబుతూనే పార్టీపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఒక్క అధినేత జగన్ మోహన్ రెడ్డిని మినహాయించి ఆయన పార్టీలో వేరెవ్వరినీ వదలకుండా అందరిపైనా విరుచుకుపడ్డారు. మొన్న విజయసాయి రెడ్డి నుంచి ఆయనకు నోటీసులు వస్తే.... ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శా అంటూ ఆయనపై ఫైర్ అయ్యారు.
ఇక ఆయన ఆగడాలు పెచ్చు మీరాయి అని అనుకుంటున్న వైసీపీ ఆయనపై అనర్హత వేటు వేయమని స్పీకర్ ని కోరనున్న విషయం తెలిసిందే. నేటి ఉదయం ప్రత్యేక విమానంలో వైసీపీ ఎంపీలంతా ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. వారు ఓం బిర్లాను కలిసి ఆయనకు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయమని కోరనున్నారు.
ఇక ఈ తతంగం జరిగే ముందు రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖను రాసే ముందు రఘురామ కృష్ణంరాజు మోడీని పొగుడుతూ ఉన్న ఒక పాటను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అది రఘురామకృష్ణంరాజే పాడించారు అని వార్తలు వచ్చినప్పటికీ... ఆయనే దాన్ని స్వయంగా ఖండించారు.
ఇక నిన్న ఆయన ప్రధాని నరేంద్రమోడీకి ఒక లేఖ రాసారు. ఆ లేఖలో పేదలకు ఉచిత రేషన్ అందించే గరీబ్ కళ్యాణ్ యోజనను నవంబర్ వరకు పొడిగించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ... ఈ కరోనా కష్టకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మేలుచేస్తుందని ప్రధానిని అభినందించారు.
పేదలకు ఆహార ధాన్యాలను అందించే పథకం గొప్పది అని చెబితే తప్పేమిటి అని అనిపించొచ్చు. కానీ... పార్టీకి తాను వీరవిధేయుడనని, వైసీపీలోనే కొనసాగాలి అనుకుంటున్న రఘురామ, పార్టీతో సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టేలా ఉన్న సందర్భంలో ప్రధానికి లేఖ రాయడం ఆయన ఉద్దేశ్యాన్ని బయటపెడుతున్నాయి.
రఘురామకృష్ణంరాజు పార్టీలో ఉండాలని అనుకోవడం లేదు. పార్టీ కూడా ఆయనను ఉంచుకోవాలనుకోవడంలేదు. ఇది తేటతెల్లం. అందుకోసమే వైసీపీ ఎంపీలు హస్తిన పయనమవుతున్నారు. వారు ఇప్పుడు స్పీకర్ ని అనర్హత వేటు వేయమని కోరితే స్పీకర్ అనర్హుడిగా ప్రకటిస్తే అప్పుడు ఆయన సభ్యత్వం కోల్పోతాడు.( ఆయన కోర్టుకు పోకుంటేనే, కోర్టుకెళితే కోర్టు తేల్చాలి! అప్పటికి మరోదఫా సార్వత్రిక ఎన్నికల సమయం కూడా వచ్చేస్తుంది.)
స్పీకర్ అనర్హత వేటు వేయాలన్నా ఆయన కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటగా రఘురామ రాజీనామా చేశాడా అని? ఆయన రాజీనామా చేయలేదు. పోనీ వేరే పార్టీలో చేరాడా ? అది కూడా లేదు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ... అది చేరినట్టు కాదు. పోనీ పార్టీ విప్ ను ధిక్కరించాడా ? అది కూడా లేదు.
పై పెచ్చు జగన్ మోహన్ రెడ్డే మా నాయకుడు అంటూ ఆయన పాల్గొన్న ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చెబుతున్నాడు. మొన్న జగన్ కి రాసిన లేఖలో కూడా ఆయన జగన్ ను మీరే మా నాయకుడని, తనకు ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండని కోరాడు. కాబట్టి ఈ అన్ని పరిణామాలను పరిశీలించి చూస్తే రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడే ఆస్కారం లేదు.
ఆయన వేరే పార్టీలో చేరకుండా గనుక ఉంటే.... వైసీపీ ఏమి చేయలేదు. వారు నేర్పిన సూత్రమే కదా, వల్లభనేని వంశీ సహా ఇతర రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో. వారు వైసీపీలో చేరినా చేరినట్టు కాదు. కండువా కప్పుకున్నా, కప్పుకున్నట్టు కాదు. టీడీపీ పార్టీ సభ్యులే.
చూడబోతుంటే... రఘురామా కూడా ఇదే దారి ఫాలో అయ్యేలా ఉన్నారు. ఆయన బీజేపీతో తన సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే... వైసీపీ సభ్యుడిగానే కొనసాగేలా కనబడుతున్నారు. లేదా వైసీపీ బహిష్కృత సభ్యుడిగా అయినా వేరే పార్టీలో చేరకుండా బీజేపీతో సఖ్యతగా మెలిగేలా కనబడుతున్నారు.
ఏది ఏమైనా ఆయన వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారు అనేది వాస్తవం. ఆయన బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు అనేది సత్యం. ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఎక్కడా కనబడడం లేదు. బహిష్కృత సభ్యుడిగానో, వైసీపీ సభ్యుడిగానో ఆయన కొనసాగుతారు.
ఈ విశ్లేషణ అంతా కూడా ఎన్నికలకు ముందు వరకు మాత్రమే. ఎన్నికలప్పుడు ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది అప్పటి కాలమాన పరిస్థితులను బట్టే ఉంటుంది. ఆయన తిరిగి వైసీపీ నుంచే పోటీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఎవరూ ఉండరు కదా!