ఉద్యమ నేత లక్షణం: కేసీఆర్ మొనగాడు, పోలిస్తే ముద్రగడ దిగదుడుపే....
నాయకుడన్నవాడిపై రాళ్లు పడతాయి పూలు పడతాయి. రెంటినీ సమానంగా స్వీకరించాల్సి ఉంటుంది. ఉద్యమంలో ముల్లులు అధికంగా ఉంటాయి. ఫలాలు అంతిమ లక్ష్యం కోసం నిర్విరామ నిరాటంక కృషి చేయాల్సిందే. నాయకుడు పరిస్థితులతో సంబంధం లేకుండా ముందుకు సాగాలి.
ఆంధ్రప్రదేశ్ లో కాపు రాజకీయం మంచి రంజుమీదుంది. ముద్రగడ లేఖ దాని తదనంతర పరిణామాల నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవకాశం దొరికితే ఈ ఉద్యమాన్ని ఆయుధంగా మలుచుకోవాలని టీడీపీ అనుకుంటుంటే... ఎక్కడ ఇది తలనొప్పిగా తయారవుతుందో అని జగన్ సర్కార్ యోచన చేస్తుండగా... కాపులు మాత్రం ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న తమ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం నిన్న తన లేఖలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని, తన మీద కూలద్రోహి అని నిందలేస్తున్నారని, తాను ఉద్యమాన్ని తాకట్టు పెట్టానని అందరూ ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. తనపై పనిగట్టుకొని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నాడు.
ఈ ఉద్యమం వల్ల తాను మానసికంగా, ఆరోగ్యపరంగా, రాజకీయంగా చాలా నష్టపోయానని చెబుతూ ఇక మీదట కాపు ఉద్యమం బరువు బాధ్యతలు తన వల్ల కాదు అని, తాను కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్టుగా కాపు సోదర సోదరీమణులను ఉద్దేశిస్తూ ఒక బహిరంగ లేఖను రాసాడు.
ఇక ముద్రగడ ఇలా కాడెత్తేయడం తో రాజకీయంగా వివిధ అనుమానాలు, అనేక విశ్లేషణలు తెరమీదకు వస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ ఏమో తమ హయాంలో టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు తీవ్ర స్థాయిలో ఉద్యమం నడిపిన ముద్రగడ ఇప్పుడు కాడెత్తేయడం జగన్ కోసమే అని వారు ఆరోపిస్తున్నారు.
ఇక ముద్రగడ కాడెత్తేయడంపై చాలామంది తీవ్ర విమర్శలను చేస్తున్నారు. నాయకుడన్నవాడు అవసరమైన సమయంలో లేకుండా పోతే కాపు ఉద్యమం దిశాదశా లేకుండా పోతుందని, కాపు ఉద్యమం ఇప్పటికైనా అనుకున్న అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలని ముఖ్యంగా కాపు యువత ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే ఒక యోధుడు, నాయకుడు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై రాళ్లు పడ్డాయి, పూలు కురిసాయి. కేసీఆర్ ఎక్కడా ఆగకుండా 2001 నుంచి 2014 వరకు నిర్విరామంగా కృషి చేసారు.
కేసీఆర్ నిర్విరామ ఉద్యమ ఫలం నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఆయన తన శక్తినంతటిని క్రోడీకరించి ప్రత్యేక రాష్ట్రం లక్ష్యంగా శ్రమించి రాష్ట్రాన్ని సాధించాడు. ఈ కాలంలో కేసీఆర్ సైతం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోయారు.
ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకీ కూర్చొని, చావు నోట్లోకి వెళ్లి వచ్చి మరీ స్వరాష్ట్రాన్ని సాధించారు. ఆయన ఉద్యమమే ఊపిరిగా బ్రతికాడు. ఆయనను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ నాయకులూ పదే పదే విమర్శించారు. ఆయనను తెలంగాణ ద్రోహి అని సైతం అన్నారు. ఆ మాటలన్నిటిని ఓపికగా పంటి బిగువున భరించారు. అంతే తప్ప ఆయన కాడెత్తేయలేదు.
అప్పట్లో సొంత తెలంగాణ వారే కేసీఆర్ ను నానా మాటలు అన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న తలసాని వంటివారు తెలంగాణవంటివారైనప్పటికీ... కేసీఆర్ ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మహత్యలకు సైతం కేసీఆర్ అని అన్నారు. విద్యార్థులవి ఆత్మహత్యలు కాదు, కేసీఆర్ చేస్తున్న హత్యలు అని అన్నారు. ముద్రగడలాగా సొంతవారే నన్నిలా అంటున్నారు అని కృంగిపోలేదు. కేసీఆర్ పోరాడారు.
ఉద్యమ నాయకుడంటే అలా ఉండాలి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కంకణబద్ధుడై ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ చివరకు సఫలీకృతుడయ్యాడు. ఈ ప్రయాణంలో ఆయన కాంగ్రెస్ తో,టీడీపీతో కలిసి ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడు కూడా ఉద్యమాన్ని పక్కనపెట్టి ఏ రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళలేదు. ఉద్యమానికి అవసరమైనంత మేర వాటిని వాడుకున్నాడు. ఇది ఉద్యమ నాయకుడి లక్షణం.