డర్టీ టర్న్: పవన్ కల్యాణ్ వివాదం, చిరంజీవినీ లాగిన పోసాని కృష్ణమురళి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మధ్య చెలరేగిన వివాదం అవాంఛనీయమైన మలుపు తిరిగింది. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వస్తున్న మెసేజ్ లపై పోసాని కృష్ణమురళి మంగళవారం సాయంత్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్వేగంగా, ఆవేశంగా మాట్లాడారు
pawan kalyan, posani
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మధ్య చెలరేగిన వివాదం అవాంఛనీయమైన మలుపు తిరిగింది. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వస్తున్న మెసేజ్ లపై పోసాని కృష్ణమురళి మంగళవారం సాయంత్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్వేగంగా, ఆవేశంగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు, చిరంజీవిని కూడా వివాదంలోకి లాగారు.
పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ చిరంజీవి విషయంలో గతంలో వ్యవహరించిన తీరును వివరించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి తనకు వేలాది మెసేజ్ లు వస్తున్నాయని ఆయన చెప్పారు. తన భార్యపై వారు చేసిన వ్యాఖ్యను ఆయన చెప్పారు. తన భార్య తనకు మంచి స్నేహితురాలు అని, తన భార్య మరణించిన రోజే తాను మరణిస్తానని ఆయన చెప్పారు. తన భార్యపై వ్యాఖ్యలు చేసి తనను డీమోరలైజ్ చేయాలని చూస్తున్నారని, తాను డీమోరలైజ్ కాబోనని ఆయన అన్నారు. తన భార్యతో తన సంబంధాలు ఎప్పుడు కూడా దెబ్బ తినవని ఆయన అన్నారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రంగా ఉన్నాయి.
తన భార్యపై వచ్చిన వ్యాఖ్యలపై ప్రతిస్పందిస్తూనే చిరంజీవి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. పవన్ కల్యాణ్ మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పంజాబీ అమ్మాయి గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సంబంధాలపై కూడా మాట్లాడారు. ఈ సమయంలో ఆయన పవన్ కల్యాణ్ సంతానం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబం గురించి మాట్లాడితే తాను కూడా అలా మాట్లాడుతానని ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్ ను అదుపు చేసుకోవాలని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ గ్రూపులు కడుతారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ అందరినీ ఇష్టం వచ్చినట్లు తిడుతారని, పవన్ కల్యాణ్ ను మాత్రం ఎవరూ అనవద్దని, ఇదీ పవన్ కల్యాణ్ పద్ధతి అని ఆయన అన్నారు. మా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పోసాని కృష్ణమురళికి, పవన్ కల్యాణ్ కు మధ్య చెలరేగిన వివాదం తీవ్ర స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది.
పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. గత ఏడాది పోసాని చిత్రలహరి, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అమరావతి రైతులని విమర్శించిన కమెడియన్ పృథ్విని ప్రెస్ మీట్ పెట్టి మరీ పోసాని ఏకిపారేశారు.
పోసాని కృష్ణమురళిని అడ్డుకోవడానికి హైదరాబాదు ప్రెస్ క్లబ్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో పవన్ కల్యాణ్ అభిమానులు మహేష్ కత్తిపై కూడా దాడి చేశారు. అభిమానులు రెచ్చిపోతే తెలుగు హీరోలు పలువురు వారిని అదుపు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం అటువంటి చొరవ చూపిన సందర్భం లేదు. పవన్ కల్యాణ్ ఒక్క మాట చెప్తే అభిమానులు తీవ్రమైన చర్యలకు దూరంగా ఉంటారనే అభిప్రాయం బలంగానే ఉంది
సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ ప్రసంగంలో పవన్ కల్యాణ్ మంత్రులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన పదజాలం వాడారు. తెలుగు సినీ పరిశ్రమను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, దానిపై పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడ్డారు. దాంతో వివాదం ప్రారంభమైంది