ఏపీలో మలుపు: బిజెపి వలలో పవన్ కల్యాణ్ గిలగిల
కేంద్రం బడ్జెట్లో ఏమైనా వరాలు కురిపిస్తే వాటిని చూపెట్టి రాష్ట్రంలో ఓట్లు రాబట్టుకోవచ్చు అన్న బీజేపీ ఆశలు కూడా ఆవిరైపోగా... కుడితోలో పడ్డ ఎలుక చందంగా మారింది జనసేన పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉందో వేరుగా చెప్పనక్కరలేదు. రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ అక్కడ ఎన్నికల సంఘం వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా తయారయింది ప్రస్తుత పరిస్థితి. స్థానిక ఎన్నికలు ముగియగానే అక్కడ ప్రతిష్టాత్మకమైన తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. ఈ తిరుపతి ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు అతిపెద్ద సవాల్ గా మారాయి.
అధికారంలో ఉన్న వైసీపీ ఆ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని చూస్తుంటే... ప్రతిపక్ష టీడీపీ క్యాడర్ లో నూతన జోష్ నింపడానికి ఈ ఎన్నికలో విజయం సాధించాలని ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాల్లో రచిస్తోంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన జనసేన, బీజేపీలు జతకట్టిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి.
ఎలాగైనా సిట్టింగ్ సీట్ ను కాపాడుకొని తమకు తిరుగులేదు అని ప్రకటించుకోవడానికి అధికార వైసీపీ ఉవ్విళ్ళూరుతుంటే.... రాష్ట్రంలో టీడీపీ ఇంకా ప్రధానమైన శక్తే అని, గత ఎన్నికల ఘోర వైఫల్యాన్ని ఈ ఉపఎన్నిక విజయం ద్వారా తుడిచేయాలని టీడీపీ చూస్తుంది. తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల విజయంతో జోరుమీదున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో కాషాయ రెపరెపలకు బాటలు వేయాలని చూస్తుంది.
తొలుత సీటుపై జనసేన బీజేపీల మధ్య ఒకింత చర్చ జరిగినప్పటికీ.... తరువాతి కాలంలో ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా కనబడుతుంది. ఇక్కడిదాకా బాగానే ఉంది. తిరుపతి ఉపఎన్నికపై అందరూ మల్లగుల్లాలు పడుతున్న తరుణంలోనే.... కేంద్ర బడ్జెట్ రాష్ట్రంలో ఒక్కసారిగా బాంబు పేల్చింది. రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపెట్టడంతో రాష్ట్రంలోని నాయకులంతా కేంద్రాన్ని ఎండగడుతున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఇదే విషయమై కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి కూడా.
కేంద్రం బడ్జెట్లో ఏమైనా వరాలు కురిపిస్తే వాటిని చూపెట్టి రాష్ట్రంలో ఓట్లు రాబట్టుకోవచ్చు అన్న బీజేపీ ఆశలు కూడా ఆవిరైపోగా... కుడితోలో పడ్డ ఎలుక చందంగా మారింది జనసేన పరిస్థితి. కేంద్రంలోని బీజేపీ ప్రకటించిన బడ్జెట్ కి జనసేన సంజాయిషీ చెప్పుకోవాలిసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బీజేపీని జనసేన ఏమాత్రం ప్రభావితం చేయలేకపోవడంతోపాటుగా.... బీజేపీకి జూనియర్ పార్టనర్ గా మారిందని పలు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి 70,000 కోట్లు రావాలని లెక్కతేల్చిన పవన్... ఆ తరువాత ఆ విషయాన్నీ పూర్తిగా పక్కనపెట్టేసి 2019 ఎన్నికలు పూర్తవగానే బీజేపీతో జతకట్టాడు. రాష్ట్రానికి బీజేపీ ఏమి చేసిందనే ప్రశ్న ఉద్భవించిన ప్రతిసారి అకారణంగా జనసేనాని బలవుతున్నారు. ఇక్కడ గుడ్డిలో మెల్లలా కలిసొచ్చే అంశం ఏమైనా ఉందంటే... ప్రస్తుత వైసీపీ కానీ, టీడీపీ కానీ బీజేపీతో పోరుకు దిగే పరిస్థితి లేకపోవడం వల్ల ఒకింత సాంత్వన దక్కుతుందని చెప్పక తప్పదు. వేచి చూడాలి రానున్న ఉపఎన్నికలో ఈ ఫాక్టర్ ఎలా ప్లే అవుతుందో...!