ఒక దెబ్బకు రెండు పిట్టలు: జగన్ వ్యూహానికి చంద్రబాబు విలవిల
సిఐడి నోటీసుల దెబ్బకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రెండు లాభాలను పొందే విధంగా కనబడుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తన పంతాన్ని నెగ్గించుకోవడంతోపాటుగా... రాష్ట్రంలో ప్రతిపక్షమైన టీడీపీపై పైచేయి సాధించేందుకు జగన్ కి వీలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ అద్వితీయమైన విజయాన్ని సాధించింది. ప్రతిపక్ష టీడీపీఘోరా పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ ఓటమికి, వైసీపీ గెలుపుకి గల కారణాలను విశ్లేషించడం పక్కనపెడితే.... విజయం సాధించగానే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ భారీ ఎత్తున చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.
నేటి ఉదయమే సిఐడి అధికారులు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చి అమరావతి భూముల విషయంలో నోటీసులను అందించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. చంద్రబాబుతోపాటుగా అప్పటి మునిసిపల్ శాఖామంత్రి నారాయణకు కూడా నోటీసులను అందించారు.
ఈ సిఐడి నోటీసుల దెబ్బకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రెండు లాభాలను పొందే విధంగా కనబడుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తన పంతాన్ని నెగ్గించుకోవడంతోపాటుగా... రాష్ట్రంలో ప్రతిపక్షమైన టీడీపీపై పైచేయి సాధించేందుకు జగన్ కి వీలవుతుంది.
అమరావతి భూముల విషయంలో చంద్రబాబు నాయుడుకి నోటీసులు అందాయి. ఈ నోటీసుల్లోని సెక్షన్ల ఆంతర్యం టూకీగా... అమరావతి భూముల విషయంలో అవకతవకలు జరిగాయని అందులో మీ పాత్రపై విచారణ జరిపేందుకు సహకరించాలన్నది సారాంశం.
అమరావతి రాజధాని కోసం భూములను సమీకరించేప్పుడు చంద్రబాబు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా సిఆర్డీఏ చైర్మన్ గా కూడా ఉన్నారు. రాష్ట్రంలో తాజాగా ముగిసిన మునిసిపల్ ఎన్నికల్లో విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా వైసీపీ కి పూర్తి మద్దతు తెలపడంతో ఈ అమరావతికి పూర్తి స్థాయి చెల్లుచీటి ఇవ్వడానికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది.
అమరావతికి చరమ గీతం పాడడంతోపాటుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో చంద్రబాబు జగన్ ను జైలుకు పంపించడానికి కుమ్మక్కయ్యారని ఎప్పటినుండో కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తునే ఉన్నారు. ఈ దెబ్బకు చంద్రబాబు మీద గనుక ఆరోపణలకు ఆధారాలు దొరికితే చంద్రబాబు సైతం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లవలిసి వస్తుంది. అమరావతికి చెల్లుచీటీతోపాటుగా చంద్రబాబుతో కూడా పాత లెక్కలు సరిచేసుకోవడానికి జగన్ యోచిస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.