జిల్లాల విభజన: జగన్ సై, పుష్పశ్రీవాణి వాదనలోని కిిటుకు ఇదీ...
అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తీరణంలో చాలా పెద్దది కాబట్టి దాన్ని రెండు జిల్లాలుగా విభజిస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. జగన్ అందుకు సానుకూలంగా స్పందించారు. దానిపై కేబినెట్ లో చర్చ కూడా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాల ఏర్పాటు గురించిన చర్చ తీవ్రతరమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై సీఎస్ అధ్యక్షతన జిల్లాల పునర్వవ్యవస్థీకరణ కమిటిని ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.బుధవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. రెండు గంటల పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ ఈ కమిటి చర్చించనుంది.
ఇలా కమిటీ వేసారో లేదో రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుపై అప్పటివరకు సాగిన చర్చలు, చిన్నగా ప్రారంభమైన నిరసనలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా ఏర్పాటు చేసే జిల్లాల వల్ల చాల నష్టం అని ధర్మాన ప్రసాద రావు అన్నారు.
జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి శూన్యంగా మారనుందని బుధవారం నాడు వ్యాఖ్యానించారు. జిల్లాలో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం ప్రాంతాలు కొత్త జిల్లాల విభజనలో భాగంగా విజయనగరం జిల్లాలో కలసిపోతాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అదే జరిగితే జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇదిలా ఉండగా నిన్న అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తీరణంలో చాలా పెద్దది కాబట్టి దాన్ని రెండు జిల్లాలుగా విభజిస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. జగన్ అందుకు సానుకూలంగా స్పందించారు. దానిపై కేబినెట్ లో చర్చ కూడా జరిగింది.
అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని గనుక పరిశీలిస్తే... అందులో నాలుగు జిల్లాలకు చెందిన ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలకొండ, విజయనగరం కు చెందిన సాలూరు, కురుపాం, పార్వతీపురం, విశాఖ జిల్లాకు చెందిన పాడేరు, అరకు, తూర్పు గోదావరికి చెందిన రంపచోడవరం ఉన్నాయి.
డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం కురుపాం సైతం అరకు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. భౌగోళికంగా విజయనగరం జిల్లా కిందకు వచ్చే కురుపాం నియోజకవర్గం ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా విభజిస్తే అరకు పరిధిలోకి వెళ్తుంది.
అరకుతో కురుపాం నియోజకవర్గాన్ని కలపడానికి ఆ ప్రాంతవాసులు ఒప్పుకోకపోవచ్చు. ఇప్పటికే పార్వతీపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనీ వారు ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. వారికి పక్కనున్నటువంటి విజ్జయనగరం దగ్గరవుతుంది కానీ అరకు కాదు(రెంటిని పోల్చి చూసినప్పుడు) ఈ ఉద్దేశంతోనే పుష్పశ్రీవాణిగారు ఈ డిమాండ్ ని అడిగినట్టుగా కనబడుతుంది. పార్వతీపురం కురుపాం నుంచి ఒక గంట ప్రయాణం మాత్రమే.
శ్రీకాకుళం జిల్లాను చూసుకున్నా కూడా... శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్ని గనుక విడదీస్తే ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం జిల్లా పరిధిలోకి వెళ్లిపోతాయి. పాలకొండ అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిపోతాయి. అవి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి రావు.
విజయనగరం జిల్లా పరిధిలోని పార్వతీపురం వాసులు ఇప్పటికే తమ జిల్లాను ప్రత్యేక జిల్లాగా చేయాలని ర్యాలీలు తీస్తున్నారు. పార్టీలకతీతంగా అక్కడ నాయకులంతా జిల్లా సాధన ఉద్యమాలు చేపడుతున్నారు.
ఇక చిత్తూరు జిల్లా మదనపల్లె వాసులయితే ఏకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసారు. తమ మాధానపల్లెను అయితే ప్రత్యేక జిల్లాగా, లేదంటే... చిత్తూరు జిల్లాలోనైనా, లేదంటే.... కర్ణాటకలోనయినా కలపండి అని అంటున్నారు.
నెల్లూరు జిల్లాలో సైతం ఇదే రకమైన సమస్య ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు, వేంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట తిరుపతి నియోజకవర్గ పరిధిలోకి వెళ్తాయి. మిగిలినవి నెల్లూరు పార్లమెంటు పరిధిలోకి వెళ్తాయి. ఏకంగా కోస్తాప్రాంతం కాస్త ఇప్పుడు రాయలసీమ అయిపోతుంది.
ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమవ్వలేదు. అందరూ దీని గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు. సొంతపార్టీలోనే నేడు పుష్పశ్రీవాణి అడిగారు, మొన్న ధర్మాన అన్నారు, రేపు మరో నేత అడగరని గ్యారంటీ ఏమిటి?
తెలంగాణాలో సైతం జిల్లాల ఏర్పాటప్పుడు ఎంత రచ్చ జరిగిందో అందరూ చూసారు. ప్రతిఒక్కరు తమకు ప్రత్యేక జిల్లా కావాలని ఉద్యమాలు చేసారు. సాధారణంగా ఒక జిల్లాలో కనీసం 5 నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.కానీ తెలంగాణాలో అయితే రెండు నియోజకవర్గాలతో కూడా జిల్లా ఏర్పడింది.
కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కేవలం రెండు అసెంబ్లీ నియోజికవర్గాలతోనే ఏర్పడింది. ఇప్పటికి తెలంగాణాలో సగం మందికి ఏ జిల్లా పరిధిలోకి ఏ ఊరు వస్తుందో అర్థంకాక, జర్నలిస్టులు సైతం ఉమ్మడి నల్గొండ, వరంగల్ అని రాస్తుండటం మనమందరం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల ఏర్పాట్లపై మరింతమంది సొంతపార్టీ నేతల గొంతుకలే త్వరలో వినబడుతాయి అనడంలో సందేహం లేదు.