బిజెపికి జై: చిరంజీవి చేసిన తప్పునే పవన్ కల్యాణ్ రిపీట్
విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో పవన్ వైఖరి పార్టీకి, ఆయనకి నష్టం చేసేదిగా కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే... గతంలో అన్న చిరంజీవి చేసిన తప్పునే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా అనే అనుమానం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం తారాస్థాయిలో సాగుతుంది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు రోడ్లమీదకు వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. టీడీపీ నేతలు ఏకంగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంటు అంశం అవడంతో ప్రజలంతా ఈ విషయంలో చాల కోపంగా ఉన్నారు. కేంద్రం తథ్యంగా ప్రైవేటుపరం చేస్తామని చెప్పడంతో బీజేపీ మెడకు ఈ అంశం చుట్టుకుంది.
ఇకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించింది. టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తుంది. ఇప్పటికే నిరాహారదీక్షల నుండి మొదలు గంటా శ్రీనివాసరావు రాజీనామా వరకు అనేక ఎత్తులు, పైఎత్తులు వేస్తుంది. బీజేపీ నేతలు ఎవరికి దొరకకుండా... తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇక మిగిలిన ప్రధాన పార్టీ జనసేన.
ప్రజాసమస్యల మీద పోరాటం చేస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నా విధి, నా పవన్ కళ్యాణ్ ఈ విశాఖ ఉక్కు విషయంలో మొన్నటివరకు మాట్లాడింది లేదు. ఇక మాట్లాడడం మొదలుబెట్టడమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వైఖరికి మడుగులొత్తుతున్నట్టుగా మాట్లాడారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నవే అని, విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రమే వేరుగా చూడొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
దేశం కోసం,దేశ ప్రయోజనాల దృష్ట్యా వంటి వ్యాఖ్యలను పవన్ చేయడమంటే అది ఖచ్చితంగా బీజేపీ వైఖరినే చెప్పవచ్చు. బీజేపీకి అనుకూలంగా పవన్ వ్యవహరిస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. అమరావతి ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న పవన్.... బీజేపీ దానిని లైట్ తీసుకుందనగానే కాడి ఎత్తేసారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే బీజేపీని అనుసరించే వైఖరి అవలంబిస్తున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ వైఖరిని బట్టి చూస్తుంటే... ప్రస్తుత 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ తమ నిర్ణయానికి ప్రజామోదం దక్కించుకోవాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ సెంటిమెంటుతో కూడుకున్న అంశం అయినందువల్ల ఇది పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీకి నష్టం చేసేదిగా కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే... గతంలో అన్న చిరంజీవి చేసిన తప్పునే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా అనే అనుమానం కలుగుతుంది.
2014 రాష్ట్ర విభజన ప్రకటన వెలువడే సమయానికి ఆయన కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి. విభజన ప్రక్రియ సమయంలో ఆయన గనుక రాజీనామా చేసి వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఉంటే.... ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కానీ ఆయన అలా చేయలేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా... బలంగా ముందడుగు వేయలేకపోయారు. ఆ దెబ్బకు చిరంజీవి పొలిటికల్ కెరీర్ ముగిసిపోయింది.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైతం బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయానికి మడుగులొత్తుతుండడం చూస్తుంటే... పవన్ కళ్యాణ్ కూడా అన్న బాటలోనే పయనిస్తున్నాడా అనే అనుమానం కలుగక మానదు. దీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ స్వల్పకాలీన ప్రయోజనాల కోసం బీజేపీ వైఖరిని సమర్థిస్తుండడంతో స్వయంగా జనసేన పార్టీ వారే తలలు పట్టుకుంటున్నారు. చూడాలి చిరంజీవి కన్నా ఎంత భిన్నంగా పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిని డీల్ చేస్తారో..!