IPL 2021: రాజస్థాన్ 'రాయల్' ఫలితం అందుకోవాలంటే ఈ ప్లేయర్స్ ఆటతీరు కీలకం...
ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ తో సహా చీఫ్ కోచ్ ని కూడా మార్చేసింది. ఈ మార్పులైనా రాయల్స్ కి కలిసి వస్తాయా లేదా జట్టు బాలలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాము.
ఎవరూ ఊహించని విధంగా అండర్ డాగ్ గా బరిలోకి దిగి తొలి ఐపీఎల్ టైటిల్ ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది రాజస్థాన్ రాయల్స్. స్వదేశీ ఆటగాళ్ల జోరును పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి ట్రోఫీని ఎగరేసుకుపోయింది రాజస్థాన్. ఆ అద్భుత విజయం తరువాత రాయల్స్ మరెప్పుడూ కూడా ఫైనల్స్ చేరింది లేదు. నాయకత్వ మార్పు ఐపీఎల్‌లో మంచి ఫలితాలు ఇవ్వటం రివాజుగా మారిన వేళ రాజస్థాన్ కూడా అదే ప్రయత్నాన్ని చేసింది. అప్పట్లో పుణె ధోనీని తీసేసి స్మిత్‌తో ఫైనల్స్‌కు చేరుకోగా.. తాజాగా గంభీర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పుడు రాయల్స్ సైతం స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను వదిలేసి యువ కెరటం సంజు శాంసన్‌కు నాయకత్వ పగ్గాలు అందించింది. ఈ మార్పు రాయల్స్‌కు రాయల్ ఫలితం అందించగలదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 2020 సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ అట్టడుగు స్థానంతో ముగించింది. లీగ్ దశ పాయింట్ల పరంగా, సీజన్‌లో మూడోస్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే రాజస్థాన్ రాయల్స్ రెండే పాయింట్ల వెనుకంజలో నిలిచింది. ఆఖరు వరకూ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. జట్టు నాయకత్వంలో కీలక మార్పులు చేసిన రాయల్స్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఆశిస్తోంది.
యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించిన రాయల్స్.. చీఫ్ కోచ్‌నూ మార్చివేసింది. జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, డెవిడ్ మిల్లర్, క్రిస్ మోరీస్ వంటి సీనియర్ అంతర్జాతీయ క్రికెటర్లు సంజు సారథ్యంలో ఆడనున్నారు. గత సీజన్ ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టిన సంజు తర్వాత నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో వ్యక్తిగత ప్రదర్శనలో నిలకడ చూపించటంతో పాటు జట్టును ముందుండి నడిపించటం సంజు శాంసన్‌కు సవాల్‌గా నిలువనుంది.
రాజస్థాన్ రాయల్స్ ఎంతో నమ్మకం ఉంచిన స్టీవ్ స్మిత్‌ను అనూహ్యంగా వదులుకుంది. వేలంలో సఫారీ పేస్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్‌ను జట్టులోకి తీసుకుంది. జట్టుగా రాయల్స్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. సమిష్టిగా రాణించటంపైనే ఫలితాలు ఆధారపడి ఉన్నాయి.
విదేశీ ఆటగాళ్లు రాయల్స్‌కు అత్యంత కీలకం. జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ మోరీస్‌లపై రాయల్స్ అధికంగా ఆధారపడుతుంది. పేస్ విభాగంలో మోరీస్ రాకతో ఆర్చర్ మరింత ప్రభావశీలంగా రాణించే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ విభాగంలో బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్ మెరుపులు ఇన్నింగ్స్‌ల ఆడితే రాయల్స్‌కు తిరుగుండదు. కెప్టెన్ సంజు స్వయంగా విధ్వంసకారుడు. గత సీజన్‌లో వండర్స్ చేసిన రాహుల్ తెవాటియ ఉండనే ఉన్నాడు. ఈ అంశాలు రాయల్స్‌కు కలిసి రానున్నాయి.
టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఆల్‌రౌండర్లు, పేస్, స్పిన్ విభాగాలు.. ఇలా అన్ని రంగాల్లోనూ రాయల్స్‌కు నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, కార్తీక్ త్యాగి అదనపు బలం. అయితే వ్యక్తిగతంగా అందరూ మ్యాచ్ విన్నర్లుగా కనబడుతున్నప్పటికీ... జట్టుగా ఆడటంలో రాయల్స్ నిలకడగా రాణంచటంలో విఫలం అవుతోంది. ఈ సీజన్‌లో రాయల్స్‌కు అదే అతిపెద్ద బలహీనత. చూడాలి రాయల్స్ ఈ బలహీనతను ఎలా అధిగమిస్తారో..!