ఈటెల రాజేందర్ పక్కా వ్యూహం: కేసీఆర్ మీద విపక్షాలకు అస్త్రం
ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనపై ఆదేశించిన విచారణ విపక్షాలకు కొత్త అస్త్రం అయ్యేలా కనబడుతుంది.
తెలంగాణలో నిన్నటి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ రానున్న రోజుల్లో చిలికి చిలికి గాలివానగా మారేలా కనబడుతుంది. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవాలని, తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి చేస్తున్న నీచమైన స్వార్థపూరిత కుట్ర అని ఈటల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన నిజంగా అక్రమాలకు పాల్పడితే ఆయన శిక్షార్హుడే. అది విఉచ్చారణలో తేలుతుంది. కానీ ఈ మొత్తం తతంగం వెనుక ఉన్నదీ రాజకీయ కోణం అనేది బహిరంగ రహస్యం.
నిన్న ఈటల రాజేందర్ పై ఆరోపణలు ఒక వర్గం మీడియాలోనే తొలుత వచ్చాయి. ఆ ఆరోపణలు రాగానే వెంటనే కేసీఆర్ స్పందించారు. ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఈ మొత్తం తతంగం చూసిన వారికి, ఆతరువాత ఈటల ప్రెస్ మీట్ విన్న వారికి మొత్తం కథ ఇట్టే అర్థమైపోతుంది.
ఈటల చాలా కాలంగా పార్టీలో ఇమడలేకపోతున్నారనే వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఆయన చేసిన పార్టీలకు ఓనర్లు ఉండరు అనే వ్యాఖ్య అప్పట్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే..! ఆయనను మంత్రివర్గం నుండి తప్పిస్తారని ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినబడుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే కేటీఆర్ ఒకమారు కేసీఆర్, ఈటలకు మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదని అంటున్నారు. ఏ మీటింగ్ లో కూడా ఈటల మనకు కేసీఆర్ పక్కన కనబడడం లేదు.
ఇక ఈటల గురించి తెలిసిన వారు, ఆయన స్వభావం పై ఒక అవగాహనా ఉన్నవారు ఆయన తన ఆత్మభిమానంపై దెబ్బ పడడంతో రాజీనామా చేస్తారని అనుకున్నారు. తొలుత ఈటల కూడా రాజీనామా చేయాలనీ భావించినప్పటికీ... ఆయన తన సన్నిహితులతో చర్చించిన తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆయన మాట్లాడుతూ... తనపై విచారణ జరిపించడాన్ని స్వాగతిస్తున్నానని, తన మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎస్, విజిలెన్స్ విచారణలతో పాటు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాల్సిందేనని రాజేందర్ డిమాండ్ చేసారు.
ఈటలకు ఇప్పుడిది ఆత్మ గౌరవ అంశం. దానికి తోడు ఇప్పుడు ఈటలపై వచ్చిన ఆరోపణల మీద విచారణకు ఆయనే డిమాండ్ చేసారు. తెరాస లో ఇతర నాయకులమీద కూడా ఇలాంటి ఆరోపణలు బోలెడు ఉన్నాయి. కానీ కేసీఆర్ ఏనాడూ ఈ స్థాయిలో ఇంత వేగంగా స్పందించలేదు. రేపటి నుండి ఇతర పార్టీ నేతలు మిగిలిన తెరాస నాయకులపై ఉన్న ఆరోపణలను ఏకరువు పెడుతూ వారిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్లను ముందుకు తీసుకువస్తారు.
దానికి తోడు ఈటల బీసీ అవడం వల్ల బీసీ నాయకుడిని బలిపశువును చేస్తున్నారని, అదే అగ్ర కుల నాయకుల మీద ఇలాంటి చర్యలను తీసుకోవడానికి కేసీఆర్ కి దమ్ముందా అంటూ రకరకాల సవాళ్ళను విసురుతారు. మాదాపూర్ భూముల దగ్గరినుండి మొదలు నేతల భూకబ్జాలు వరకు అనేక ప్రశ్నలు తెర మీదకు తీసుకువస్తారు.
అసలే కరోనా మహమ్మారి విలయతాండవం, మందులు, ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం మీద ఒకింత కోపంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గనుక విపక్షాల నుంచి ఇలాంటి డిమాండ్ వస్తే అప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడడం తథ్యంగా కనబడుతుంది. చూడాలి రాజకీయాల్లో అపరచాణక్యుడిలా చక్రం తిప్పే కేసీఆర్ ఈ విషయాన్నీ ఎలా డీల్ చేస్తారో..!