కాంగ్రెసులో ప్రక్షాళన: పీసీసీ పీఠానికి చేరువలో రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుల్లో భాగంగానే తెలంగాణ బాధ్యతల నుంచి కుంతియాను తప్పిస్తూ... మాణికం ఠాగూర్ ని నియమించింది కాంగ్రెస్. మాణికం ఠాగూర్ నియామకంతో.... మరోసారి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష మార్పు గురించిన చర్చ మొదలయింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సోనియాకు లేఖ రాసిన విషయంలో చెలరేగిన వివాదం చివరకు పార్టీ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతుంది. పార్టీలోని సీనియర్లకు షాక్ ఇస్తూ ఏఐసీసీ నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ప్రకటించింది.
గులాం నబి ఆజాద్, మోతిలాల్ వోరా, అంబికా సోని, మల్లికార్జున్ ఖర్గే వంటి సీనియర్లను పార్టీ సెక్రటరీ పోస్టుల నుంచి తప్పిస్తూ నిన్న ప్రకటన వెలువడింది. రాహుల్ గాంధీ టీం కి చెందిన ముఖ్యులకు ఈ ప్రక్షాళనలో అత్యధిక లాభం కలిగింది. వారందరికీ పెద్ద పీట వేశారు.
రణదీప్ సింగ్ సూర్జేవాలా, జితేంద్ర సింగ్, కేసీ వేణుగోపాల్ వంటి వారికి పెద్ద పీట వేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుల్లో భాగంగానే తెలంగాణ బాధ్యతల నుంచి కుంతియాను తప్పిస్తూ... మాణికం ఠాగూర్ ని నియమించింది కాంగ్రెస్. మాణికం ఠాగూర్ నియామకంతో.... మరోసారి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష మార్పు గురించిన చర్చ మొదలయింది.
రాష్ట్రానికి ఇంచార్జి గా నియమించిన మాణికం ఠాగూర్ తమిళనాడు కు చెందిన వ్యక్తి. విరుద్దనగర్ ఎంపీ గా గెలిచాడు. ఎన్ఎస్ యూ ఐ నుంచి నెమ్మదిగా ఎదిగిన వ్యక్తి. అతని వారు కేవలం 45 సంవత్సరాలు మాత్రమే. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు.
ఈయనను ఇప్పుడు తెలంగాణ ఇంఛార్జిగా నియమించడంతో.... రాష్ట్రంలో ఇక పీసీసీ అధ్యక్ష మార్పు ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. ఇప్పటికే రాహుల్ గాంధీ రాజీనామా చేసిన అనంతరం ఉత్తమ్ కూడా రాహుల్ ఇచ్చిన పిలుపు మేరకు రాజీనామా చేసారు. ఆనాటినుండి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు.
ఇక అప్పటినుండి రేవంత్ రెడ్డి పేరు వినబడుతూనే ఉంది. కొంత కాలం కింద రేవంత్ తన కుటుంబంతో సహా వెళ్లి సోనియాను కలిసి వచ్చినప్పుడు ఇక రేవంత్ నెక్స్ట్ పీసీసీ చీఫ్ అని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్పుడు రేవంత్ పట్ల సుముఖంగానే ఉంది కూడా.
కానీ ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హస్తినలో మకాం వేసి రేవంత్ కి వ్యతిరేకంగా లాబీయింగ్ చేసి సఫలీకృతులయ్యారు. ఇక ఆనాటి నుండి టీపీసీసీ తదుపరి చీఫ్ ఎవరు అనే చర్చ నడుస్తూనే ఉంది.
కాంగ్రెస్ లోని నేతలంతా కూడా ఎవరికీ వారు తాము కూడా ఈ రేసులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. హనుమంతరావు నుంచి మొదలుకొని కోమటిరెడ్డి సోదరుల వరకు ప్రతిఒక్కరు ఈ పదవిని ఆశిస్తున్నారు. వారి లిస్ట్ చాంతాడంత ఉంది.
కాకపోతే.... మాణికం ఠాగూర్ యువ రక్తానికి ప్రాధాన్యత ఇస్తాడు అని అంటున్నారు. కొత్తగా ఏర్పాటైన కార్యవర్గంలోని సభ్యులంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రక్షాళనకు కంకణం కట్టుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ కి లైన్ క్లియర్ అని అంతా భావిస్తున్నారు.
దానికి తోడు రాహుల్ గాంధీకి ఆప్తుడైన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో రేవంత్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. రాహుల్ గాంధీకి రేవంత్ ని పరిచయం చేసిందే డీకే శివకుమార్. అంతే కాకుండా డీకే శివకుమార్ అంటే మాణికం ఠాగూర్ కి ఎనలేని గౌరవం.
ఈ పరిస్థితుల్లో రేవంత్ కి లైన్ క్లియర్ అని అంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ లోని కురువృద్ధులందరిని తప్పించడంతో.... రాష్ట్రంలో కూడా పక్కకుపెట్టినట్టే అని అంటున్నారు. దీనితో రేవంత్ రెడ్డే ఇప్పుడు ఈ పదవికి ఫ్రంట్ రన్నర్ గా కనబడుతున్నారు.