చంద్రబాబు రివర్స్ పంచ్ : జగన్ మెడకు విశాఖ ఉక్కు
ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేదిలా కనబడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఎలా అయినా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద అన్ని వర్గాల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పుడు రాష్ట్రమంతా మార్మోగుతుంది. ప్రజలంతా విశాఖ ఉక్కును ప్రయివేటీకరించొద్దు అని ముక్తకంఠంతో కోరుతున్నారు. విద్యార్థులు,కార్మికులు, మేధావులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ సాధించుకునే సమయంలో ఎంతటి పోరాటం జరిగిందో అందరికి తెలిసిన విషయమే. ఇది సెంటిమెంటల్ అంశం కూడా అవడంతో ప్రజలు దీనికి బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలుసు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టేదిలా ఉంది.
అమరావతి అంశం అయినా కేవలం కొన్ని గ్రామాలకే పరిమితమయి రాష్ట్రమంతా దాని ప్రభావం లేదు. వైసీపీ దాని ప్రభావాన్ని పడకుండా అడ్డుకోగలిగింది కూడా. కానీ ప్రస్తుత విశాఖ ఉక్కు ఉద్యమం మాత్రం రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు దారితీసేలా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన నగరమైన విశాఖకే తలమానికమైన ప్లాంటు ప్రైవేటు పరమవుతుందంటే ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు.
ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేదిలా కనబడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఎలా అయినా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద అన్ని వర్గాల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది. తాజగా గంట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.... గతంలో జగన్ మోహన్ రెడ్డి టీడీపీ మీద ప్రత్యేక హోదా సమయంలో ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి తెరమీదకి తెచ్చేలా కనబడుతున్నారు.
గతంలో ప్రత్యేక హోదా సాధించడానికి ఎంపీలంతా రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సైతం టీడీపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలిసిందే అని పట్టుబట్టారు. ఇప్పుడు మరోసారి రాజీనామాల చర్చ సాగుతోంది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని, వారిపై టీడీపీ పోటీకి ఎవ్వరిని నిలపదని ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు గనుక స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని ఆయన అన్నారు.
ఇప్పుడు ఈ చర్చ తెరమీదకు రావడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రతిపాదనే చివరి అస్త్రంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలంటే రాజీనామా చేయక తప్పని పరిస్థితిని తీసుకురావాలని విపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు గనుక వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అది జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడమే కాకుండా బీజేపీతో జగన్ కి ఉన్న రిలేషన్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎటూ పాలుపోక సందిగ్ధావస్థలో ఉండిపోయింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. వేచిచూడాలి ఈ రాజీనామాల ప్రతిపాదనపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో..!