నేతలపై కేసులతో టీడీపీ విలవిల: జగన్ ను నారా లోకేష్ ఢీకొట్టగలరా?
ఆంధ్రప్రదేశ్ లోని హాట్ విషయాలను పక్కనబెడితే..... ఒక ఆసక్తికర పరిణామం కనబడేదేమిటంటే.... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తెర మీదకు రావడం. నారా లోకేష్ 2014 కి ముందు రాజకీయంగా అంత ఆక్టివ్ గా లేడు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, సోషల్ మీడియా విభాగాలను చూసుకుంటుండేవాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి కాకమీద ఉన్నాయి. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. ఆయనను అరెస్ట్ చేసిన తెల్లారే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా మారింది.
ఇక ఈ రెండు సంఘటనలనే రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి అనగానే.... బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. బడ్జెట్ సమావేశాల్లో ఇక మరోసారి రాజధాని అంశం చర్చకు రావడంతో మరింతకాక మొదలయింది. అసెంబ్లీ నుంచి మూడు రాజధానుల బిల్లు మండలికి చేరుకోవడంతో... అక్కడ జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే...!
మండలిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య బాహాబాహీ జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనపై యావత్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకుంది. మండలిలో కనీసం ద్రవ్య వినిమయ బిల్ కూడా పాస్ అవకుండానే మండలి వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ లోని హాట్ విషయాలను పక్కనబెడితే..... ఒక ఆసక్తికర పరిణామం కనబడేదేమిటంటే.... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తెర మీదకు రావడం. నారా లోకేష్ 2014 కి ముందు రాజకీయంగా అంత ఆక్టివ్ గా లేడు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, సోషల్ మీడియా విభాగాలను చూసుకుంటుండేవాడు.
ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో.... తెరపైన కనబడడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేసారు. 2019 ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన ముద్రను వేయాలని ప్రయత్నం చేసారు. కానీ అక్కడ ఓటమి చెందారు.
వైసీపీ ఎప్పటినుండో చేస్తున్న ఆరోపణలకు మరింత పదునుపెడుతూ.... లోకేష్ ను టార్గెట్ చేసారు. లోకేష్ రాజకీయాల్లో చంద్రబాబుకి గుదిబండలా మారదంటూ... ఇంకా ఒకడుగు ముందుకేసి పప్పు అంటూ కామెంట్లు చేసారు.
ఆ తరువాత లోకేష్ కొన్ని రోజులు కనబడలేదు. ఇక ఆ తరువాత అమరావతి విషయంలో మండలిలో ఆయన ఏదో కనబడే ప్రయత్నం చేసినా అది ప్రత్యక్ష రాజకీయాల ద్వారా జరిగిన ఎన్నిక కాకపోవడం, అయినా అందులో టీడీపీ పార్టీ హైలైట్ అయింది కానీ లోకేష్ నాయకత్వం కాలేదు.
ఇక ఆ తరువాత లాక్ డౌన్. లాక్ డౌన్ సమయంలో అమరావతిలో లేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత లోకేష్ అమరావతికి వచ్చాడు. లాక్ డౌన్ తరువాత అరెస్టులు. ఇక ఈ సందర్భాన్ని లోకేష్ పొలిటికల్ గ్రాఫ్ ని పెంచడానికి చంద్రబాబు వాడుతున్నాడు.
అరెస్టులు జరిగిన తరువాత అందరిని పరామర్శించడానికి లోకేష్ బయటకు వచ్చాడు. వార్నింగ్లను సైతం ఇస్తున్నాడు. లోకేష్ ఇప్పుడు ఎదుర్కొంటుంది ఒక మాస్ ఇమేజ్ ఉన్న నేతను.
జగన్ ఎన్నో కష్టనష్టాలకోర్చి అధికారంలోకి వచ్చాడు. అతడు పార్టీ ప్రారంభించినప్పుడు అతడికి కొద్ది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే ఉంది. లోకేష్ లాగ తండ్రి బలం లేదు. పార్టీలోని మిగిలిన నాయకులే జగన్ మీద ఆధారపడాల్సిన స్థితి.
వీటికి తోడుగా కేసులు. కొత్త పార్టీ. రాజకీయ పెద్ద దిక్కు, నాయకుడు జైల్లో. ఈ సంక్షోభ సమయంలో కూడా జగన్ ఎక్కడా వెరవలేదు. ఏకంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైలు జీవితం గడిపిన తరువాత కూడా పార్టీని అలాగే పటిష్టంగా ఉంచుకోగలిగాడు.
అప్పుడు కూడా ఎమ్మెల్యేలను గాలం వేసి లాగడానికి ప్రయత్నం చేసారు. ఆ తరువాత 2014లో ఓటమి చెందాడు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అయినా పార్టీని ముందుకు నడిపాడు. ఎమ్మెల్యేలను కోల్పోగానే కృంగిపోలేదు. పోరాడాడు.
అంతిమంగా 2019లో అఖండ మెజారిటీతో విజయం సాధించాడు. ఇప్పుడు లోకేష్ ఢీకొనబోతోంది ఈ వటవృక్షంతో. జగన్ కి ఉన్న మాస్ ఇమేజ్ లోకేష్ కి లేదు.లోకేష్ ఇప్పుడు అలాంటి ఇమేజ్ ఉన్న జగన్ తో తలపడుతున్నాడు.
రాజకీయాల్లో ఏమైనా కావొచ్చు. లోకేష్ జగన్ ని ఎదుర్కోలేడు అనేది కాదు. రాజకీయాల్లో ఒక్క ఉద్యమం దెబ్బకు నాయకులే తయారవుతారు. తొలుత కేటీఆర్ ని సైతం అందరూ ఇలానే అన్నారు, ఇప్పుడు కేటీఆర్ జనరంజక నాయకుడు.
వేచి చూడాలి రానున్న రోజుల్లో లోకేష్ ఎలా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటాడో! రాజకీయాల్లో నాలుగేళ్లు అనేది చాలా ఎక్కువ సమయం. అరెస్టుల వల్ల టీడీపీ బలహీనపడుతుందో... లేక జగన్ మీద వచ్చినట్టే సింపతీ వర్క్ అవుట్ అయ్యి లోకేష్ నేతగా ఎదుగుతాడో వేచి చూడాల్సిన అంశం.