ఆనంతో రఘురామ ఫొటో వైరల్: వైఎస్ జగన్ కు ఇక అసమ్మతి చిచ్చు
రఘురామ తనతోపాటు మరికొందరిని పార్టీలోనుంచి బయటకు తీసుకొని వెళతాడు అని కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి. తాజాగా ఆయన ఆనం రామనారాయణ రెడ్డితో చేయి వేసుకొని దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు ఒక రెండు రోజులుగా టీవీల్లో కనబడడం కానీ, పార్టీ మీద విమర్శలు కానీ చేయడంలేదు. ఆయన బహుశా వైసీపీ నేతలు తన పై ఇచ్చిన, కంప్లయింట్లపై కోర్టులో క్వాష్ పిటిషన్ వేసే బిజీలో ఉన్నారేమో.
ఆయన సైలెంట్ గా ఉంటున్నప్పటికీ.... ఆయన మాత్రం వైసీపీ వారిని ఇరకాటంలో పెట్టె పనులను మాత్రం మానుకోవడంలేదు. కార్యనిర్వాహక రాజధానినే అమరావతిలో పెట్టమని వైసీపీ ప్రభుత్వానికి సలహాలివ్వడం దగ్గర్నుండి వైఎస్సార్సీపి పార్టీ పేరు వరకు అనేక విషయాల్లో ఆయన పార్టీని ఇబ్బందులు పెడుతున్నాడు.
ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్లడం అనేది తథ్యం. అది వైసీపీ వేటు వేస్తేనా, లేదా ఆయనంతట ఆయనా అనేది పక్కనుంచితే, రఘురామ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే. పార్టీ ఆయనను దగ్గరకు తీయబోదు. ఆయన మీద ఇప్పటికే అనర్హత వేటు వేయమని స్పీకర్ కి కూడా ఫిర్యాదు ఇచ్చారు.
ఈ అన్ని పరిస్థితుల్లో రఘురామ తనతోపాటు మరికొందరిని పార్టీలోనుంచి బయటకు తీసుకొని వెళతాడు అని కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి. తాజాగా ఆయన ఆనం రామనారాయణ రెడ్డితో చేయి వేసుకొని దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
రామనారాయణరెడ్డి గత కొన్ని నెలలుగా వైసీపీ పై గుర్రుగా ఉన్నారు. అవినీతి నుంచి మొదలుకొని పార్టీలోని అంతర్గత పరిస్థితుల వరకు అనేక విషయాల్లో తన అసంతృప్తిని బయటపెట్టారు. తన నియోజకవర్గం వేంకటగిరి కనబడడం లేదా అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ఆయనేదో ఈ వ్యాఖ్యలను ఒక్కసారిగా ఈ మధ్యకాలంలో చేసినవి కాదు. ఆయన గత కొన్ని నెలలుగా అసంతృప్తిగా ఉన్నారు. 2019లో ఏకంగా ఆయన నెల్లూరులో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, ఇక్కడ లేని మాఫియా లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో సహా అనేక కారణాలు ఆయన సీరియస్ అవడానికి కారణాలున్నాయి.
నెల్లూరు జిల్లాలోని పెద్దా రెడ్లు పార్టీపై గుర్రుగా ఉన్నారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినబడుతున్నాయి. వేమిరెడ్డి నుండి మొదలు ఆనం, నల్లపురెడ్డి వరకు అంతా కూడా అసంతృప్తిగానే ఉన్నప్పటికీ... ఆనం బహిరంగంగానే విమర్శలు చేసారు.
ఈ తరుణంలో రఘురామ ఆనంతో దిగిన సెల్ఫీ చెక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీనేతతో మాట్లాడితే తప్పేంటి,చేయివేసుకొని సెల్ఫీ కూడా దిగకూడదా అని అనిపించొచ్చు. కానీ నెలకొన్న పరిస్థితుల మధ్య వీరి సెల్ఫీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మంత్రులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ రెండు మంత్రి పదవులను త్వరలోనే భర్తీచేస్తారు అన్న చర్చ నడుస్తుంది. రాజ్యసభకు ఎన్నికైన వారు ఇద్దరు బీసీలు అవడం వల్ల, టీడీపీ వైసీపీ పై పదే పదే బీసీలను టార్గెట్ చేసారు అని అంటున్న నేపథ్యంలో..... ఆ రెండు బెర్తులను కూడా బీసీలతోనే నింపాలని యోచిస్తున్నారు జగన్.
ఈ నేపథ్యంలో మంత్రి పదవులపై ఆశలుపెట్టుకున్న చాలామంది నిరాశచెందక తప్పేలా కనబడడం లేదు. అసంతృప్తులు, వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన చేరికలు అన్ని వెరసి వైసీపీలో తాము అన్యాయానికి గురయ్యాము అనే నేతలు మరింతగా అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది.
ఇక జిల్లాల విభజన అంశం నెల్లూరు లో భారీ స్థాయి బాంబు పేల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సర్వేపల్లి, గూడూరు, వేంకటగిరి, సూళ్లూరుపేట తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వెళ్తాయి. దీనితో జిల్లాలో ఈ విభజనలు సునామి సృష్టించినా సృష్టించొచ్చు.
ఈ మధ్యకాలంలో నెల్లూరు పెద్దా రెడ్లు అధిష్టానంపై సీరియస్ గా ఉన్నారని, ఇంతకుముందు రాజుల్లాగా చెలామణి అయినవారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయామని బాధపడుతున్నామని, ఒకవేళ తమ అసంతృప్తులను గనుక చల్లార్చకుంటే పార్టీమారే యోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలొచ్చాయి.
దీనికి తోడుగా రఘురామ ఇప్పటికే పార్టీలోని కొందరు అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారని ఒక వార్త హల్చల్ చేస్తుంది. కానీ వైసీపీకి ఉన్న మెజారిటీ, రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉండడం అన్ని వెరసి ఎవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో అధిష్టానం అలెర్ట్ అయినట్టు తెలుస్తుంది. సజ్జలను నెల్లూరు ఇంచార్జి గా నియమించింది కూడా ఇందుకే అని కొందరు అంటున్నారు. ఇదే గనుక రఘురామ వేయాలనుకుంటున్న బాంబు అయితే అధిష్టానం అలెర్ట్ అవ్వాల్సిందే!