జగన్ మంత్రివర్గ విస్తరణ: స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రయత్నం అదే...
అప్పలరాజు, జోగు రమేష్ ల నుండి మొదలు వేణుగోపాల్, పొన్నాడ సతీష్ వరకు అనేక పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అమాత్యపదవులు ఎవరికీ దక్కుతాయని విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడంలేదు. తాజాగా ఒక కొత్త పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. నేటితో ఆషాఢమాసం పూర్తవుతుంది. శ్రావణమాసంలో కాబినెట్ విస్తరణ అని చెప్పినట్టే ఈ నెల 22వ తేదీన క్యాబినెట్ ని విస్తరించనున్న విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు, మంత్రి పదవులకు కూడ వీరిద్దరూ రాజీనామా చేశారు. దీనితో ఈ కేబినెట్ పదవుల భర్తీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇద్దరూ బీసీ నేతలే అవడంతో.... రెండు ఖాళీలను సైతం బీసీలతోనే నింపుతారనయితే తెలుస్తుంది. ఎవరిని ఆ స్థానాలను ఎవరికీ కేటాయిస్తారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడంలేదు.
అప్పలరాజు, జోగి రమేష్ ల నుండి మొదలు వేణుగోపాల్, పొన్నాడ సతీష్ వరకు అనేక పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అమాత్యపదవులు ఎవరికీ దక్కుతాయని విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడంలేదు. తాజాగా ఒక కొత్త పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
ఆయనే స్పీకర్ తమ్మినేని. తమ్మినేని ఎప్పటినుండో కూడా స్పీకర్ పదవిపై సంతృప్తిగా లేరనేది వినబడుతున్నమాట. ఆయన మంత్రి పదవిని ఆశించారు. అందునా గతంలో మంత్రిగా కూడా పనిచేసారు.
ఆయనకు తొలి మంత్రివర్గ కూర్పులోనే చోటు దక్కాల్సింది, కానీ సామాజికవర్గాల సమీకరణాల వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన మంత్రిపదవిని గురించి బలంగానే ప్రయత్నం చేస్తున్నారట.
ఇటీవల ఆయన రాజకీయంగా కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. స్పీకర్ పదవిలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం కూడా తెలిసిందే. ఆయన మంత్రిపదవి కోసమే ఈ వ్యాఖ్యలు చేసాడని అనేవారు సైతం లేకపోలేదు.
గతంలో ఆయనకు అడ్డంకిగా మారిన సామాజికవర్గం ఆయనకు ఇప్పుడు వరంగా పరిణమించనుందన్నట్టు తెలియవస్తుంది. ఆయన కళింగ సామాజికవర్గానికి చెందిన నేత. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సైతం ఇదే సామాజికవర్గానికి చెందినవాడు.
ఇప్పుడు తమ్మినేనికి మంత్రిపదవి ఇవ్వడంద్వారా... అదే జిల్లాకు చెందిన అచ్చెన్నకు చెక్ పెట్టాలనే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ధర్మాన ప్రసాదరావు పేరు వినబడ్డప్పటికీ.... ఆయన సోదరుడు ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్నందున ఆయనకు బెర్తు దక్కే అవకాశాలు లేవు.
ఇక తమ్మినేనికి మంత్రిపదవి అనే ప్రచారం జోరందుకోవడంతో... స్పీకర్ పదవిలో ఎవరు కూర్చుంటారు అనే మరో చర్చ మొదలయింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ ని ప్రమోట్ చేస్తారన్న వాదన వినబడుతోంది. దీనిపై ఇప్పటికే అనేక విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు గతంలో స్పీకర్ గా పనిచేసారు కూడా. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని కూడా కొందరు ఈ వాదనలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని పక్కకుంచితే కొన్ని వేరే కారణాలు కూడా కనబడుతున్నాయి.
స్పీకర్ పోస్ట్ లో ఉండేవారు సౌమ్యంగా అందరిచేత గౌరవించబడాలని కోరుకుంటారు. కోన రఘుపతి సౌమ్యుడు. పార్టీలకతీతంగా ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. దానికి తోడు అతడి సామాజికవర్గం ఇక్కడ కలిసొచ్చే అంశం. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో కోన రఘుపతికి స్పీకర్ దక్కవచ్చు అని అంటున్నారు.
ఈ లెక్కల ప్రకారంగా తమ్మినేనికి మంత్రి పదవి దక్కుతుందో లేదా ఆయనకు మరోసారి రిక్తహస్తాలే మిగులుతాయా అనేది వేచి చూడాల్సిన అంశం. మరో రోజు పాటు ఈ ఉత్కంఠ కొనసాగవలిసిందే. తాజాగా మంత్రిపదవులు మోపిదేవి, పిల్లి ల రాజీనామాలను ఆమోదించడంతో ఆ శాఖలు ఇప్పుడు జగన్ వద్దనే ఉన్నాయి.