UPI, LPG, రైలు టికెట్లు, పెన్షన్, గేమింగ్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
UPI changes : అక్టోబర్ 1 నుంచి చాలా విషయాల్లో కొత్త మార్పులు రాబోతున్నాయి. యూపీఐ, ఎల్పీజీ, ధరలు, రైలు టికెట్ బుకింగ్, పెన్షన్ స్కీమ్, గేమింగ్ టాక్స్‌లో కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్బీఐ రెపో రేటు, లోన్లపై కొత్త రూల్స్
అక్టోబర్ ప్రారంభంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటుతో పాటు ఇతర ఆర్థిక నిర్ణయాలు ప్రకటించనున్నారు. రెపో రేటులో తగ్గింపు జరిగితే గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం మీ నెలవారీ ఈఎంఐ పై నేరుగా పడుతుంది.
రైలు టికెట్ బుకింగ్‌లో కొత్త నియమాలు
ఐఆర్సీటీసీ (IRCTC) రైలు టికెట్ బుకింగ్‌లో దుర్వినియోగం, మిడిల్‌మ్యాన్ సమస్యలు నివారించేందుకు కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు కేవలం ఆధార్‌తో వెరిఫై అయిన అకౌంట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ నియమం తత్కాల్ బుకింగ్ విధానం తరహాలో తీసుకువచ్చారు.
యూపీఐ లావాదేవీల్లో కీలక మార్పులు
అక్టోబర్ 1 నుంచి యూపీఐ (UPI)లో కలెక్ట్ రిక్వెస్ట్ (Pull Transaction) ఫీచర్ నిలిపివేయనున్నారు. దీంతో ఇకపై యూపీఐ యాప్‌లలో స్నేహితులు లేదా బంధువుల వద్ద నుండి నేరుగా డబ్బు కోరే ఆప్షన్ ఉండదు.
ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్ను
ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో కొత్త పన్ను నియమాలను అమలు చేస్తోంది. గేమింగ్‌పై 28 శాతం టాక్స్ విధించనుంది. దీని ప్రభావం గేమింగ్ కంపెనీలు, ఆటగాళ్లపై పడుతుంది. అదనంగా, పారదర్శకత కోసం కంపెనీలపై కఠినమైన పర్యవేక్షణ ఉండనుంది. కొత్త చట్టం ద్వారా మోసాలు అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎల్పీజీ ధరల సమీక్ష
ప్రతి నెల ప్రారంభంలో ఎల్పీజీ ధరలు సమీక్షిస్తారు. ఈసారి కూడా అక్టోబర్ 1న చమురు కంపెనీలు దేశీయ, వాణిజ్య LPG సిలిండర్ ధరలను సమీక్షించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ మార్పులు నేరుగా వినియోగదారుల వంటింటి ఖర్చులపై ప్రభావం చూపుతాయి.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో మార్పులు
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) అక్టోబర్ 1 నుంచి మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) అమలు చేయనుంది. కొత్త విధానం ప్రకారం ప్రైవేట్ ఉద్యోగులు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్, గిగ్ వర్కర్లు ఒకే పాన్ (PAN) నంబర్ ద్వారా అనేక ఎన్పీఎస్ (NPS) స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు. దీని ద్వారా ఉద్యోగుల పెట్టుబడి ఎంపికలు విస్తరించనున్నాయి.