- Home
- National
- Hijack: ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పెద్ద హైజాక్‌లు ఇవే.. థ్రిల్లర్ మూవీలను తలపించే సంఘటనలు
Hijack: ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పెద్ద హైజాక్‌లు ఇవే.. థ్రిల్లర్ మూవీలను తలపించే సంఘటనలు
బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లో రైలును హైజాక్ చేసిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా హైజాక్ అంటే విమానాలనే చేస్తారని అనుకుంటాం. కానీ తొలిసారి రైలు హైజాక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని అది పెద్ద హైజాక్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్తాన్‌లో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడి చేసి హైజాక్ చేసింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు, వారిలో పలువురు భద్రతా అధికారులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు 215 మందికి పైగా ప్రజలను బందీలుగా చేసుకున్నారు. లోకోపైలట్‌ను తీవ్రంగా గాయపరిచిన తర్వాత రైలు ఆగిపోవడంతో సాయుధులు రైలును చుట్టుముట్టారు.
ప్రయాణికులు, సైనికులను వేర్వేరుగా విడిపెట్టి సుమారు 30 మందిని కాల్చి చంపారు. మొత్తం 215 మందిని బందీలుగా పట్టుకున్నారు, వీరిలో ఎక్కువ మంది పాకిస్థాన్ సైన్యానికి, ఐఎస్‌ఐకి, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్‌కు చెందినవారు ఉన్నారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విమాన హైజాకింగ్ చాలాసార్లు జరిగింది, కానీ ఇది రైలు హైజాకింగ్‌కు సంబంధించిన మొదటి సంఘటన. కాగా ప్రపంచాన్ని కుదిపేసిన ఐదు అతిపెద్ద హైజాకింగ్‌ల గురించి తెలుసుకుందాం.
9/11 అటాక్:
అగ్రరాజ్యం అమెరికాపై జరిగిన ఈ దాడిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. 9/11 దాడి చరిత్రలో అత్యంత భయంకరమైన హైజాకింగ్ దాడిగా నిలిచింది. 2001 సెప్టెంబర్‌లో ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్ చేసి అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలు 11, 77, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు 175తో పాటు 93లను హైజాక్ చేశారు. తరువాత రెండు విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని ట్విన్ టవర్లను ఢీకొట్టాయి. ఈ దాడిలో సుమారు 3000 మంది మరణించారు.
ఎయిర్ ఇండియా కనిష్క:
ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 కనిష్కను 1985 జూన్‌లో హైజాక్ చేశారు. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు బాంబుల సహాయంతో గాలిలోనే పేల్చేశారు. ఈ దాడిలో 329 మంది మరణించారు.
IC 814 కాందహార్ హైజాకింగ్:
IC 814 కాందహార్ హైజాకింగ్ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన హైజాకింగ్‌లలో ఒకటిగా చెబుతుంటారు. ఈ దుర్ఘటన డిసెంబర్ 24, 1999న జరిగింది. ఉగ్రవాదులు మొదట విమానాన్ని పాకిస్తాన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఇంధనం నింపి దుబాయ్‌కు తీసుకెళ్లారు, ఆపై అక్కడి నుండి కాందహార్‌కు తీసుకెళ్లారు. భారతదేశంలో ఖైదీలుగా ఉన్న 35 మంది ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరిలో మౌలానా మసూద్ అజార్ కూడా ఉన్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హైజాక్ వెబ్ సిరీస్ రూపంలో వచ్చింది.
ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ విమానం:
1985 జూన్ 14వ తేదీన ఈ విమానం హైజాక్‌కి గురైంది. ఏథెన్స్ నుంచి రోమ్ కు వెళ్తున్న ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ విమానం 847ని హైజాక్ చేశారు. 17 రోజుల పాటు ప్రయాణికులను బంధించారు. ఈ సమయంలో విమానం రెండుసార్లు బీరుట్‌లో, రెండుసార్లు అల్జీర్స్‌లో, మరోసారి బీరుట్‌లో ల్యాండ్ అయింది.
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్:
1996లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 961ని ముగ్గురు ఇథియోపియన్లు హైజాక్ చేశారు. ఈ హైజాకర్లు ఆస్ట్రేలియాలో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు. ఈ సమయంలో విమానంలో ఇంధనం తక్కువగా ఉండటంతో, కెప్టెన్ విమానాన్ని కొమొరోస్ ద్వీపం వైపు మళ్లించాడు, కానీ అక్కడికి చేరుకోలేక పోవడంతో, విమానం నీటిలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 172 మంది ఉండగా 122 మంది మరణించారు.