Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం.. ఎవరీ రేఖా గుప్తా?
Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025లో విజయం సాధించిన బీజేపీ బుధవారం దేశ రాజధానికి కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ప్రకటించింది. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి బీజేపీ టికెట్‌పై గెలిచారు రేఖ గుప్తా.

BJP leader Rekha Gupta named as the Chief Minister of Delhi (Photo/ANI)
Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిని బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. ఆమె రేఖా గుప్తా. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బీజేపీ బుధవారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. శాసనసభా పక్ష సమావేశం తర్వాత బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖ గుప్తాను ప్రకటించింది. పర్వేశ్ వర్మను డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఎందుకు సీఎం చేశారు? అసలు ఎవరీ రేఖా గుప్తా?
ఎవరీ రేఖా గుప్తా?
ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రేఖ గుప్తా ఎమ్మెల్యే అయిన తొలిసారే ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అంత ఈజీగా ఆమెకు సీఎం పదవి దక్కలేదు. రేఖా గుప్తా తన రాజకీయ జీవితాన్ని సామాజిక కార్యకలాపాలతో ముందుకు సాగి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆమె ముఖ్యంగా మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషి, పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు ఆమె ఢిల్లీ సీఎం పీఠంపై కూర్చుంటున్నారు.
ప్రస్తుతం షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి రెండో మహిళాగా నిలిచారు. అంతకుముందు దివంగత నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రేఖా గుప్తా 1974లో జింద్ జిల్లాలోని జులానాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులో ఆమె తండ్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా ఉద్యోగం పొందారు. దీంతో 1976 లో మొత్తం కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. రేఖ గుప్తా తన మొత్తం విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. ఈ సమయంలోనే ఆమె ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)లో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
Rekha Gupta, Delhi Chief Minister
ఏబీవీపీతో మొదలైన రాజకీయ ప్రయాణం
రేఖాగుప్తా తన రాజకీయ జీవితాన్ని ఏబీవీపీతో ప్రారంభించారు. ఎమ్మెల్యే కావడానికి ముందు ఆమె కౌన్సిలర్, మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, బీజేపీ పార్టీ ఢిల్లీ రాష్ట్ర యూనిట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషిచేశారు. ఢిల్లీ మేయర్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా, తర్వాత మేయర్‌గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందించారు.
ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న రేఖా గుప్తా గతంలో షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు కానీ, విజయం సాధించలేకపోయారు. అయితే, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలీమార్ బాగ్ నుంచి విజయం సాధించారు.
రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయ కార్యదర్శి, ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశారు. 2022లో చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. IMIRC కాలేజ్ ఆఫ్ లా భైనా ఘజియాబాద్ లో LLB పూర్తి చేసి న్యాయవాదిగా కూడా కొనసాగారు.
రేఖా గుప్తా కుటుంబం
వివాహం తర్వాత కూడా రేఖా గుప్తా రాజకీయాలకు దూరంగా ఉండలేదు.రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా వృత్తిరీత్యా విడిభాగాల వ్యాపారవేత్త. ఆయన ఎల్లప్పుడూ తన భార్యకు మద్దతుగా నిలిచారు. వీరి వివాహం 28 జూన్ 1998 జరిగింది. రేఖ గుప్తాకు ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు నికుంజ్ గుప్, కుమార్తె హర్షిత గుప్తా. కుమార్తె తన తండ్రి లాగే వ్యాపారంలో కొనసాగుతోంది. కొడుకు నికుంజ్ గుప్తా ప్రస్తుతం చదువుతున్నాడు.