మీరు దీపావళికి స్వీట్స్ కొంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త
మీరు ఈ దీపావళి పండక్కి స్వీట్స్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ముందుగానే జాగ్రత్త పడండి... లేదంటూ మీకూ ఇతడి పరిస్థితే ఎదురవొచ్చు. ఇంతకూ ఏం జరిగిందంటే...
Sweets
ప్రస్తుతం పండగల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే దసరా పండగ ముగిసింది... ఇక వరుసగా దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండగలున్నాయి. పిల్లాపాపలతో కుటుంబసభ్యులంతా కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండగలివి. ఇలా మనదేశంలో జరిగే ఏ పండగైనా,మరే శుభకార్యమైనా నోరు తీపి చేసుకోకుండా ముగియదు. ఇంట్లో చేసినా సరే... బయట నుండి తీసుకువచ్చినా సరే స్వీట్ లేకుంటే ఆ పండగ పండగలాగే వుండదు.
ఇక దీపావళి పండక్కి ఈ స్వీట్స్ తో ప్రత్యేక అనుబంధం వుంది. దీపావళి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది టపాసులు... ఆ తర్వాత మిఠాయిలు గుర్తుకువస్తాయి. చాలా కంపనీలు తమ ఉద్యోగులకు,వ్యాపారులు తమ సిబ్బందికి ఈ పండగపూట స్వీట్స్ పంచుతుంటారు. ఇక ధనవంతుల నుండి మధ్యతరగతి, పేదవారి వరకు ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేకుండా స్వీట్స్ ను కొనుగోలు చేస్తారు. ఇలా దీపావళి పండక్కి ప్రతిఒక్కరు నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీగా మారడంతో స్వీట్స్ కు మంచి గిరాకీ వుంటుంది.
అయితే ఇదే అదునుగా కొందరు స్వీట్స్ తయారీదారులు తమ లాభార్జన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. చిన్నాచితక తయారీదారులు కాదు... ప్రజల నమ్మకాన్ని పొందిన హల్దిరామ్ వంటి ప్రముఖ సంస్థలు కూడా నాణ్యతను పాటించడంలేదట. ఇలా హల్దిరామ్ స్వీట్స్ లో పురుగులు కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే బయట ఫుడ్స్ కొనాలంటేనే బయపడేలా వుంది.
Haldiram
ఇంతకూ ఈ వీడియోలో ఏముంది?
స్వీట్స్ తో పాటు చిరుతిళ్ల వ్యాపారంలో హల్దిరామ్ టాప్ లో వుంటుంది. ఎన్నోఏళ్ళుగా ఇదే వ్యాపారంలో వున్న ఈ సంస్థ ప్రజల నమ్మకాన్ని పొందగలిగింది. దీంతో హల్దిరామ్ స్వీట్స్ అయినా, ఇతర చిరుతిళ్లు అయినా చిన్నాపెద్ద తేడాలేకుండా చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఇలాంటి సంస్థ కూడా నాణ్యత విషయంలో రాజీ పడినట్లు... పాడయిపోయి పురుగులతో కూడిన స్వీట్స్ ని ఓ కస్టమర్ కు అంటగట్టినట్లు బయటపడింది.
ఇటీవల ఓ వ్యక్తి హల్దిరామ్ స్టోర్ లో స్వీట్స్ కొనుగోలు చేసాడట. అయితే చాలాకాలం నిల్వవుంచినవో లేక స్వచ్చమైన ముడిసరుకులు ఉపయోగించలేదో తెలీదుగానీ ఆ స్వీట్స్ పాడయిపోయాయి.స్వీట్స్ మధ్యలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయం తెలిసికూడా హల్దిరామ్ సిబ్బంది తనకు స్వీట్స్ అంటగట్టినట్లు సదరు వ్యక్తి ఆగ్రహానికి గురయ్యాడు. స్వీట్స్ కొనుగోలు చేసిన షాప్ కు వెళ్లి సిబ్బందిని నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాడయిపోయిన స్వీట్స్ తో కూడిన ప్యాకెట్ హల్దిరామ్ షాప్ కు తీసుకెళ్లిన సదరు వ్యక్తి సిబ్బందిపై చిందులుతొక్కాడు. అంతేకాదు అక్కడున్న ఇతర కస్టమర్లకు స్వీట్స్ ఎలా వున్నాయో చూపించారు. వారిచేతే ఆ స్వీట్స్ ను విరిపించి మధ్యలో పురుగులున్న విషయాన్ని బయటపెట్టారు. ఇలా ఒకటి రెండు స్వీట్స్ కాదు అన్నీ ఇలాగే వున్నాయని ... ఇంతటి అపరిశుభ్రమైన స్వీట్స్ ను తనకు అంటగట్టారంటూ అతడు మండిపడ్డారు.
తాను రూ.20 వేల మిఠాయిలు ఈ హల్దిరామ్ షాప్ నుండి కొనుగోలు చేసానని ... అవన్ని ఇలాగే పాడయిపోయి వున్నాయని అతడు తెలిపాడు. ఇలాంటి స్వీట్స్ మీరు తింటారా అంటూ హల్దిరామ్ సిబ్బందిని ప్రశ్నించారు. ఓ సిబ్బంది నోట్లో ఆ స్వీట్ పెట్టగా అతడు తినకుండా ఉమ్మేసాడు. ఇదీ హల్దిరామ్ స్వీట్స్ పరిస్థితి అంటూ ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేసాడు.
Haldiram
ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ :
హల్దిరామ్ స్వీట్స్ కి సంబంధించిన ఈ వైరల్ వీడియోను మహేష్యాగ్య సేన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుండి పోస్ట్ అయ్యింది. హల్దిరామ్ లో స్వీట్స్, చిరుతిళ్లు కొనుగోలు చేసేముందు జాగ్రత్త... పరీక్షించిన తర్వాతే తీసుకొండి. లేదంటే తనలాంటి అనుభవమే ఎదురుకావచ్చు అనేలా పురుగులతో కూడిన స్వీట్స్ వీడియోను పోస్ట్ చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు చాలామంది నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
పండగల సమయంలో స్వీట్స్ అస్సలు కొనుగోలు చేయవద్దని ఓ నెటిజన్ సూచించాడు. ఎందుకంటే గతంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన స్వీట్స్ ను ఇలాంటి సమయంలోనే అమ్ముతుంటారు... అందుకు ఈ హల్దిరామ్ వీడియోనే ఉదాహరణ అంటున్నాడు. ఈ స్వీట్స్ కి బదులు ఆరోగ్యకరమైన డ్రైప్రూట్స్ కొనుగోలు చేయాలని సూచించాడు.
ఇలా పురుగులతో కూడిన స్వీట్స్ ను కస్టమర్ కు అంటగట్టి హల్దిరామ్ సంస్థ ప్రాణాలతో చెలగాటం ఆడింది. ఇలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆ సంస్థపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది... ఫుడ్ సెప్టీ అధికారులు, పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారు? అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు.
ఇది కేవలం ఒక్క హల్దీరామ్ లో మాత్రమే కాదు అన్ని స్వీట్ షాప్స్ లో ఇదే పరిస్థితి అంటూ మరో నెటిజన్ మండిపడ్డాడు. ఎక్కడ కూడా స్వీట్స్ అప్పటికప్పుడు తయారుచేసి ఇవ్వరు... ఎక్కడో ప్యాక్టరీలో లేదంటే ఇతర ప్రాంతాల్లో తయారుచేసి షాప్ లో తీసుకొచ్చి పెడతారు. కాబట్టి తయారుచేసినవాడు ఎవడో, ఎలా చేసాడో కూడా అమ్మేవాడికి తెలియదు... తనవద్దకు చేరిన స్వీట్స్ ఎలావున్నా అమ్మేయడమే అతడి పని. ఇలా నాణ్యత, పరిశుభ్రత లేకుండా తయారుచేసే స్వీట్స్ ను కూడా ప్రజలకు అంటగడుతున్నారు... అందువల్లే ఇలా పురుగులు కనిపించే పరిస్థితి వచ్చిందన్నారు.