- Home
- National
- Delimitation: డీలిమిటేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు జరిగే నష్టం ఏంటి.? బీజేపీ అసలు టార్గెట్ అదేనా.?
Delimitation: డీలిమిటేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు జరిగే నష్టం ఏంటి.? బీజేపీ అసలు టార్గెట్ అదేనా.?
వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో తమిళనాడు గొంతును నొక్కేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి.? దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎలా అన్యాయానికి గురవుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓవైపు జమిలీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తూనే మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తోంది. వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న చర్చ తెరపైకి వచ్చింది.
అసలు ఏంటీ డీలిమిటేషన్.?
పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదికన ప్రజాప్రతినిధులు ఉండేలా సీట్లు కేటాయించాలన్న ఆలోచనతో.. ఈ డీలిమిటేషన్‌ని తెరమీదకు తీసుకొచ్చారు. ప్రతినిధి సభలో సమాన సంఖ్యలో జనాభాకు ప్రాతినిథ్యం వహించాలనేది ఈ డీలిమిటేషన్ ముఖ్య ఉద్దేశం. డీలిమేషన్ ప్రక్రియను జనగణన ఆధారంగా నిర్వహిస్తారు. అంటే ఏ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఉంటాయన్నమాట.
telugu states
దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గనున్నాయా?
2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1976లో జరిగిన డీలిమిటేషన్ తర్వాత, 2002లో మరోసారి దానిని అనుమతించినా, పార్లమెంట్ సీట్ల సంఖ్యను 2026 వరకు నిలిపివేశారు. ఈ ప్రక్రియ ప్రారంభమైతే కొత్తగా సీట్ల పంపిణీ జనాభా సంఖ్య ఆధారంగా జరగనుంది. అయితే ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణలో ముందుండడమే. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉండడంతో ఆ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇది బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారుతుందని పలువురు విమర్శిస్తున్నారు. అదే విధంగా పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని, ఇక్కడి ప్రజల గొంతు పార్లమెంట్‌లో వినిపించదు అని అంటున్నారు. అందుకే జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనాభా ఆధారంగా సీట్లు సంఖ్య పెరిగితే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్రాల అభివృద్ధి సూచీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలనే వాదన తెరపైకి వచ్చింది.
ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు తగ్గనున్నాయి.?
➼ తమిళనాడులో ప్రస్తుతం 39 ఎంపీ సీట్లు ఉండగా డీలిమిటేషన్ జరిగితే ఈ సంఖ్య 31కి చేరే అవకాశం ఉంది. అంటే 8 సీట్లను కోల్పోనుంది.
➼ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం 42 సీట్లు ఉండగా. ఈ సంఖ్య 34కి చేరే అవకాశం ఉంది.
➼ ఇక కేరళలో ప్రస్తుతం 20 సీట్లు ఉండగా, ఈ సంఖ్య 12కి చేరనుంది.
➼ వెస్ట్ బెంగాల్‌లో 42 సీట్లు ఉండగా, డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 38కి తగ్గే అవకాశం ఉంది.
➼ ఒడిశాలో ప్రస్తుతం 21 సీట్లు ఉండగా ఈ సంఖ్య 18కి తగ్గే అవకాశం ఉంది.
➼ కర్ణాటకలో ప్రస్తుతం 28 ఎంపీ సీట్లు ఉండగా డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 26కి తగ్గే అవకాశం ఉంది.
➼ అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరఖాండ్ వంటి రాష్ట్రాల్లో ఒక్కో సీటు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏ రాష్ట్రాల్లో సీట్లు పెరగనున్నాయి.?
➼ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ఎంపీ సీట్లు రానున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 80 ఎంపీ సీట్లు ఉండగా ఈ సంఖ్య 91కి పెరిగే అవకాశం ఉంది.
➼ ఇక బిహార్‌లో ప్రస్తుతం 40 సీట్లు ఉండగా మరో 10 సీట్లు పెరిగి 50 అయ్యే అవకాశాలు ఉన్నాయి.
➼ అదే విధంగా రాజస్థాన్‌లో 25 స్థానాలు ఉండగా ఈ సంఖ్య 31కి పెరిగే అవకాశం ఉంది.
➼ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 29 సీట్లు ఉండగా ఈ సంఖ్య 33కి పెరిగే అవకాశం ఉంది.
➼ వీటితో పాటు జార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ సీటు పెరిగే అవకాశాలు ఉన్నాయి.