విశాల్ ‘లాఠీ’రివ్యూ
విశాల్‌కు యాక్షన్ హీరో అనే ఇమేజ్ ఉన్నప్పటికీ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా విశాల్ నటించిన మరో డిఫరెంట్ మూవీ లాఠీ.
Laatti Telugu Movie Review
గత కొంతకాలంగా విశాల్ సినిమాలన్నీ బోల్తా పడుతూనే వస్తున్నాయి. ఎనిమి, చక్ర, అయోగ్య ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూశాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడులా విశాల్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు లాఠీ సినిమాకూడా అదే పరిస్దితి కనపడుతోంది. తెలుగులో ఓపినింగ్స్ కూడా దక్కలేదు. ఎన్నడూ లేని విధంగా బాగా లో బజ్ కనపడింది. అందుకు కారణం ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల కావచ్చు. విశాల్ కు ఇక్కడ మార్కెట్ పడిపోవటం వల్ల కావచ్చు. ఏదైతైనేం ఈ సారి పోలీస్ డ్రస్ ..విశాల్ ని కాపాడిందా.... అసలు చిత్రం కథేంటి...ఏ అంశాలు నమ్మి విశాల్ ఈ సినిమా చేసి ఉండచ్చు...
స్టోరీ లైన్
నారాయణ గూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తున్న మురళీ కృష్ణ (విశాల్) నీతి ,నిజాయితీకు మారుపేరు. ఓ రేప్ కేసులో అనుమానితుడుకు కొంచెం గట్టిగా లాఠీ ట్రీట్మెంట్ ఇవ్వటంతో సస్పెండ్ అవుతాడు. అయితే అతని సిన్సియారిటీ తెలిసిన డీఐజీ కమల్ (ప్రభు) రికమెండేషన్ తో బయిటపడి డ్యూటీలో చేరుతాడు. అయితే డీఐజీ ఓ ఫేవర్ అడుగుతాడు. లాఠీ ట్రీట్మెంట్ ని ఓ క్రిమినల్ కు ఇవ్వటమని అడుగుతాడు. కారణం... డీఐజీ కూతుర్ని సిటీలోని పెద్ద రౌడీ శూర కొడుకు వీర అవమానించటమే. దాంతో మురళీ కృష్ణతో వీరాని చావ చితకకొట్టించాడన్నమాట. అంతవరకూ బాగానే ఉంది. కానీ దెబ్బలు తిన్న వీరా ఊరుకుంటాడా...అతను దాన్ని మనసులో పెట్టుకుని తనను కొట్టిన కానిస్టేబుల్ పై పగ పడతాడు. మురళీ కృష్ణ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అప్పుడు మురళీ కృష్ణ ఏం చేస్తాడు? శూర, వీరాలనుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Vishal
విశ్లేషణ
ఓ సాధారణ కానిస్టేబుల్.. ఉద్యోగ విధుల్లో భాగంగా పై అధికారి ఒత్తిడితో ఓ పెద్ద గ్యాంగస్టర్ తో విరోథం తెచ్చుకుంటే ...అతనికి రక్షణ ఇచ్చేదెవరు..డిపార్టమెంట్ అతని వెనక నిలబడుతుందా తనను రెచ్చగొట్టిన అధికారి అయినా సపోర్ట్ ఇస్తాడా అనే ఆసక్తికరమైన ఎలిమెంట్ ని స్టోరీ లైన్ గా తీసుకున్నారు. ఇదంతా సినిమా ప్రారంభమైన పది నిముషాల వరకే అనిపిస్తుంది. ఆ తర్వాత మిగతాదంతా రెగ్యులర్ రొటీన్ రొట్ట కొట్టుడుగా మారిపోతుంది. హీరోయిజం, విలనిజం...ఫైట్స్ అన్నట్లు సాగిపోతుంది. అయితే అదే సమయంలో ఓ సందేహమూ వస్తుంది. విలన్ ... తనను కొట్టించిన పైఅధికారి ని కాకుండా... చెబితే కొట్టిన కానిస్టేబుల్‌పై పగబడుతాడెందుకో అర్థం కాదు..కానిస్టేబుల్ కాబట్టి ఈజీగా తన పగ తీర్చుకోవచ్చు. అదే పై అధికారితో పగ తీర్చుకోవటం అంటే కష్టం అనుకుని హీరో ని సాధిద్దామని వెనకబడ్డాడా... ఏమో అలాగే అనిపిస్తుంది. అయితే ఈ సినిమా పూర్తి యాక్షన్ కాకుండా కాపాడింది తండ్రీ కొడుకుల అనుబంధం ... కన్న కొడుకు కోసం తండ్రి పడే తపన . భార్యాభర్తల మధ్య అనుబంధం వగైరా...అలాగే ఓ నిజాయతీపరుడు కానిస్టేబుల్ అయితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసారు. ఇక స్క్రీన్ ప్లే ఎంత డల్ గా ఉంటుందంటే ఆ ట్విస్ట్ , టర్న్ ఇట్టే గెస్ చేసేయగలుగుతాము. ఏమి కొత్తగా అనిపించదు..ఓటిటిలలో అదిరిపోయే క్రైమ్ మూవీస్ వస్తున్న ఈ టైమ్ లో ఇంకా ఇలాంటి సీన్స్ తో కూడిన సినిమాలు రావటం ఆశ్చర్యమనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే దారుణం...సినిమా అయ్యిపోగానే ..హమ్మయ్య అని పెద్ద నిట్టూర్పు ఇచ్చేలా ఉంటుంది.
Vishal
టెక్నికల్ గా ...
ఈ సినిమా మొదట కథ,స్క్రీన్ ప్లే విషయంలోనే ఫెయిలైంది. దాంతో మిగతా విభాగాలు ఆ ఫెయిల్యూర్ ని అనుసరించాయి. ఈ బోర్ కొట్టే స్టోరీలో డైలాగులు అక్కడక్కడా మెరుపులా బాగున్నాయి. అలాగే సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...బాగుంది. చివరి దాకా కూర్చోపెట్టేలా చేసింది. అయితే అంతోటి టెక్నిషియన్ కూడా కొన్ని చోట్ల సీన్స్ ని లేపలేక బోర్లా పడ్డాడు. యువన్ శంకర్ రాజా పాటలు ఉన్నాయంటే ఉన్నాయి..లేవు అంటే లేవు. సినిమాటోగ్రఫీ యావరేజ్. ఎడిటర్ ...రన్ టైమ్ తగ్గించి ఉంటే ఖచ్చితంగా మంచి ఉపకారం చేసినట్లు అయ్యేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో .... విశాల్ ఎబ్బెట్టు లేకుండా ఓ పిల్లాడి తండ్రిగా సెట్ అయ్యారు. ఆయనకు జోడీగా సునైన నటించింది.ఫెరఫెక్ట్ పెయిర్. సాధారణ కానిస్టేబుల్ పాత్రలో విశాల్ చాలా సహజంగా చేసారు. ప్రభు, తలైవాసన్ విజయ్ రెండు మూడు సీన్స్ అయినా గుర్తుండిపోయేలా బాగా చేసారు. శూర, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ ఫరవాలేదనిపిస్తారు.
బాగున్నవి?
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
యాక్షన్ ఎపిసోడ్స్
బాగోలేనివి?
విసుగెత్తించే రైటింగ్,
బోరింగ్ సీన్స్, కష్టమనించే క్లైమాక్స్
డైరక్షన్ మెరుపులు ఏమీ కనపడకపోవటం
Vishal
ఫైనల్ థాట్
విశాల్ అర్జెంటు గా తనే చేసిన 'అభిమన్యుడు' చూడాలి. అలాంటి సినిమాలే చేయాలి. ఇలాంటి లాఠీలకు కాలం చెల్లింది. చెద పట్టి విరిగిపోతున్నాయి.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్ : 2/5
Vishal
బ్యానర్ : రానా ప్రొడక్షన్స్
నటీనటులు : విశాల్, సునయన, మాస్టర్ లిరేష్ రాఘవ, ప్రభు, తలైవాసల్ విజయ్, మనీషికాంత్ తదితరులు.
మ్యూజిక్ : సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్
స్టంట్ డైరెక్టర్ : దిలీప్ సుబ్బరాయణ్
ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపి
మాటలు : రాజేష్ ఎ. మూర్తి (తెలుగులో)
రచయిత : పొన్ పార్థీబన్
రచన, దర్శకత్వం : ఎ. వినోద్ కుమార్
నిర్మాతలు : రమణ, నంద
విడుదల తేదీ: డిసెంబర్ 22, 2022