Ustaad Movie Review: `ఉస్తాద్` మూవీ రివ్యూ, రేటింగ్
ఇటీవల `భాగ్ సాలే`తో మెప్పించలేకపోయిన శ్రీ సింహా ఇప్పుడు మరో సినిమా `ఉస్తాద్`తో వచ్చాడు. పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 12)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
ప్రముఖ `ఆస్కార్` సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. `మత్తు వదలరా` చిత్రంతో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ రాణిస్తున్నారు. ఆ తర్వాత `తెల్లవారితే గురువారం`, `దొంగలున్నారు జాగ్రత్త`, ఇటీవల `భాగ్ సాలే` చిత్రాలతో అలరించారు. కానీ కమర్షియల్ విజయాలను అందుకోలేదు. తాజాగా `ఉస్తాద్` చిత్రంతో వచ్చాడు. `బలగం` చిత్రంతో హిట్ అందుకున్న కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఫణిదీప్ దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించారు. ఈ సినిమా శనివారం(ఆగస్ట్ 12న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
సూర్య(శ్రీ సింహా) చిన్నప్పట్నుంచి ఎత్తైన ప్రదేశాలంటే భయం. అది తరచూ వెంటాడుతుంది. పెద్దాయ్యాక కూడా ఆ ప్రభావం ఉంటుంది. కొన్ని అవమానాల అనంతరం ఎట్టకేలకు ఫైలట్ కావాలనుకుంటాడు. విమానం నడపాలని కలలు కంటాడు. తను అనుకున్నది సాధిస్తాడు. ఫైలట్‌గా మొదటిసారి ఫ్లైట్‌ని స్మూత్‌గా హ్యాండిల్ చేయాల్సిన క్లిష్ట పరిస్థితి వస్తుంది. తన బాస్ కెప్టెన్( గౌతమ్ వాసుదేవ్) సారథ్యంలో ఆయన ఫ్లైట్ ల్యాండింగ్ చేయాలి. దీంతో ఒకలాంటి టెన్షన్ ఆయన్ని వెంటాడుతుంది. దాన్ని తొలగించుకునేందుకు, బాస్ తిట్ల నుంచి బయటపడేందుకు సూర్య ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో తన బైక్ ఉస్తాద్ స్టోరీని, తన లవ్ స్టోరీని వెల్లడిస్తాడు. మేఘన(కావ్య కళ్యాణ్ రామ్)తో తన లవ్ స్టోరీ ఎలా సాగింది, దానికి తనకిష్టమైన బైక్ ఉస్తాద్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెండు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? ప్రేమని, బైక్‌ని వదిలేసి సూర్య ఫైలట్ ఎందుకయ్యాడు? తన లవర్ ఉందా? బ్రేకప్ చెప్పిందా? అనేది మిగిలిన సినిమా కథ.
విశ్లేషణః
రాజమౌళి, కీరవాణిలు వంటి దిగ్గజ ఫ్యామిలీ నుంచి వచ్చాడు హీరో శ్రీసింహా. కానీ తమ పెద్ద వాళ్ల సపోర్ట్ లేకుండా తాను స్వతహాగా హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కథల ఎంపికలో కూడా తమ పెద్ద వాళ్ల ప్రమేయం లేదా? లేక వారి సమక్షంలోనే ఇది జరుగుతుందా? అర్థం కావడం లేదు. జనరల్‌గా ఇండస్ట్రీలో తమ వారసులు నిలబడేందుకు పేరెంట్స్ గట్టి ప్రయత్నాలు చేస్తాడు? హీరోగా రుద్దే ప్రయత్నం చేస్తారు. కథల ఎంపిక నుంచి, టెక్నీషియన్ల వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ శ్రీసింహా విషయంలో ఈ రెండు జరగడం లేదని అర్థమవుతుంది. అతను చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న చిత్రాలు చేయాలనే ఆలోచనలో ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలనే జడ్జ్ మెంట్ మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. శ్రీ సింహా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఏదీ చెప్పుకోదగిన విధంగా ఆదరణ పొందలేదు. ఆడియెన్స్ ని మెప్పించలేకపోతున్నాయి. ఇటీవల `భాగ్ సాలే`తోనూ అదే జరిగింది. ఇప్పుడు `ఉస్తాద్` విషయంలోనూ అదే జరుగుతుందనిపిస్తుంది.
`ఉస్తాద్` ఓ బైక్‌పై ప్రేమని, అమ్మాయి ప్రేమని ముడిపెట్టి తీశారు. దీనికి ఫైలట్ కావాలనే డ్రీమ్‌ని మేళవిస్తూ దర్శకుడు ఫణిదీప్ ఈ కథని రాసుకున్నాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం. కథ కొత్తగా ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయాడు. సినిమా కథనంలో క్లారిటీ మిస్ అయ్యాడు. దీనికితోడు స్లో నరేషన్ ఓ మంచి కంటెంట్‌ని కిల్ చేసిందని చెప్పొచ్చు. థియేటర్లో ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించారు. సినిమా ప్రారంభం నుంచే నీరసం స్టార్ట్ అవుతుంది. ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాకుండా వచ్చిపోతుంటాయి. దీనికితోడు స్లో డైలాగ్ డెలివరీ, స్లో సీన్లు, పండని కామెడీ చిరాకు తెప్పిస్తాయి. ఎంగేజ్ చేసే ఒక్క అంశం కూడా సినిమాలో కనిపించదు. మరోవైపు సినిమా `ఉస్తాడ్` బైక్ బయోపిక్‌లా ఉంటుంది.
ఇక `ఉస్తాద్`లో అక్కడక్కడ కొన్ని సీన్లు ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో మంచి ఫీల్ ఉంది. కానీ అది ల్యాగ్ వల్ల కిల్ అయిపోయింది. లవ్ స్టోరీ బాగుంది. కానీ దాన్ని డిస్టర్బ్ చేసే అంశాలతో అది కిల్ అయిపోయింది. మరోవైపు బైక్‌తో ఉన్న అనుబంధంలోనూ ఒక ఎమోషన్ ఉంది. కానీ ఈ ఫ్లోకి అడ్డుపడే చాలా అంశాలు ఆ ఎమోషన్ ని ఆడియెన్స్ ఫీల్ కాకుండా చేస్తాయి. లవ్ స్టోరీలో కావ్యతో కలిసి మాట్లాడే సీన్లు, ప్రేమ ప్రయత్నాలు కాస్త కొత్తగా ట్రై చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే డైలాగులు, కొంత బోల్డ్ గా సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. లవ్ లెటర్ రాసుకునే తీరు కూడా బాగుంది. కానీ మధ్యలో అర్థం లేని సన్నివేశాలతో అవి అంతగా కనెక్ట్ కాలేవు. దీంతో బోర్ ఫీలింగ్ కలుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఫ్రీక్లైమాక్స్ లో బైక్ ఎపిసోడ్, లవ్ ఎపిసోడ్‌కి ముడిపెడుతూ వచ్చే సీన్‌లో హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. బైక్‌తో హీరో మాట్లాడే సీన్లు, అదే బైక్‌పై వెళ్లి తన లవర్‌ని కలిసిన సీన్లు బాగున్నాయి. అందులో ఫీల్ ఉంది. ఎమోషన్స్ ఉన్నాయి. కానీ తీరా క్లైమాక్స్ లో మాత్రం తేలికగా వదిలేశాడు. దీంతో ఆ కిక్ కంటిన్యూ కాలేదు. ఎలాంటి హై ఫీల్ లేకుండానే క్లైమాక్స్ ముగిసినట్టుగా అనిపిస్తుంది. ఏదో అసంతృప్తిగా మిగిలిపోతుంది.
నటీనటులుః
శ్రీ సింహా నటుడిగా మెప్పించాడు. కొంత పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. హీరోయిజానికి పోకుండా సాధారణ కుర్రాడిలా కనిపించి ఆకట్టుకున్నాడు. సైలెంట్‌గా ఆడియెన్స్ హృదయాలను టచ్ చేశాడు. బైక్‌తో అతని ఎమోషన్ సీన్లలో బాగా నటించాడు. లవ్ సీన్లలోనూ మెప్పించాడు. ఓ రకంగా సినిమాని మోశాడు. ఇక మేఘనగా కావ్య మరోసారి మెప్పించింది. లవ్ సీన్లలో బాగా చేసింది. కొంత కామెడీ చేసి నవ్వించింది. పాత్రకి యాప్ట్ గా నిలిచింది. హీరో ఫ్రెండ్ పాత్రలో రవి తేజ.. కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. కానీ అన్ని సార్లు వర్కౌట్ కాలేదు. హీరో తల్లిగా అను హాసన్ బాగా చేసింది. తెలుగులో ఆమెకి గుర్తింపు తెచ్చే పాత్ర అవుతుంది. మిగిలిన వారంతా ఓకే అనిపించారు.
టెక్నీషియన్లుః
`ఉస్తాడ్` సినిమాకి అకీవ బీ మ్యూజిక్ కొంత వరకే హెల్ప్. పాటలు కథలో భాగంగా వచ్చిపోతాయి. గుర్తిండిపోయేలా పాటలు లేవు. ఆర్‌ఆర్ కూల్‌గా ఉంది. ల్యాగ్ ఫీలింగ్‌ని మాత్రం తగ్గించలేకపోయింది. కానీ నాట్ బ్యాడ్. పవన్ కుమార్ పప్పుల కెమెరా వర్క్ బాగుంది. పీరియడ్ లుక్‌లో వేరియేషన్స్ చూపించారు. సహజంగా అనిపిస్తుంది. ఎడిటర్ వైఫల్యం చాలా ఉంది. అవసరమైన సీన్లని లేపేయడంలో ఆయన విఫలమయ్యాడు. ఇంకా షార్ప్ చేయాల్సింది. నిడివి కూడా సినిమాకి మైనస్సే. నిర్మాణ విలువలు ఉన్నంతలో ఓకే. కథ డిమాండ్ మేరకు ఇచ్చారు. కాకపోతే చాలా కంట్రోల్‌గానే నిర్మించారని అర్థమవుతుంది. దర్శకుడు ఫణిదీప్ రాసుకున్న కథ బాగుంది. కానీ దాన్ని అంతే బాగా, అంతే అందంగా, అంతే ఎమోషనల్‌గా, అంతే ఫీల్‌గుడ్‌గా తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు. ప్రధానంగా సినిమాలో ఫీల్ మిస్సయ్యింది. దీంతో కథ కనెక్ట్ కాలేకపోయింది. కొన్ని సీన్ల వరకే బాగున్నాయనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు ఇంకా వర్క్ చేయాల్సింది.
ఫైనల్‌గాః `ఉస్తాద్` బైక్ నేమ్ వరకు ఓకే, కానీ సినిమాలో అంత మ్యాటర్ లేదు.
రేటింగ్‌ః 2
నటీనటులు: శ్రీ సింహా కోడూరి, కావ్య కల్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, రవిశివ తేజ, సాయి కిరణ్ ఏడిద తదితరులు.
రచన, దర్శకత్వం: ఫణిదీప్
సినిమాటోగ్రఫి: పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్: అకీవ బీ
ఎడిటర్: కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
బ్యానర్: వరాహి చలన చిత్ర
నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు.