- Home
- Entertainment
- Movie Reviews
- Thella Kagitham Movie Review: తెల్ల కాగితం మూవీ రివ్యూ.. టీనేజ్ ప్రేమలో తప్పు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Thella Kagitham Movie Review: తెల్ల కాగితం మూవీ రివ్యూ.. టీనేజ్ ప్రేమలో తప్పు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, కొత్త అమ్మాయి నక్షత్ర జంటగా నటించిన చిత్రం `తెల్ల కాగితం`. టీనేజ్ లవ్ లోని తప్పులను బేస్ చేసుకొని తీసిన ఈ మూవీ ఎలా ఉందంటే?

తెల్ల కాగితం మూవీ రివ్యూ
టీనేజ్ ప్రేమకథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడటం, ఆ వయసులో తీసుకునే నిర్ణయాలు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు శుక్రవారం (అక్టోబర్ 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మరి టీనేజ్ ప్రేమ, ఆ వయసులో చేసే తప్పులు, వాటి పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? `కోర్ట్` ఫేమ్ హర్ష్ రోషన్‌కి మరో హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
తెల్ల కాగితం మూవీ కథ
భీమవరం పరిసర ప్రాంతాల్లోని ఓ గ్రామంలో రాము (హర్ష్ రోషన్) తన అన్న, వదినల(శరణ్య)తో కలిసి జీవిస్తుంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నా వదినలే అతడికి అన్నీ అవుతారు. అదే ఊరిలో మెడికల్ షాప్ నడుపుతూ నిజాయితీగా జీవించే మూర్తి (అజయ్) ఉంటాడు. ఆయన కూతురు ఆశ (నక్షత్ర) కూడా రాము చదివే పాఠశాలలోనే చదువుతుంటుంది. స్కూల్లో ఈ ఇద్దరు టిఫిన్స్ మార్చుకుంటారు. ఆ విధంగా ఏర్పడిన వీరి పరిచయం పదో తరగతి చదువుతున్న సమయంలోనే రాము, ఆశ ప్రేమలో పడతారు. అయితే టీనేజ్ వయసులో ఉండే తెలియని ఆలోచనలు, అపరిపక్వత కారణంగా రాము ఓ తప్పటడుగు వేస్తాడు. మావయ్య (రాజ్ కుమార్ కసిరెడ్డి) చెప్పిన మాటలు విని ఆశతో శారీరకంగా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. మొదట ఆశ నిరాకరించినా, రాము తనకు దూరమవుతాడనే భయంతో ఆమె కూడా అంగీకరిస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? చిన్న వయసులో చేసిన తప్పు వారి భవిష్యత్తును ఎలా మార్చేసింది? అనేదే మిగతా కథ.
తెల్ల కాగితం విశ్లేషణ
టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ, అపరిపక్వ నిర్ణయాలు, వాటి పర్యవసానాలు అనే పాయింట్‌తో దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి కథను ఎంచుకున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో పిల్లలకు చాలా విషయాలపై స్పష్టత ఉండదు. ఏది సరైన నిర్ణయం, ఏది తప్పు అనే విషయంలో తడబడుతుంటారు. ఈ అంశాన్ని రాము, ఆశ పాత్రల ద్వారా చూపించే ప్రయత్నం బాగుంది. ప్రథమార్థంలో స్కూల్ లవ్, అమాయకమైన ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని సన్నివేశాలు తేలిపోయినట్లు అనిపిస్తాయి. పదో తరగతి చదివే కుర్రాడికి కండోమ్ అంటే తెలియకపోవడం, దాన్ని బుడగగా భావించి ఊదే సన్నివేశం కొంత నవ్విస్తాయి. హీరో ఫ్రెండ్స్ చేసే పనులు, డైలాగ్‌లు నవ్విస్తాయి. మధ్య మధ్యలో టీనేజ్ లవ్‌కి సంబంధించిన సన్నివేశాలు అలరిస్తాయి. అప్పటి రోజులను గుర్తు చేస్తాయి. సీడీలో అలాంటి సినిమాలు చూడటం, మొదటి ముద్దు, ప్రేమ కోసం ఫిజికల్‌గా కలిసే సీన్లు ఆకట్టుకుంటాయి. టీనేజ్ పిల్లల అపరిపక్వతను చూపించాలనే ప్రయత్నం అర్థమైనా, కొన్ని సన్నివేశాలను మరింత సహజంగా తెరకెక్కించాల్సింది. ఇంటర్వెల్‌లో వచ్చే ప్రెగ్నెన్సీ టెస్ట్ సన్నివేశం కథలో ఆసక్తిని పెంచుతుంది. పీరియడ్స్ కి సంబంధించిన సీన్ నవ్విస్తుంది. అక్కడి నుంచి ఏం జరగబోతోందనే ఉత్కంఠ మొదలవుతుంది. ఫస్టాఫ్‌తో కథ అయిపోయింది. ప్రెగ్నెన్సీని తీయడమా? కంటిన్యూ చేయడమా? అనేదే మ్యాటర్. దాని చుట్టూనే సెకండాఫ్ అంతా నడుస్తుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కథనం నెమ్మదిస్తుంది. ప్రెగ్నెన్సీ తర్వాత హీరో హీరోయిన్ తప్పు మీద తప్పు చేయడం కొంత ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే సీన్లు ఎంగేజ్ చేసినా, ఆ తర్వాత సాగదీసినట్టుగా ఉంటుంది. సినిమాలో ఫన్ సీన్లు కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయ్యాయి. సెకండాఫ్ మొత్తం స్లోగా సాగుతుంది. ఇది బోరింగ్ తెప్పిస్తుంది. సినిమాలో డ్రామా పండలేదు. లవ్ సీన్లలోనూ డెప్త్ లేదు. చివరి 20 నిమిషాల్లో మాత్రం సినిమా బలంగా నిలబడుతుంది. చిన్న తప్పు జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో చూపించిన తీరు ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఇచ్చిన భావోద్వేగ ముగింపు సినిమాకు ప్రధాన బలం. ముగింపు బాధ కలిగించినా ఆడియెన్స్ కి కిక్ ఇవ్వలేకపోయింది. రొటీన్ ఫీలింగ్ ని తెప్పిస్తుంది. ఇలాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. దీంతో పెద్దగా కొత్తగా లేదు. వాటితో పోల్చితే ఇందులో ఎమోషన్స్ లేవు, డ్రామా ఆకట్టుకోలేకపోయింది. రొమాంటిక్‌గానూ అనిపించలేదు. మెయిన్‌గా ఫీల్ మిస్ అయ్యింది.
తెల్ల కాగితం మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
‘కోర్ట్’ తర్వాత హర్ష్ రోషన్ మరోసారి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. చలాకీగా ఉండే కుర్రాడిగా, అమాయకమైన ప్రేమికుడిగా రెండు కోణాల్లోనూ మెప్పించాడు. ముఖ్యంగా చివరి భాగంలో భావోద్వేగ సన్నివేశాల్లో అతడి నటన బాగుంది. నక్షత్ర కూడా ఆశ పాత్రలో చక్కగా నటించింది. హర్ష్ రోషన్‌తో ఆమె కెమిస్ట్రీ సహజంగా ఉంది. హీరోయిన్ తండ్రి మూర్తిగా అజయ్ తన అనుభవంతో పాత్రకు బలం చేకూర్చారు. సినిమాలో ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వదిన పాత్రలో శరణ్య ప్రదీప్ మంచి నటన కనబరిచారు. హీరో స్నేహితుడిగా నటించిన యువకుడితో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
తెల్ల కాగితం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. ‘చిలకా’ పాట ఇప్పటికే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. నేపథ్య సంగీతం కూడా భావోద్వేగ సన్నివేశాలకు చక్కగా సరిపోయింది. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని పునరావృత సన్నివేశాలను కత్తిరించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, టేకింగ్‌లో ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించి ఉంటే సినిమా బాగుండేది. మొత్తంగా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో తడబడిందని చెప్పొచ్చు.
ఫైనల్ నోట్
టీనేజ్ ప్రేమలో చేసే తప్పులకు సంబంధించిన సందేశం బాగున్నా, దాన్ని అంతే బాగా తెరకెక్కించడంలో దర్శకుడు, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో మూవీ తడబడింది.
రేటింగ్ : 2

