`తమ్ముడు` మూవీ రివ్యూ, రేటింగ్.. నితిన్ ఎట్టకేలకు హిట్ కొట్టాడా?
నితిన్ హీరోగా లయ ముఖ్య పాత్రలో నటించిన మూవీ `తమ్ముడు`. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

`తమ్ముడు` మూవీ రివ్యూ, రేటింగ్
నితిన్ హీరోగా సప్తమి గౌడ హీరోయిన్‌గా, లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక ముఖ్య పాత్రలో నటించిన చిత్రం `తమ్ముడు`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. నితిన్ కి గత చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు `తమ్ముడు`పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్లాలని వెయిట్ చేస్తున్నారు. మరి సక్సెస్ దక్కిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`తమ్ముడు` మూవీ కథ ఇదే
వైజాగ్ లోని ఓ పాత కెమికల్ ఫ్యాక్టరీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. వందల మంది చనిపోతారు. ఇది రాష్ట్రంలో పెద్ద ఇష్యూ అవుతుంది. అది పేరుమోసిన కార్పొరేట్ అజర్వాల్(సౌరభ్ సచదేవ) కి చెందిన కంపెనీ. అయితే అది అతను కావాలనే బ్లాస్ట్ చేయించాడు.
సీఎంని, మంత్రులను డబ్బుతో కొనేస్తాడు. కానీ బాధితులు న్యాయం కోసం తిరగబడతారు. ఈ ఘటనపై ప్రభుత్వం కమిటీ వేస్తుంది. వారిని అజర్వాల్ భయపెట్టి తనకు అనుకూలంగా రిపోర్ట్ పై సైన్ చేయిస్తాడు. కానీ ఈ కమిటీ హెడ్ ఝాన్సీ కిరణ్మాయి(లయ) స్టిక్ట్ ఆఫీసర్. ఆమె దేనికీ తలొగ్గదు.
ఆమెని భయపెట్టి సైన్ చేయించుకోవాలనుకుంటాడు. అవసరమైతే ఆమె కుటుంబాన్ని చంపేయాలని ఆదేశిస్తాడు. మరోవైపు జై(నితిన్) నేషనల్ ఆర్చరీ క్రీడాకారుడిగా రాణిస్తుంటాడు. కానీ గోల్ కొట్టడంలో మిస్ అవుతుంటాడు. దానికి కారణం తన మైండ్‌లో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది.
అదేంటనేది తెలుసుకునే ప్రయత్నంలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రమాదం జైలోని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తోంది. అక్క విషయంలో తాను మాట తప్పినది గుర్తుకు వస్తుంది. దీంతో తన అక్కని వెతుక్కుంటూ ఫ్రెండ్ చైత్ర(వర్షా బొల్లమ్మ)తో కలిసి వెళ్తాడు.
ఆ సమయంలో ఝాన్సీ కిరణ్మాయి తమ కుటుంబంతో కలిసి మామయ్య మొక్కు తీర్చడం కోసం సరిహద్దు ప్రాంతమైన అంబర్ గొడుగు జరిగే అమ్మోరు జాతరకి వెళ్తారు. వారిని వెతుక్కుంటూ ఓ వైపు రౌడీలు, మరోవైపు తమ్ముడు వెళ్తారు.
మరి అక్కని జై కలుసుకున్నాడా? ఆమెని విలన్ల నుంచి రక్షించాడా? తానే తమ్ముడిని అని చెప్పాడా? ఝాన్సీ బాధితులకు న్యాయం చేసిందా? ఇందులో రత్న (సప్తమి గౌడ), గుత్తి(స్వసిక) పాత్ర ఏంటి? చివరకు ఏం జరిగిందనేది మిగిలిన కథ.
`తమ్ముడు` మూవీ విశ్లేషణ
చిన్నప్పుడు అక్కకి ఇచ్చిన మాట కోసం, అదే సమయంలో ఆమె ఇప్పుడిచ్చిన మాట కోసం తమ్ముడు నితిన్ చేసే పోరాటమే, బాధితులకు ఇచ్చిన మాట కోసం తాను నమ్మిన సిద్ధాంతంపై నిలబడ్డ అక్క చేసే పోరాటాన్ని ఆవిష్కరించే మూవీ ఇది.
ఆద్యంతం యాక్షన్ ఎమోషనల్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. కథ కొత్తగానే ఉన్నా, దాన్ని నడిపించిన తీరు మాత్రం రెగ్యూలర్‌గానే ఉంది.
హీరో ఆర్చరీలో విఫలం కావడం, తాను విఫలం కావడానికి కారణమేంటనేది తెలుసుకోవడం, అందుకోసం చేసే ప్రయాణం, యాక్సిడెంట్ కావడంతో గతం గుర్తుకు రావడం, అక్కని వెతుక్కుంటూ వెళ్లడం వంటి సీన్లు చాలా సాధాసీదాగా రెగ్యూలర్‌గా అనిపిస్తాయి. తనని తాను తెలుచుకునే విషయంలో కూడా ఏమాత్రం ఎగ్జైట్‌మెంట్ లేకుండా నడిపించారు.
ఇంటర్వెల్ వరకు అంతా ఊహించినట్టే ఉంటుంది. ఏమాత్రం కిక్ ఇచ్చేలా లేదు. ఫారెస్ట్ లో లయ ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంటే అక్కడ వారికి సప్తమి హెల్ప్ చేసే సీన్లు, ఆమె రేడియోలో హీరోతో చేసే సంభాషణలు ఫన్నీగా ఉన్నాయి.
ఆ కన్వర్జేషన్ కామెడీగా ఉంటుంది. అందులో ఏమాత్రం సీరియస్‌నెస్ లేదు. దీంతో ఆ ఎపిసోడ్ తేలిపోయినట్టు ఉంటుంది. ఇక ఇంటర్వెల్ లో కొంత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. ఈ ఫ్యామిలీని చంపేందుకు విలన్లు రావడం, వారి నుంచి హీరో కాపాడే యాక్షన్ సీన్లు మాత్రం అదిరిపోయాయి.
`తమ్ముడు` మూవీలో హైలైట్స్, మైనస్‌లు
సెకండాఫ్ మొత్తం ఫారెస్ట్ లో, అర్థరాత్రి సమయంలో సాగుతుంది. రాత్రి మొత్తం యాక్షన్ ప్రధానంగానే సాగుతుంది. అది `ఖైదీ` సినిమాను తలపించేలా నడిపించారు. దాన్ని అంతే ఉత్కంఠభరితంగా నడిపించడం విశేషం.
నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఒకదాన్ని మించిన ఒక యాక్షన్ సీన్ తో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ని అందించారు. మరోవైపు ఒక లేడీ గర్భంతో ఉండటం, ఆమెని డెలివరీకి సంబంధించిన ఎపిసోడ్ కదిలిస్తుంది.
అదే సమయంలో వర్ష బొల్లమ్మ యాక్షన్ ఎపిసోడ్ కూడా వాహ్ అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఎమోషన్స్ ని, యాక్షన్ ని మేళవిస్తూ నడిపించిన తీరు బాగుంది. ఫస్టాఫ్ రొటీన్‌గా, స్లోగా సాగుతుంది. కానీ సెకండాఫ్ కొంత బెటర్ ఫీలింగ్ నిస్తుంది.
యాక్షన్ ఎలిమెంట్లు హైలైట్‌గా నిలిచాయని చెప్పొచ్చు. అయితే సినిమాలో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. ఎమోషన్స్ ని బలంగా ఎస్లాబ్లిష్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు దర్శకుడు. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఊహించేలా ఉండటం మైనస్.
కొన్ని సీన్లు మరీ సిల్లీగా ఉన్నాయి. యాక్షన్ సీన్లలోనూ లాజిక్ మిస్ అయ్యింది. అదే సమయంలో వాటిని చాలా లెన్తీగా తీయడం మరో మైనస్‌గా చెప్పొచ్చు. అజనీష్ లోక్‌నాథ్ బిజీఎం కొన్ని చోట్ల వాహ్ అనిపించింది.
కానీ సినిమా మొత్తం అది క్యారీ కాలేదు. ఆయన రేంజ్ లో లేదు. దీంతో సీన్లు తేలిపోయాయి. అక్క, తమ్ముడి మధ్య ఎమోషన్స్ ని బలంగా చూపించారు. అలాగే కోడలు, మామయ్య సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అవే సినిమాకి ప్లస్ అని చెప్పాలి.
`తమ్ముడు` మూవీలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్
జై పాత్రలో నితిన్ బాగా చేశాడు. గత చిత్రాలతో పోల్చితే బాగా నటించాడు. చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. యాక్టింగ్ పరంగానూ చాలా బెటర్ ఔట్‌పుట్ ఇచ్చాడు. అదరగొట్టాడు.
ఇక ఝాన్సీ పాత్రలో లయ బాగా సెట్ అయ్యింది. తను మాత్రమే చేయగలదు అనేలా ఆమె పాత్ర ఉంది. అంతే హుందాగా ఉంది. ఆమె సైతం సహజంగా చేసి మెప్పించింది. నటిగా ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసింది.
వీరితోపాటు రత్నగా సప్తమి గౌడ కూడా ఉన్నంత సేపు ఆకట్టుకుంది. ఆమె పాత్రలో రొమాన్స్, కామెడీ బాగుంది. మరోవైపు చైత్రగా వర్షా బొల్లమ్మ అదరగొట్టింది. యాక్షన్ లో ఆమె ఇరగదీసింది.
గుత్తిగా స్వసిక కూడా అదరగొట్టింది. విలన్ పాత్రలో సౌరభ్ సచదేవ తనదైన విలనిజం చూపించి మెప్పించారు. కానీ చివరికి ఆయన ముగింపు తేలిపోయినట్టుగా ఉంది. హరితేజ పాత్ర కూడా బాగుంది.
ఇందులో అబ్బాయిల పాత్రల కంటే అమ్మాయిల పాత్రలే బలంగా ఉండటం విశేషం. మిగిలిన పాత్రలు ఉన్నంతలో మెప్పించాయని చెప్పొచ్చు.
`తమ్ముడు` మూవీ టెక్నీషియన్ల పనితీరు
సినిమాకి `కాంతార` ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ బిజీయం మాత్రం ఆయన రేంజ్‌లో లేదు. సినిమాలో ఆ స్థాయి ఎలిమెంట్లు లేకపోవడమా? ఏమోగానీ తన మార్క్ మిస్ అయ్యిందని చెప్పొచ్చు.
కొన్ని చోట్ల మాత్రం అదరగొట్టాడు. ఇక కేవీ గుహన్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌కి ఇంకా పని చెప్పాల్సింది. ఇంకా బాగా కట్ చేయాల్సింది.
నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా తీశారు. దర్శకుడు వేణు శ్రీరామ్ రాసుకున్న కథ బాగుంది. దాన్ని అంతే కొత్తగా, అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో తడబడ్డాడు. యాక్షన్ సీన్లు బాగా చేసుకున్నారు,
కానీ సినిమా కథని నడిపించే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సెకండాఫ్ తరహాలో ఫస్టాఫ్‌ని కూడా డీల్ చేస్తే, ఎమోషనల్‌గా ఇంకా బాగా తీస్తే సినిమా ఇంకా బాగుండేది.
ఫైనల్‌గాః అక్క మాట కోసం తమ్ముడి పోరాటం. యాక్షన్ సీన్లు కోసం చూడగలిగే మూవీ.
రేటింగ్‌ః 2.5