- Home
- Entertainment
- Movie Reviews
- Sundarakanda Movie Review: `సుందరకాండ` మూవీ రివ్యూ, రేటింగ్.. ఎట్టకేలకు నారా రోహిత్ కి హిట్ పడిందా?
Sundarakanda Movie Review: `సుందరకాండ` మూవీ రివ్యూ, రేటింగ్.. ఎట్టకేలకు నారా రోహిత్ కి హిట్ పడిందా?
`ప్రతినిధి 2`తో రీఎంట్రీ తర్వాత నారా రోహిత్ నటించిన మూవీ `సుందరకాండ`. క్రేజీ లవ్ స్టోరీతో సాగే ఈ మూవీ ఆకట్టుకుందా? నారా రోహిత్ ఎట్టకేలకు హిట్ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

`సుందరకాండ` మూవీ రివ్యూ
నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో మంచి విజయాలు అందుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీనికితోడు కొంత ఆయన నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చాయి. కొంత గ్యాప్ తీసుకుని గతేడాది `ప్రతినిధి 2` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ ఏమాత్రం ఆదరణ పొందలేదు. ఇప్పుడు `సుందరకాండ` అంటూ తన ఏజ్‌కి యాప్ట్ అయ్యే కథతో వచ్చారు. ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నారా రోహిత్‌కి జోడీగా శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహాంకాళి సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ వినాయక చవితి సందర్భంగా బుధవారం(ఆగస్ట్ 27)న విడుదలైంది. మరి ఈ చిత్రంతో అయినా నారా రోహిత్ హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
`సుందరకాండ` మూవీ కథ ఏంటంటే?
సిద్ధార్థ్(నారా రోహిత్) చిన్నప్పుడు స్కూల్‌లో తన సీనియర్ అయిన వైష్ణవి(శ్రీదేవి విజయ్ కుమార్)ని ప్రేమిస్తాడు. లవ్ లెటర్స్ కూడా రాస్తాడు. ఈ విషయాన్ని వైష్ణవి పేరెంట్స్ కి మరో అబ్బాయి అజయ్( నటుడు అజయ్) చెప్పడంతో సిద్ధార్థ్‌ని ఆ స్కూల్ నుంచి తప్పిస్తారు. అప్పట్నుంచి వైష్ణవినే ప్రేమిస్తూ ఉంటాడు సిద్ధార్థ్. ఆమెలోని ఐదు క్వాలిటీస్‌ని ఆరాధిస్తుంటారు. పెద్దయ్యాక కూడా ఆ ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలని నలభై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. తాను అనుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. ఓ రోజు ఫ్రెండ్ పెళ్లికి వైజాగ్‌కి వెళ్తుండగా, ఎయిర్‌పోర్ట్ లో ఐరా(వృతి వాఘాని)ని అనుకోకుండా కలుస్తాడు. ఆమెలో తాను అనుకున్న రెండు క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి. దీంతో ఆ తర్వాత ఆమె కోసం వెతకగా తన ఫ్రెండ్(సత్య) లెక్చరర్‌గా పనిచేస్తున్న కాలేజీలోనే స్టూడెంట్ అని తెలుస్తుంది. దీంతో ఎట్టకేలకు ఆమెని కలుస్తాడు. తాను అనుకున్న ఐదు క్వాలిటీస్ ఆమెలో చూస్తాడు. ఆ తర్వాత ఆమె వెంటపడతాడు. ఎట్టకేలకు ప్రేమలో పడేస్తాడు. కానీ తమ ప్రేమ సక్సెస్ కావాలంటే ఐరా వాళ్ల అమ్మ వైష్ణవి ఒప్పుకోవాలి. ఆమెతో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు ఆమెని చూసి షాక్ అవుతాడు. తాను చిన్నప్పుడు ప్రేమించిన సీనియర్ అమ్మాయి వైష్ణవినే ఐరా వాళ్ల అమ్మ. దీంతో ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. వైష్ణవిని చూసి సిద్ధార్థ్ రియాక్షన్ ఏంటి? ఐరాపై తన ప్రేమని ఆమెతో చెప్పాడా? తాను చిన్పప్పుడు చెప్పాలనుకుని మనసులో మోస్తున్న ప్రేమని వైష్ణవితో చెప్పాడా? సిద్ధార్థ్ కోరుకున్న ఐదు క్వాలిటీస్ ఏంటి? ఈ క్రేజీ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
`సుందరకాండ` మూవీ విశ్లేషణః
నారా రోహిత్ సినిమాలపై ఆడియెన్స్ లో ఒక ఒపీనియన్ క్రియేట్ అయ్యింది. అది తాను చేసిన సినిమాల వల్ల కావచ్చు. కానీ ఆ అభిప్రాయాన్ని బ్రేక్ చేసే మూవీ `సుందరకాండ`. ఈ టైటిల్స్ తో ప్రతి జెనరేషన్‌లోనూ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఎప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్పటి కథలతో రావడంతో ఆడియెన్స్ ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు కూడా ట్రెండీ స్టోరీతోనే నారా రోహిత్ ఈ మూవీ చేశారు. తన ఏజ్‌పై సెటైరికల్‌గానే ఈ మూవీ చేయడం విశేషం. ఇందులో తన పెళ్లి కాకపోవడం, దీంతో ఆయన పడే బాధలు, ఇంకోవైపు తన రూల్స్ కారణంగా పెళ్లిళ్లు సెట్ కాకపోవడం ఇందులో హైలైట్ పాయింట్. వాటి చుట్టూనే ఈ మూవీ కథ తిరుగుతుంది. నారా రోహిత్ పెట్టుకున్న రూల్స్ లాజిక్ లెస్‌గా ఉన్నా, ఇందులో ఉన్న అసలైన కాన్ల్ఫిక్ట్ మాత్రం క్రేజీగా ఉంది. తాను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి కూతురునే ఇప్పుడు ప్రేమించడమే ఇందులో హైలైట్ గా చెప్పొచ్చు. దాని చుట్టూతే అసలు కథ తిరుగుతుంది. ఈ కథని ఎలా తీసుకెళ్లారనేది ఇందులో మరో హైలైట్. ఆ విషయంలో దర్శకుడు ఆడియెన్స్ ని కన్విన్స్ చేసిన తీరు, కథనాన్ని తీసుకెళ్లిన తీరు సినిమాకి మెయిన్ హైలైట్ గా చెప్పొచ్చు. సినిమా ప్రారంభంలో కాస్త రొటీగానే ఉంటుంది. రెగ్యూలర్ సీన్లతో సాగుతుంది. నారా రోహిత్ పెళ్లి రూల్స్, వాళ్ల నాన్న నరేష్ చేసే ఓవర్ యాక్షన్‌తో చప్పగానే సాగుతుంది. తన చిన్నప్పటి లవ్ ట్రాక్‌ని కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పడంతో కొద్దిగా డల్‌గానే అనిపిస్తుంది. అయితే హీరోయిన్ పాత్ర పరిచయం తర్వాత లవ్ ట్రాక్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. సత్య పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా ఫన్నీగా మారుతుంది. కాలేజీలో ఓ వైపు హీరోయిన్‌తో హీరో లవ్ ట్రాక్, ఇంకోవైపు సత్య కామెడీ రెండింటిని బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది.
`సుందరకాండ` మూవీ హైలైట్స్, మైనస్‌లు
ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం క్రేజీగా రాసుకున్నారు. క్రేజీగానే చూపించారు. అక్కడ హీరో షాక్ అవ్వడంతోపాటు ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. అక్కడి నుంచి సెకండాఫ్ మొత్తం అనేక ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. ఆద్యంతం ఫన్నీగానూ సాగుతుంది. అదే సమయంలో అసలు డ్రామా కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి ప్రేమ విషయాన్ని ఫ్యామిలీకి, అటు వైష్ణవికి, మరోవైపు ఐరాకి, ఫ్రెండ్స్ కి తెలియకుండా మ్యానేజ్ చేయడానికి హీరో, అండ్ వారి బ్యాచ్ పడే బాధలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో నరేష్ చేసే కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. తన ఏజ్‌పై నారా రోహిత్ సెటైర్లు వేయించుకున్న తీరు కూడా నవ్వులు పూయించేలా ఉంది. సెకండాఫ్‌లో సత్య తనదైన కామెడీతో సినిమాని తీసుకెళ్లిపోయారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఓ వైపు ట్విస్ట్ లు, మరోవైపు డ్రామాతో తిప్పితిప్పి, కాస్త ఎమోషనల్‌గా మార్చి, చివరికి సుఖాంతం చేసిన తీరు బాగుంది. అయితే సెకండాఫ్‌లో డ్రామా కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. శ్రీనువైట్ల సినిమాలను తలపిస్తుంది. ఇంకోవైపు ట్విస్ట్ లు కూడా ఓవర్‌గా అనిపిస్తాయి. విషయాన్ని తిప్పి తిప్పి చూపించినట్టుగా, చెప్పే విషయాన్ని తిప్పి తిప్పి చెప్పినట్టుగా ఉంటుంది. ఇంకోవైపు కామెడీలో కూడా కొంత సహజత్వం మిస్ అయ్యింది. అక్కడక్కడ బలవంతపు కామెడీగా అనిపిస్తుంది. చివర్లో ప్రేమ గురించి ఇద్దరు హీరోయిన్లతో నారా రోహిత్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్‌గా మంచి కామెడీతో కూడిన క్లీన్ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా `సుందరకాండ` నిలుస్తుంది.
`సుందరకాండ` నటీనటుల పర్‌ఫెర్మెన్స్
సిద్ధార్థ్ పాత్రలో నారా రోహిత్ బాగా నటించారు. తన ఏజ్ కి యాప్ట్ అయిన పాత్ర కావడంతో అంతే బాగా చేశాడు. నటుడిగానూ మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆయన ప్రేమని వ్యక్తం చేసే విషయంలో నటన బాగుంది. సినిమాని తన భుజాలపై తీసుకెళ్లాడు. చిన్నప్పటి లవర్ వైష్ణవిగా శ్రీదేవి సైతం బాగా చేసింది. ఐరా అమ్మగా ఆమె నటన అదిరిపోయింది. హుందాగా అనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు కూడా అందంలో హీరోయిన్‌ని డామినేట్ చేసింది. ఇక ఐరాగా వృతి వాఘాని చాలా అందంగా ఉంది. చాలా బాగా నటించింది. ఆమె పాత్రకి మంచి ప్రయారిటీ దక్కింది. హీరో అక్కగా వాసుకీ కూడాచాలా సహజంగా చేసింది. ఆకట్టుకుంది. ఇంకోవైపు హీరో ఫ్రెండ్ సత్య లెక్చరర్‌గా అదరగొట్టాడు. ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఆయనకు జంటగా నటించిన సునైనా సైతం బాగానే నవ్వించింది. వీరి కామెడీనే సినిమాకి హైలైట్. నారా రోహిత్ తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ రెచ్చిపోయాడు. తనవంతు నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. అమ్మగా రూప లక్ష్మి కూడా బాగా చేసింది. హీరో మరో ఫ్రెండ్‌గా అభినవ్ గోమటం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అజయ్ కాసేపు మెరిశారు. వీటీవీ గణేష్ సీరియస్ రోల్ చేశారు. ఆయన్నుంచి కామెడీ ఆశించలేం. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.
`సుందరకాండ` మూవీ టెక్నీషియన్ల పనితీరుః
సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ అందించిన పాటలు బాగున్నాయి. కొత్తగా అనిపించాయి. మంచి ఫీల్‌గుడ్‌లా సాగిపోయాయి. బిజీఎం కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంది. సినిమాకి మ్యూజిక్ అసెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ప్రదీప్ ఎం వర్మ కెమెరా వర్క్ కూడా బాగుంది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. రోహన్ చిల్లాలే ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయోచ్చు. సినిమా ప్రారంభంలో, ఎండింగ్‌లో కొంత ట్రిమ్‌కి స్కోప్ ఉంది. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఎంచుకున్న పాయింట్ బాగుంది. కొత్తగా, చాలా యూనిక్‌గా ఉంది. దాని చుట్టూ అల్లుకున్న ఫన్, డ్రామా ఆకట్టుకునేలా ఉంది. సంక్లిష్టమైన పాయింట్‌ని డీల్ చేసిన తీరు కూడా బాగుంది. కామెడీ పరంగా మరింత రియాలిటీగా ట్రై చేయాల్సింది. అదే సమయంలో డ్రామా కాస్త ఓవర్ అయ్యిందనే ఫీలింగ్ కలిగింది. చెప్పాలనుకున్న విషయాన్ని కాస్త లాగి చెప్పినట్టు ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మరింత కేర్ తీసుకుంటే `సుందరకాండ` మరింతగా అదిరిపోయేది. ఓవరాల్‌గా సరదాగా ఫ్యామిలీతో చూడగలిగే మూవీ అవుతుందని చెప్పొచ్చు.
ఫైనల్ నోట్‌ః
కొత్త లవ్ స్టోరీ, కామెడీ, ఫ్యామిలీ అంశాలు మేళవించిన పండగలాంటి మూవీ `సుందరకాండ`.
రేటింగ్‌ః 3