- Home
- Entertainment
- Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం నేడు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అఖండ 2 చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

'అఖండ 2' మూవీ రివ్యూ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారెంటీ అని అభిమానులు నమ్ముతారు. సింహా, లెజెండ్, అఖండ ఇలా వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీనితో అఖండ 2 పై ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇది అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్. దీనితో ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. భజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. తమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ పల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం నిర్మాతల ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. సమస్యలని దాటుకుని ఈ చిత్రాన్ని నేడు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రీమియర్ షోలతో అఖండ 2 హంగామా మొదలైంది. మరి అఖండ 2 చిత్రం అభిమానుల అంచనాలని అందుకుందా ? బాలయ్య తాండవం ప్రేక్షకులని మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
అఖండ 2 కథ ఏంటంటే
బాలకృష్ణ అఖండగా అఘోర పాత్రలో, ఎమ్మెల్యేగా బాలమురళి కృష్ణ పాత్రలో ద్విపాత్రాభినయం చేశారు. కథ చైనా టిబెట్ బార్డర్ లో మొదలవుతుంది. చైనా ఆర్మీలో ఉండే ఓ కమాండర్ కి ఇండియా అంటే విపరీతమైన ద్వేషం ఉంటుంది. పీఎం పీఠంపై కన్నేసిన ప్రతిపక్ష నేత సహాయంతో అతడు ఇండియాని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటాడు. దీనితో ఇండియాపై బయో వార్ పథకం రచిస్తారు. మహా కుంభ మేళాలో గంగా నదిలో ఒక వైరస్ ని సృష్టిస్తారు. ఆ వైరస్ వల్ల లక్షల మంది జనం మరణిస్తుంటారు. అఖండ తమ్ముడు మురళి కృష్ణ కుమార్తె జనని(హర్షాలీ మల్హోత్రా) సైంటిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె చైనా వైరస్ కి మందు మందు కనిపెడుతుంది. తిరిగి మళ్ళీ చైనా వాళ్ళు కుట్ర చేస్తారు. ఈ క్రమంలో అఖండ ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. చైనా చేసిన కుట్ర ఏంటి ? అఖండ వారి కుట్రలని ఎలా అడ్డుకున్నారు అనేది మిగిలిన కథ.
అఖండ 2 విశ్లేషణ
బోయపాటి సినిమాల్లో కథ కంటే ఆయన డెలివర్ చేసే మాస్ మూమెంట్స్ ని అభిమానులు, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మాస్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, డైలాగులు పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. బాలయ్యతో సినిమా అంటే ఆ డోస్ ని బోయపాటి ఇంకాస్త పెంచుతారు. అఖండ 2లో కూడా బోయపాటి అదే ప్రయత్నం చేశారు. బాలకృష్ణని అఖండ పాత్రలో బోయపాటి ప్రజెంట్ చేసిన విధానం బావుంది. కానీ బోయపాటి తన స్ట్రెంత్ కి తగ్గట్లు మాస్ మూమెంట్స్ ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సీన్ తప్ప మిగిలినవి వర్కౌట్ కాలేదు. దీనికితోడు బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ లో కనిపించింది చాలా తక్కువ. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం.. ఇది కదా బాలకృష్ణ, బోయపాటి సినిమా అంటే అని అనిపించేలా ఉంటుంది. అభిమానులు అయితే విజిల్ వేయడం గ్యారెంటీ. ఇంటర్వెల్ బ్లాక్ ఒక్కటీ వర్కౌట్ కావడం వల్ల ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని మాస్ సీన్స్, తల్లి సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు పండాయి. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు దైవత్వం, సనాతన ధర్మంపై రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనితో ఆడియన్స్ సెకండ్ హాఫ్ ని సనాతన ధర్మం గురించి చెప్పే క్లాస్ లాగా ఫీల్ అవుతారు. కొన్ని చోట్ల అఖండ వచ్చి క్లాస్ పీకడం కోసమే దైవత్వాన్ని తగ్గించేలా బోయపాటి సీన్లు రాసుకున్నారా అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో బాలయ్య హనుమంతుడి తరహాలో చేసే ఫైట్ సీన్, ఆది పినిశెట్టి తంత్ర విద్యలకు సంబంధించిన సన్నివేశాలు కొంతవరకు మెప్పిస్తాయి. అదే సమయంలో ఎలివేషన్స్ కోసమే రాసుకుని హడావిడి చేసిన సీన్లు కూడా ఉంటాయి. బలవంతంగా పెట్టిన ఎలివేషన్స్ తో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. బోయపాటి సీన్లు రాసుకున్న విధానం ఆకట్టుకోదు. కానీ బాలయ్య మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. ఆది పినిశెట్టి పాత్ర అంత బలంగా లేదు. అసలు ఈ సినిమాలో బలమైన విలన్ సెటప్ అంటూ ఉండదు. చైనానే విలన్ గా చూపించేశారు.
అఖండ 2 నటీనటులు
అఖండ రుద్ర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించారు. అదే విధంగా మరో పాత్ర ఎమ్మెల్యే మురళి కృష్ణగా కూడా మెప్పించారు. రెండు పాత్రలకు బాలయ్య న్యాయం చేశారు.అయితే మురళి కృష్ణ పాత్రకి ప్రాముఖ్యత తక్కువ. సెకండ్ హాఫ్ లో అఖండ రుద్ర పాత్రలో ఊహించని మలుపులు ఉంటాయి అనుకుంటే పొరపాటే. జననిని కాపాడడం, శత్రువులతో పోరాడే సన్నివేశాలే సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఉంటాయి. ఇక అఖండలో ప్రగ్యా జైస్వాల్ కి దక్కిన ప్రాముఖ్యత ఇందులో సంయుక్త మీనన్ కి దక్కలేదు. ఒక సాంగ్, యాక్షన్ సీన్ కోసమే ఆమె పాత్ర అన్నట్లుగా ఉంటుంది. జనని పాత్రలో నటించిన హర్షాలీ తన నటనతో మెప్పించింది. ఆది పినిశెట్టిని బోయపాటి సరిగ్గా ఉపయోగించుకోలేదు. తాంత్రికుడిగా ఆది పినిశెట్టి పాత్రలో హడావిడి మాత్రమే ఉంటుంది. పవర్ కనిపించదు. ఆది పినిశెట్టి నటించిన సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో ఉంటాయి. రావడం డైలాగులు చెప్పడం, హీరో చేతిలో దెబ్బలు తినడం అన్నట్లుగా ఆది పినిశెట్టి పాత్ర ఉంటుంది. విలన్లుగా కబీర్ దుహన్ సింగ్, కల్కి ఫేమ్ శాశ్వత ఛటర్జీ తమ పాత్రల మేరకు నటించారు. పూర్ణ, మురళి మోహన్, ఝాన్సీ ఇతర పాత్రల్లో మెప్పించారు.
అఖండ 2 టెక్నికల్ గా ఎలా ఉంది ?
బోయపాటి శ్రీను దర్శకుడిగా ఈ చిత్రంలో అక్కడక్కడా షైన్ అయ్యారు. ముఖ్యంగా బోయపాటి మార్క్ యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. కానీ రచయితగా బోయపాటి విజయం సాధించలేదు. సనాతన ధర్మం, దేవుళ్ళ గురించి పవర్ ఫుల్ గా ప్రవచనాలు చెప్పడం, క్లాస్ పీకడం కోసమే బోయపాటి కథ రాసుకున్నట్లు ఉంటుంది. కొన్ని డైలాగులు మాత్రం వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ఉంది. కానీ కొన్ని సన్నివేశాల్లో శ్రుతి మించింది. సంగీతం విషయానికి వస్తే అఖండ సక్సెస్ అయింది కాబట్టి తమన్ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. అదే టెంపోలో లౌడ్ బిజీయం ఇచ్చారు. కొన్ని చోట్ల తమన్ సంగీతం సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసేలా ఉంటుంది. కానీ చాలా చోట్ల లౌడ్ నెస్ మరీ ఎక్కువై చిరాకుగా అనిపిస్తుంది. సి రాంప్రసాద్, సంతోష్ డి కెమెరా పనితనం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించదు.
ఫైనల్ రిపోర్ట్
బోయపాటి మాస్ మిస్ ఫైర్ అయింది. బాలయ్య తాండవం అక్కడక్కడా మాత్రమే.. మిగిలినదంతా ప్రసంగమే.
రేటింగ్ : 2.25/5

