Aadavallu Meeku Joharlu: శర్వా‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రివ్యూ
శర్వానంద్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు రిలీజైంది.
Aadavallu Meeku Joharlu
ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ కుటుంబాల మధ్య జరిగే కథలతో రూపొందిన సినిమాలు ఈ మధ్యకాలంలో రావటం లేదు. యాక్షన్ జానర్ లలో హిట్టైన వాటితోనే ఫ్యామిలీ అంతా వెళ్లి సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే ఆ గ్యాప్ ని ఫిల్ చేయటానికి శర్వా నడుం బిగించాడు. వెంకీ చేస్తూండే క్యారక్టర్ తో టైటిల్ లోనే ఆడాళ్లను ఇరికించి మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా థియోటర్స్ కు ఫ్యామిలీలను లాక్కొస్తుందా... చిత్రం కథేంటి...ఎందుకు ఆడవాళ్లకు జోహార్లు చెప్పాల్సి వచ్చింది హీరో అనే విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
చిరంజీవి అలియాస్ చిరు (శర్వానంద్) ఫ్యామిలీ మొత్తం ఆడమళయాళమే. ఓ ప్రక్కన అమ్మ (రాధిక)తో పాటు, ఆమె తోబుట్టువులు అంటే పిన్నిలు నలుగురు (ఊర్వశి, కల్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, సత్య కృష్ణన్) నాలుగు ప్రక్కనా కాచుకుంటూ క్రిందకి అడుగుపెట్టనివ్వకుండా చిరుని గారాబం చేస్తారు. అంతేకాకుండా తమ వంశాంకురానికి అద్బుతమైన అమ్మాయిని అందించాలని తాపత్రయంలో వచ్చిన ప్రతీ సంభంధానికి వంకలు పెట్టి చెడగొడతారు. ఓ ప్రక్కన వయస్సు అయ్యిపోతోంది. చిరంజీవికి బెంగ పెట్టుకుంటుంది.ఇంక తనకు పెళ్లి కాదేమో అని పెద్ద డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు ఆద్య (రష్మిక) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది లైఫ్ సెటిల్ చేసుకోవాలి ఆమెతో అనుకుంటాడు. ఆద్య కు కు ప్రపంచంలో తల్లి తప్ప ఇంకేదీ ముఖ్యం కాదనుకునే వ్యక్తిత్వం. దాంతో ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమె తల్లి వకుళ (ఖుష్బూ)ని ఒప్పించాలి. కానీ ఆమెకు తన కూతురుకి పెళ్లి చేయటం ఇష్టం ఉండదు. ఇప్పుడు చిరు ఏం చేస్తాడు...వకుళ తన కూతురు వివాహ విషయంలో అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది...చివరకు చిరు ఎలా ఆద్యని వివాహం చేసుకున్నాడు అనేది మిగతా కథ.
విశ్లేషణ
టైటిల్, ట్రైలర్ చూడగానే ఇదోదో ఫ్యామిలీ సినిమానే..వాళ్లతో కలిసి చూడాలనే అనిపిస్తుంది. అయితే సినిమా చూస్తే అంత లేదనిపిస్తుంది. సినిమాలో మందలు మందలుగా ఆడవాళ్లు కనపడతారు కానీ పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. తన తల్లి,పినతల్లులు మాట దాటని కుర్రాడు..తన తల్లి మాటే లోకం అనుకునే అమ్మాయి మధ్య జరిగే డ్రామా ఇది. అయితే ఈ డ్రామాకు కావాల్సిన కాంప్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఫన్ తో ఫస్టాఫ్ ని దాటేసారు. సెకండాఫ్ ని అలా దాటేసే ప్రయత్నంలో దొరికిపోయారు. ముఖ్యంగా హీరో,హీరోయిన్ మధ్య ఎస్టాబ్లిష్ కావాల్సిన కెమెస్ట్రీ వర్కవుట్ కాలేదు. ఎక్కడక్కడ ఫీల్ గుడ్ సీక్వెన్స్ లు వర్కవుట్ చేసుకుంటూ పోయారు. చూసేటప్పుడు బాగానే ఉన్నాయి అనిపిస్తాయి. మొత్తంగా చూస్తే ఏమీ చూసినట్లు, తెరపై ఏదీ జరిగినట్లు అనిపించదు. డ్రామా,ఎమోషన్స్ వర్కవుట్ కానప్పుడు ఇలాంటి కథలు సోమరపోతుల్లా బద్దకంగా ఆవలిస్తూ ఉంటాయి. ఫైనల్ గా ఓ పెద్ద మెలోడ్రామా ఎపిసోడ్ తో కంక్లూజన్ ...వామ్మో అనిపిస్తుంది.
Aadavallu Meeku Joharlu
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే...ఆడవాళ్ళు టీవీ సీరియల్స్ కు అలవాటు పడిపోయారు. కాబట్టి వాళ్లు సినిమా చూడాలంటే వాళ్ల రెగ్యులర్ గా చూసే టీవీ సీరియల్ ఫార్మెట్ లోనే సినిమా తీయాలని ఫిక్సై తీసినట్లుంది. కొత్తదనం లేకుండా పాతదనాన్ని త్రివిక్రమ్ మార్క్ డైలాగులతో నింపి అందించే ప్రయత్నం చేసారు. సినిమాలో యాక్షన్ రియాక్షన్ కన్నా మాటకు మాట అనే స్కీమ్ రన్ అవుతుంది. ముఖ్యంగా అందరూ గెస్ చేయగలిగే కథ,కథనం పెద్దగా ఆసక్తిగా అనిపించవు. ఫ్యామిలీ కథగా పెద్దగా ట్విస్ట్ లు ఎందుకనుకున్నారో ఏమో కానీ సాదాసీదాగా నడిచిపోతుంది. కథలో కీలకమైన వకుళ అంత స్ట్రిక్ట్ గా మారడానికి గల కారణాన్ని విజువల్ గా... ఇంకాస్త ఎలాబరేట్‌గా చెప్తే బాగా రిజిస్టర్ అయ్యేది. అలాగే ఎమోషన్స్ ని ఇంకాస్త బలంగా పలికించాల్సింది. అక్కడక్కడా… సన్నివేశాలుగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతాయి కానీ ఓవరాల్ గా జస్ట్ ఓకే అనాలనిపిస్తుంది. కథలో కొత్తదనం లేనప్పుడు స్క్రీన్ ప్లే అయినా కొత్తగా చెప్పాలని అనిపించకపోవటం ఆశ్చర్యం అనిపిస్తుంది. డైలాగులతో నెట్టుకొచ్చేద్దామనే ధైర్యం తో చేసిన సాహసం కావచ్చు.
Aadavallu Meeku Joharlu
నచ్చినవి
వెన్నెలకిశోర్ ఫన్, ఊర్వశి స్టీల్ డబ్బా కామెడీ,
బ్రహ్మానందం రైల్వే స్టేషన్ పెళ్లిచూపులు
దేవిశ్రీ పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కొన్ని డైలాగ్స్
నచ్చనవి
ప్రెడిక్టుబుల్ కథ
ప్లాట్ గా నడిచే కథనం
Aadavallu Meeku Joharlu
టెక్నికల్ గా...
ఈ సినిమాలో పెద్ద టెక్నిషియన్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన సంగీతం సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యింది. పాటలు గౌరవప్రదంగా సాగాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ కూడా సినిమాకు రైట్ ఆప్షన్. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా లాగ్ లు లేకుండా సాగింది. స్క్రిప్టులో నావెల్టీ లేకపోవటం దెబ్బ కొట్టింది. కిషోర్ తిరుమల దర్శకత్వం ప్రతిభ కన్నా డైలాగులు హైలెట్ గా కనపడ్డాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో ...శర్వా తన స్టైల్ లో కాస్తంత ఫన్ చేయటానికి ప్రయత్నం చేసారు. రష్మిక కూడా సేమ్ టు సేమ్ . తన పాత్రను అలవోకగా పోషించుకుంటు పోయింది. రాధిక, ఖుష్బూ, ఝాన్సీ ,ఊర్వశి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్లు. వీళ్లను ఎంచుకోవటమే సినిమాకు కలిసొచ్చింది.సత్య, ప్రదీప్ రావత్ ఫస్టాఫ్ లో ఫన్ బాగా చేసారు.
Aadavallu Meeku Joharlu
ఫైనల్ థాట్
పెళ్లికానీ ప్రసాద్ కథ పదకొండోసారి...
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
శర్వానంద్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు రిలీజైంది.
తెర ముందు..వెనక
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బూ, రాధిక, ఊర్వశి, రాజశ్రీ నాయర్, సత్యకృష్ణన్, కల్యాణి నటరాజన్, ఝాన్సీ, రజిత, ప్రదీప్ రావత్, సత్య, వెన్నెలకిశోర్ తదితరులు
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
రచన- దర్శకత్వం: కిశోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల: మార్చి4, 2022