యాక్షన్ తుఫానే కానీ... ‘జవాన్’ మూవీ రివ్యూ
‘పఠాన్’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కింగ్ ఖాన్ షారుక్..పెద్ద గ్యాప్ లేకుండా వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ‘జవాన్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సారి మరింత డిఫరెంట్ తనను తాను ప్రెజెంట్ చేసుకున్నాడు
#Jawan movie Telugu Review
ఈ మధ్యకాలంలో ఓ హిందీ సినిమా రిలీజ్ కోసం ఇంతలా సౌత్ ఆడియన్స్ ఎదురుచూడ్డం ఇదేనేమో. షారూఖ్ గత చిత్రం పఠాన్ ఇక్కడ కూడా వర్కవుట్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు తమిళ డైరక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా రూపొందటం, నయనతార హీరోయిన్ కావటం, రీసెంట్ గా జైలర్ తో దుమ్ము రేపిన అనిరుధ్ ఈ సినిమాకు పనిచేయటం, విజయ్ సేతుపతి విలన్ గా చేయటం, ఇలా సౌత్ ఇండియన్ ఇంట్రిగ్రెంట్స్ తో నింపేయటంతో మనకు ఇక్కడా క్రేజ్ క్రియేట్ అయ్యింది. మరి ఆ క్రేజ్ ని కంటిన్యూ చేసేలా సినిమా ఉందా..కథేంటి...సినిమా భాగ్యరాజా ఖైధీ వేట చిత్రానికి అనీఫిషియల్ రీమేక్ అని జరుగుతున్న ప్రచారం లో నిజం ఉందా,పఠాన్ లా మ్యాజిక్ చేస్తుందా? చూద్దాం
స్టోరీ లైన్
ప్రారంభమే భారత్ ,చైనా సరిహద్దుల్లో ఓ చోట బాగా దెబ్బలు తిని పడి ఉన్న షారూఖ్ ..అతనికు జ్ఞాపక శక్తి పోయే ఇంజక్షన్ ఇస్తారు. దాంతో ఆ తర్వాత తాను ఎవరో తెలియక తికమకలు పడుతూంటాడు. ముప్పై ఏళ్ల తర్వాత మరో షారూఖ్ (అజాద్) ని చూపిస్తాడు. అతను ఓ జైలర్ కానీ...తన జైల్ సెల్లో ఉన్న కొంతమంది ఆడవాళ్లను టీమ్ గా చేసి వాళ్లతో ఊహించని పనులు చేస్తూంటాడు.... ఆ క్రమంలో ఓ మెట్రో ట్రైన్ ని హైజాక్ చేస్తాడు. ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ పెడతాడు. రైతులు ఎక్కౌంట్ లో నలభై వేల కోట్లు వేయిస్తాడు. మరోసారి మరొకటి ఇలాగే చేస్తాడు. మరో సారి ఆరోగ్య శాఖా మంత్రిని కిడ్నాప్ చేసి గవర్నమెంట్ హాస్పటిల్స్ ని ఆధునీకరిస్తాడు. ఇలా ప్రభుత్వంలో పెద్ద స్దాయిలో ఉన్న వాళ్లను భయపెట్టి పేదలకు పనికొచ్చే పనులు చేస్తూంటాడు . ఇతన్ని పట్టుకోవాలని స్పెషల్ ఆఫీసర్ నర్మద (నయనతార) ప్రయత్నిస్తూంటుంది. ఆ తర్వాత మనకు తెలిసే విషయం మొదట జ్ఞాపక శక్తిలేకుండా ఉన్న షారూఖ్ కొడుకే ఈ రాబిన్ హుడ్ షారూఖ్ అని. వీళ్లిద్దరూ తండ్రి కొడుకులని అర్దమవుతుంది. అయితే మొదటి షారూఖ్ ని కొట్టి మెమరీ లేకుండా చేసిందెవరు...ఇలా అందరినీ బెదిరిస్తూ రెండో షారూఖ్ చేస్తున్న పనులు వెనుక అసలు లక్ష్యం ఏమిటి...అలాగే ఈ కథలో ఆయుధాల డీలర్ కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) పాత్ర ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
అట్లీ సినిమాల్లో పాత కథలే ఉంటాయని మనకు తెలుసు. ఆ కథలను అతను యాక్షన్ జోడించి వడ్డిస్తూంటాడు. అందుకు స్టార్ బలం కూడా తోడు అవటంతో వర్కవుట్ అవుతూంటాయి. అలాగే ఈ సారి భాగ్యరాజా ఖైదీ వేట తీసుకుని అందులో తండ్రి,కొడుకుల డ్రామాని మార్చి, శంకర్ సినిమాల్లో ఉండే సోషల్ మెసేజ్ ని జోడించాడు. అయితే ఈ క్రమంలో ఓ ఫ్లో అంటూ లేకుండా పోయింది. మొదట పావు గంటలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ చూసి అద్బుతంగా ఉంది టేకాఫ్ అనుకుంటాం. ఆ తర్వాత మెల్లి మెల్లిగా బాగా మన సౌత్ వాళ్లకు తెలిసిన కథను తన ఫైల్ లోంచి తీస్తాడు అట్లీ. దాంతో తెరపై యాక్షన్ సీన్స్ వస్తున్నా ఆ కాసేపు ఎంజాయ్ చేస్తాము కానీ కథలోంచి వచ్చే కిక్ మాత్రం ఉండదు. చాలా ప్రెడిక్టబుల్ గా నడుస్తూంటుంది. అలాగే తండ్రి పాత్రను కథలోకి తీసుకు రాకుండా కేవలం యాక్షన్ కే పరిమితం చేసాడు. సినిమా మొదటే తండ్రి పాత్రనూ చూపిస్తే అతనే ఏదన్నా చేస్తాడేమో అనుకుంటాము. కానీ ఆ పాత్రను మళ్లీ ఇంటర్వెల్ దాకా తీసుకురాలేదు. ఇక కొన్ని కీ ఏరియాల్లో యాక్షన్ అవుటాఫ్ కంట్రోల్ అయ్యి,స్టోరీ ఫోకస్ ని ప్రక్కకు నెట్టింది కథ మరీ పాత కాలం నాటిది కాకుండా ఉండి ఉంటే big-screen experience ఇంకా బాగా ఎంజాయ్ చేద్దుము కదా అనిపిస్తుంది.
అయితే కొన్ని డౌట్స్ మనను సినిమాలో లీనం కానివ్వవు. హీరోయిన్ నయనతార పోలీస్, తన మీదే ఇంటరాగేట్ చేస్తుంటుంది. అయినా సరే పనిగట్టుకు ఆమెను పెళ్లి చేసుకోవటం ఏమిటో అర్దం కాదు. అలాగే నయనతార ..అసలు హీరో ఎవరో అతను బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలని జైల్లోకి ఓ ఖైధీగా వెళ్తుంది. అక్కడ ఉండే ప్రియమణి బ్యాచ్..ఎప్పుడు ఈమె వస్తుందా ఆ ప్లాష్ బ్యాక్ చెప్పేసి చచ్చిపోదామా అన్నట్లు ఎదురుచూస్తూంటారు. ఆమె అడక్క ముందే ప్లాష్ బ్యాక్ ఇదీ అని చెప్పేస్తూంటారు. ఇలాంటివి చాలా కనపడుతాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజిలో ఉండటంలో ఆ మాయ జరిగి అలా నడిచిపోతుంది. ఏదైమైనా ఇంత భారీ సినిమాకు కాస్త కథ,స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా చూసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అయినా ఇన్ని ఫైట్స్ ఉండటంతో ఏదీ సంపూర్తిగా ఎంజాయ్ చేసే అవకాసం లేకుండా ఇంకోటి వచ్చి పడుతుంది. పళ్లెంలో వంద రకాల ఐటెంలు చూడటానికి బాగుంటాయి కానీ తినటానికి ఏముంటుంది. ఇన్ని రకాలు ఐటెమ్స్ పెట్టారని చెప్పుకోవటానికి తప్ప.ఇదీ అంతే.
నచ్చినవి
ఫైట్స్..ఫైట్స్..ఫైట్స్
హీరో ఇంట్రోసీన్స్
జైల్లో వచ్చే దీపికా పదుకోని ఎమోషనల్ ప్లాష్ బ్యాక్
ఇంట్రెవెల్ బ్లాక్ దగ్గర ఫైట్
తండ్రి గా షారూఖ్ స్టైల్స్
నచ్చనవి
బాగా పాతకాలం నాటి కథ
ప్రెడిక్టుబుల్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే
రిలీఫ్ లేకుండా యాక్షన్ సీన్స్ తో నింపేయటం
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ లు
షారూఖ్ ఖాన్ వయస్సు వెనక్కి వెళ్తోందా అని ఆ ఎనర్జీ, ఫైట్స్ లో వేగం చూస్తూంటే అనిపిస్తుంది. పాత్రకు తగ్గట్లు పూర్తి ఫిట్ గా,యాక్షన్ సీన్స్ కు తగినట్లు ఉన్నాడు. తండ్రి,కొడుకుల్లో తండ్రి పాత్ర స్టైల్...బాగుంది. ఇక విజయ్ సేతుపతి ఎప్పటిలాగే గమ్మత్తైన బాడీ లాంగ్వేజ్ తో ,డైలాగ్ డెలవరితో ఆకట్టుకున్నాడు. షారుఖ్ కి ధీటుగా నిలబడ్డాడు. నయనతార పాత్ర సోసో గా ఉంది. ప్రియమణి,దీపికా పదుకోనితో మిగతా పాత్రలు పరిధిమేర నటించుకుంటూ పోయారు. షారుఖ్ ఖాన్ కు ధీటుగా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో దుమ్ములేపింది. దీపికా పదుకొణె క్యామియో అపియరెన్స్ ఆకట్టుకుంటుంది.
టెక్నికల్ గా...
చాలా హైస్టాండర్డ్స్ లో బాగా ఖర్చు పెట్టి సినిమా తీసారు. టెక్నికల్ గానూ అన్ని విభాగాలు పోటీ పడ్డాయి. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తెరపై కనిపించాయి. యాక్షన్ సీన్స్ ని నెక్స్ట్ లెవల్ లో డిజైన్ చేసారంటే అతిశయోక్తి కాదు. యాక్షన్ ని పూర్తిస్దాయిలో ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా ఎక్కుతుంది. సినిమాలో పాటలు ఏదీ ఆకట్టుకోలేదు. తెలుగులోకి ఆ పాటలు డబ్ చేయకుండా హిందీలో ఉంచినా బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరకొట్టారు. విలన్ విజయ్ సేతపతి పాత్రకి ఇచ్చిన బీజీఎం ఎఫెక్టివ్ గా వుంది. కెమరా వర్క్ చాలా బ్రిలియంట్ గా వుంది. రిచ్ విజువల్స్. దర్శకుడు అట్లీ జమానా కాలం నాటి కథ కానీ .. టేకింగ్ ,మేకింగ్ తో కట్టిపడేసే ప్రయత్నం చేసాడు. బాగా ప్రెడిక్టుబుల్ కథని తీసుకొని ఊహకందని విజువల్స్, యాక్షన్ సీన్స్ తో నడిపించాడు. .
Final Thoughts
సాధారణంగా కథలో యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే..యాక్షన్ బ్లాక్స్ మధ్య అక్కడక్కడా ఇరుక్కుని కథ తొంగిచూస్తుంటుంది.
RATING: 2.75/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
నటీనటులు : షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, దీపికా పదుకోనే, యోగి బాబు తదితరులు
స్క్రీన్ ప్లే : అట్లీ, ఎస్.రమణగిరి వాసన్
ఛాయాగ్రహణం : జీకే విష్ణు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు : గౌరి ఖాన్, గౌరవ్ వర్మ
దర్శకత్వం : అట్లీ
విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2023