టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ‘7:11 పి.ఎమ్’ రివ్యూ
1999లో ఒక ముఖ్యమైన రోజున, భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం “హంసలదీవి” అనే చిన్న ఇండియన్ టౌన్ కి చేరుకుంటారు.
7:11 PM Telugu movie review
సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఆదిత్యా 369, ఆ తర్వాత రజనీకాంత్ రోబో, మహేష్ బాబు నాని, సూర్య 24. ప్రభాస్ ప్రాజెక్టు కే కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ లోనే రూపొందుతోంది. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమే. వీటిలో ఉండే కొత్తదనం ఎప్పుడూ ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడో కండీషన్ ఉంది. సామాన్య ప్రేక్షకుడుకుకు ఈ సినిమా కథ సంపూర్తిగా అర్దమైతేనే వాటిని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ క్రమంలో తెలుగులో వచ్చిన మరో సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘7:11 పి.ఎమ్’. ఈ సినిమా ఎలా ఉంది...వర్కవుట్ అయ్యే కాన్సెప్ట్ యేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
7:11 PM
స్టోరీ లైన్
కథ 1999 లో జరుగుతూంటుంది. విజయవాడ దగ్గర హంసల దీవి అనే ఊళ్లో ఒక కుర్రాడు రవి కృష్ణ (సాహస్) . ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతూంటాడు. అక్కడ లోకల్ రాజకీయాలు జరుగుతూంటాయి. లోకల్ ఎమ్మల్యే ఆ ఊరు వాళ్లను దోచేసి, ముంచేసే పనిలో ఉంటాడు. దాన్ని అడ్డుకునేందుకు ఆ కుర్రాడు తన లాంటి మరికొంతమందితో కలసి ప్రయత్నిస్తూంటాడు. అదే సమయంలో ...అదే ఊరికి చెందిన అమ్మాయి విమల (దీపిక)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఇష్టం ఉండదు. ఒప్పించాల్సి ఉంటుంది. ఇదిలా జరుగుతూండగా.. ఓ బస్సు వస్తుంది. అది ఓ టైమ్ మిషన్. అది ఫలానా అని తెలియక కొన్ని తప్పని సరి పరిస్దితుల్లో అనుకోకుండా ఆ బస్ ఎక్కేస్తాడు రవి. మరుసటి రోజు తెల్లేసేసరికి మెల్‌బోర్న్ బీచ్‌లో తేలాడు. బస్ ఎక్కిన ఆ వ్యక్తి ఒక్క రోజులోనే అంత దూరం ఎలా ప్రయాణించాడు? ఆ టైమ్ మిషన్ ఆ ఊరు ఎందుకు వచ్చింది. తిరిగి తన ఊరుకి రాగలగాడా...తన ఊరు చుట్టూ జరుగుతున్న కుట్రను ఛేధించగలిగాడా...చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
7:11 PM
విశ్లేషణ
తెలుగు సినిమా అనేక కారణాల వల్ల ఒక చట్రంలో బిగుసుకుపోయినట్లుగా దాదాపు ఒకే రకమైన కథలను ప్రెజెంట్ చేస్తూ వస్తోంది. విభిన్నమైన సినిమా కథలుగా గుర్తించేందుకు తెలుగు సినిమా పెద్ద హీరోలు విముఖత చూపించటంతో తెలుగు సినిమా అక్కడెక్కడే గింగరాలు కొడుతోంది. తెలుగు సినిమా మారాలని అందరికీ ఉంటుంది. కానీ మార్పు ని మొదలెట్టేవాళ్లేలేరు. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలు అయితే యేడాదికి ఒకటి కూడా రావటం గగమనే. పోనీ జనం విభిన్నమైన సినిమాలు చూడటం లేదా అంటే ఎగబడి మరీ ఓటిటి సినిమాలు చూస్తున్నారు.అలాంటప్పుడు కొత్త కథలు రెడీ చేయచ్చు కదా ..కొత్త జనరేషన్ అయినా అని కొందరు నడుం బిగించి ముందుకు వెళ్తున్నారు. అలా వచ్చిందే ఈ చిత్రం. ఇలాంటి టైమ్ ట్రావెల్, స్పేస్ షిప్ తరహా జానర్ ఫిల్మ్ లు కేవలం హాలీవుడ్ లోనే వస్తూంటాయి. దాంతో మనం ఖచ్చితంగా వాటితో పోల్చి చూసి పెదవి విరిచేస్తాం. అయితే ఇక్కడ మన తెలుగు ఆర్టిస్ట్ లతో ...మన నేటివిటిని కలుపుతూ...సైన్స్ ఫిక్షన్ అందించాలనే ఆలోచనఈ దర్శకుడు కు రావటం దాన్ని ముందుకు తీసుకెళ్ళటం మాత్రం అభినందనీయమే. అదే క్రమంలో వేల కోట్లతో హై స్టాండర్డ్స్ తో తీసే హాలీవుడ్ సినిమాలతో ఇక్కడ తక్కువ బడ్జెట్ లో తీసే ఇలాంటి సినిమాలను పోల్చకూడదు. కాబట్టి ఈ సినిమా .....ఈ సినిమాగానే బాగుంది. పోలిక తెస్తే మాత్రం తేలిపోతుంది. టైమ్ ట్రావెల్ ...రెండు గ్రహాలు, మూడు కాలాలు చుట్టు తిరిగే కథ ఇది. దాన్ని తడబాటు లేకుండా , ఇంట్రస్టింగ్ గా (అఫ్ కోర్స్ ఫస్టాఫ్ కాస్త లాగినట్లు ఉంది) ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. పాటలు లేకుండా ఉండి ఉంటే బాగుండేది. అచ్చమైన తెలుగు కథ చేయాలనే తాపత్రయంలో ఇలాంటి సాహసానికి ఒడిగట్టున్నారు.
7:11 PM
టెక్నికల్ గా
ఇలాంటి సినిమాలకు టెక్నికల్ బ్రిలియన్సీ అవసరం. అదే సమయంలో ఈ సినిమా హై బడ్జెట్ తో రూపొందలేదు. ఉన్నంతలోనే విజువల్ ఎఫెక్ట్స్ ని అధ్బుతంగా చూపెట్టాలి. ఆ విషయంలో టీమ్ చాలా వరకూ సక్సెస్ అయ్యింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ లో ఉన్న నావల్టీని చాలా భాగం సినిమాలో సీన్స్ రిప్రెజెంట్ చేసాయి.అయితే అసలుకథలోకి రావటానికి ఎక్కువ సమయం తీసుకోవటం..ఫస్టాఫ్ మొత్తం ఒకే ఊరిలో జరగటం ..కొద్దిగా నిరాశపరుస్తాయి. సైన్స్ ఫిక్షన్ , ట్రైమ్ ట్రావెల్ కోసం ఎదురుచూస్తూంటే అవి సెకండాఫ్ లోకి కానీ రావు. అప్పటిదాకా వెయిట్ చెయ్యాల్సిందే. అది సరిచేసుకుని ఉంటే బాగుండేది. సెకండాఫ్ లో వచ్చే ఆస్ట్రేలియా సీన్స్, అక్కడ ట్విస్ట్ బాగా పేలాయి. కాలంలో వెనక్కి వచ్చి హీరో చేసే ఎడ్వెంచర్స్ ని కూడా బాగానే తీసారు. డైరక్టర్ కు మంచి విజన్ ఉంది కానీ బడ్జెట్ సపోర్ట్ చేసినట్లు లేదు. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ ని కలపటం బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ లాగ్ అనిపించినా సెకండాఫ్ స్పీడుగా పరుగెత్తింది. కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా మెలబోర్న్ లో తీసిన షాట్స్ బాగున్నాయి. రీరికార్డింగ్ ఓకే. పాటలు తీసేస్తే బాగుండేది. అవి కథనానికి అడ్డు రావటం తప్పించి కలిసొచ్చిందేమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఆర్ట్ డిపార్టమెంట్, విఎఫ్ ఎక్స్ వర్స్ బాగుంది.
7:11 PM
నటీనటుల్లో ...
లీడ్ రోల్స్ చేసిన సాహస్, దీపిక ..ఇద్దరూ చాలా బాగా చేసారు. కొత్త అయినా ఆ తడబాటు లేదు. సాహస్ సెకండాఫ్ లో ఎమోషన్స్ ని బాగా పండించారు. విలన్ గా చేసిన వ్యక్తి ఎవరో కానీ చాలా బాగా చేసారు. అతనికి సరైన క్యారక్టర్స్ పడితే నెక్ట్స్ లెవిల్ కు వెళ్తారు. రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు వంటి సీజనల్ ఆర్టిస్ట్ లు అలవోకగా చేసుకుంటూపోయారు.
7:11 PM
ఫైనల్ థాట్
ట్రైలర్, టీజర్ చూసి మరీ ఫాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్ అనుకుంటాను... చక్కగా సీట్ ఎడ్జ్ లో కూర్చోవచ్చు అని మరీ ఎక్కువ ఆశపడకుండా ఓ కొత్త కాన్సెప్టుతో సినిమా చేసారు...చూద్దాం అని ఫిక్సై వెళ్లే నచ్చుతుంది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
7:11 PM
తెర వెనుక..ముందు
తారాగణం – సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు & ఇతరులు
సంగీతం – గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె / జై లోగిశెట్టి
డీవోపీ – శివ శంకర్ / ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్ – శ్రీను తోట
దర్శకత్వం – చైతు మాదాల
నిర్మాత – నరేన్ యనమదల, మాధురి రావిపాటి & వాణి కన్నెగంటి