Rudrangi Review: `రుద్రంగి` మూవీ రివ్యూ, రేటింగ్
తెలంగాణ దొరల నేపథ్యంలో జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గనవి లక్ష్మణ్, ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రలో అజయ్ సామ్రాట్ రూపొందించిన చిత్రం `రుద్రంగి`,. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
తెలంగాణ దొరల నేపథ్యంలో `ఒసేయ్ రాములమ్మ`, `సమ్మక్క సారక్క` వంటి సినిమాలు వచ్చాయి, బంపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలకు ధీటుగా ఆడాయి. ఆ తర్వాత ఈ నేపథ్యంలో సినిమాలు తగ్గిపోయాయి. అయితే ఇటీవల తెలంగాణ నేపథ్య చిత్రాల జోరు ఊపందుకుంది. వాటికి మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వరుసగా సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఊహించని కలెక్షన్లని సాధిస్తూ ట్రేడ్ మేకర్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలంగాణ నేపథ్యంలోనే వచ్చిన మరో సినిమా `రుద్రంగి`. అయితే ఇది దొరల నేపథ్యంలో రూపొందిన సినిమా కావడం విశేషం. నూతన దర్శకుడు అజయ్ సామ్రాట్ రూపొందించిన ఈ చిత్రాన్ని రసమయి బాలకిషన్ నిర్మించారు. జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, గనవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేడు(జులై 7న) విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
రుద్రంగి అనే సంస్థానంలో.. మల్లేష్(ఆశిష్ గాంధీ) రుద్రంగి(గనవి లక్ష్మణ్) బావా మరదళ్లు. చిన్నప్పుడే వీరి తల్లితండ్రులు చనిపోవడంతో తాత వద్ద పెరుగుతారు. తాను ఎక్కువ రోజులు బతకనని భావించిన ఆ తాత వారికి చిన్నప్పుడే తాళిబొట్టు కట్టిపించి పెళ్లి చేస్తాడు. ఒకరినొకరు వదలకూడదని మాట తీసుకుంటాడు. ఓ రోజు దొర(ప్రభాకర్) పొలం దున్నడానికి ఆ వృద్ధుడిని రమ్మంటాడు. కానీ వెళ్లకపోవడంతో పాలేరుగాళ్లతోని ఈడ్చుకొచ్చి కొట్టి చంపేస్తాడు. అప్పుడే దొరని రాయితో కొట్టి పారిపోయిన మల్లేష్.. మరో పెద్ద దొర భీమ్‌రావ్ దేశ్‌ముఖ్(జగపతిబాబు)ని కాపాడి, ఆయన వద్ద పాలేరుగా పెరుగుతాడు. మల్లేష్ బలవంతుడు కావడంతో అతన్ని తనకు సహాయకుడిగా పెంచుకుంటాడు. పెద్దాయక తన తాతని చంపిన దొరని, తనని పెంచిన భీమ్‌రావు దొరతో కలసి చంపేస్తారు. అప్పటికే భీమ్ రావ్ దొరకి మీరాభాయ్ అనే భార్య ఉంటుంది. ఆమె కడుపుతో ఉంటుంది. అదే సమయంలో మరో దొరసాని జ్వాలాబాయ్ దేశ్‌ముఖ్‌ని రెండో భార్యగా ఇంటికి తెచ్చుకుంటాడు. ఆమె దొర ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి కావడంతో ఆ రాజసం, ధైర్యం, మొరటుతనం ఆమెలో నిండుగా ఉంటాయి. అచ్చం మగాడిలా ప్రవర్తిస్తుంది. దీంతో దొరలో ఆడతనం కనిపించదు. ఆమెని ముట్టుకోవడానికి ఇష్టపడడు. కానీ జ్వాలా బాయ్‌కి మాత్రం మరో వ్యక్తి నచ్చుతాడు. అతన్ని కావాలని కోరుకుంటుంది.
ఓ రోజు దొర అడవికి వేటకు వెళ్లగా అక్కడ ఓ అందమైన అమ్మాయి రుద్రంగి(గనవి లక్ష్మణ్)ని చూస్తాడు. ఆమె వ్యామోహంలో పడిపోతాడు. ఆమెని గడికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పారిపోతుంది. దీంతో ఆ రోజు నుంచి దొర నారాజు అవుతుంటాడు. తిండితినడు, నిద్రపోడు, ఆమెనే తలుచుకుంటాడు. చివరికి ఆ అమ్మాయిని వెతికి తీసుకురమ్మని మల్లేష్‌కి చెప్పగా, ఆయన తీసుకుని వస్తాడు. ఆమె తన భార్య అని, చిన్నప్పుడే పెళ్లి అయ్యిందని చెబుతాడు. దీంతో వారిని వదిలేసి, మల్లేష్‌కి కొన్ని ఎకరాల పొలం ఇచ్చి బతకమని చెబుతాడు. అందులోనే ట్విస్ట్ పెడతాడు. రుద్రంగిని తన వద్ద పడుకోబెట్టాలని కండీషన్ పెడతాడు. దీంతో మల్లేష్‌కి ఎదురుతిరిగి జ్వాలాబాయ్ సహకారంతో రుద్రంగిని తీసుకొని పారిపోతాడు. రుద్రంగి పై వ్యామోహం తీరిన దొర అల్లాడిపోతుంటాడు. మల్లేష్, రుద్రంగిలా ఆచూకి చెప్పాలని ఊరు జనాలను కొడుతుంటాడు. చివరికి ఊరికి నీళ్లు కూడా బంద్ పెడతాడు. దీంతో ఆ ఊరు పరిస్థితి ఏంటి? మల్లేష్, రుద్రంగిలు ఎక్కడికి వెళ్లారు, దొరకి దొరికారా? లేదా? ఊరు కోసం రుద్రంగి చేసిన త్యాగం ఏంటి? దొర కోరిక నెరవేరిందా లేదా? జ్వాలాబాయ్ మోజు పడ్డ వ్యక్తి ఎవరు? చివరికి ఈ కథ ఏతీరం చేరిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
తెలంగాణకి స్వాతంత్ర్యం రాని రోజుల సమయంలో సాగే కథ ఇది. 1947లో ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది కానీ తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదు. నైజాం అరాచకాలకు, దొరల బానిసత్వానికి తెలంగాణ పల్లెలు అణచివేయబడుతూనే ఉన్నాయి. బానిస సంకెళ్ల నడుమ తెలంగాణ ఊర్లు జీవనం సాగించాల్సిన పరిస్థితి. `రుద్రంగి` సినిమాలోనూ అదే కథని చూపించారు. రుద్రంగి అనే సంస్థానంలో ఉండే దొర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే దొరలు అంటే అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలా గడీకి పిలిపించుకుని వారిని బలవంతంగా అనుభవించేవారు. కొత్తగా పెళ్లైనా వదిలేవాళ్లు కాదు. ఎదురుతిరిగితే వాళ్ల భర్తలను చంపేవారు. అలా దొరల అరాచకాలకు అడ్డే ఉండేది కాదు. ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ నే టచ్ చేశారు దర్శకుడు అజయ్ సామ్రాట్. అయితే కథగా ఇది కొత్తదేం కాదు, `ఒసేయ్ రాములమ్మ`, `సమ్మక్క సారక్క` వంటి సినిమాల్లో దొరలపై నక్సలైట్ల తిరుగుబాటుని చూపించారు. ఇందులో స్థానిక ప్రజల్లో తిరుగుబాటుని చూపించారు. దీనికితోడు కథని నడిపించే విధానంలో కొత్తదనం పాటించాడు దర్శకుడు.
ఇప్పటి వరకు సినిమాల్లో ప్రజలపై అరాచకాలు చూపించేరు, దొరకి, ప్రజలకు మధ్య గొడవలు, అణచివేతను చూపించారు. ఇందులో గడీల లోపల ఏం జరుగుతుందనే విషయాలను ఆవిష్కరించారు. ఇందులో ఉన్న కొత్త ఎలిమెంట్ అదే. దీనికితోడు ఇది హీరో పాయింట్‌ఆఫ్ వ్యూలో సాగదు, పూర్తి దొర పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. దొరని మెయిన్ హైలైట్‌గా చేసి చూపించారు. దీంతో అక్కడి ప్రజలు, వారి అణచివేత అనే అంశాలకు ఇందులో తావులేదు. దొరకి అమ్మాయిపై మనసు పడింది, ఆమె తనకు కావాలి. అందుకోసం ఏమైనా చేస్తాడు. ఆ అమ్మాయి కోసమే ఊరుని నాశనం చేయాలనుకుంటాడు. వారికి నీళ్లు బంద్ చేసి చచ్చేలా చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో అయినా ఆ అమ్మాయిని తన పక్కకు పంపిస్తారనేది దొర ఆలోచన. తనని ఎదురించిన వాడు తన కాళ్ల వద్దకు రావాలని, తన ఆహాం సంతృప్తి చెందాలనేది దొర ఆలోచన. దాని చుట్టూతే సినిమా తిరుగుతుంది. వాటికి సంబంధించిన అంశాలు రక్తికట్టేలా ఉంటాయి. కొత్తగా ఆకట్టుకుంటాయి. మరోవైపు దొరసానుల మానసిక సంఘర్షణని, వారి ఫీలింగ్స్ ని, గడీల లోపల జరిగే విషయాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
సినిమాగా చూసినప్పుడు మొదట్నుంచి కథలో ఉన్న ఎమోషన్స్ ని క్యారీ చేసుకుంటూ వెళ్లాలి. కానీ ఇందులో ఆ ఎమోషన్ ప్రారంభంలో మిస్ అయ్యింది. దీంతో సీన్లు సీన్లుగానే సినిమా సాగుతున్నట్టు అనిపిస్తుంది.ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ వచ్చిపోతుంటాయి. చాలా వేగంగానూ కథ సాగుతుంది. ప్రతి సీన్‌లోనూ ఏదో ఒక హైలైట్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటూ కథని నడిపించారు. ఆయాసీన్ల తాలుకూ ఎమోషన్స్ మాత్రం క్యారీ కాలేదు. దీంతో కట్, పేస్ట్ లా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్‌లో మాత్రం రుద్రంగి.. తనకు బావ మల్లేష్ ఎంత ఇష్టమో చెప్పే సన్నివేశాలు, ఈ సందర్బంగా వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. అవి హై మూవ్‌మెంట్‌గా ఉంటాయి. ఇక సెకండాఫ్ మొత్తం అమ్మాయి కోసం దొర దిగులు పడటం, ఆమెని వెతకడంపైనే దృష్టిపెట్టారు. ఆమె కోసం ఊరి జనాలను చిత్ర హింసలకు గురి చేయడం చుట్టూతే సాగుతుంది. సీనియర్‌గా సాగే కథకి ఆర్ ఎస్ నందా.. కరుణంగా చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సినిమాకి ఆయన పాత్ర పెద్ద రిలీఫ్ గా ఉంటుంది. ఆయన వేసే పంచ్‌లు, సామెతలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మరోవైపు సినిమాలు చాలా బూతు పదాలున్నాయి. కానీ కథకి యాప్ట్, అవి కాట్ చేయడంతో ఆ ఫీల్ మిస్ అయ్యింది.
మరోవైపు క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి మరో పెద్ద బలం. ఈ సందర్భంగా వచ్చే బీజీఎం.. సాంగ్ సినిమాని మరింతగా ఎలివేట్ చేస్తుంది. కానీ ఆ ఎలివేషన్‌కి, ఆ బాధ, ఎమోషన్స్ కనిపించవు. ఆ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. సినిమా మొత్తం జగపతి బాబు పాత్ర చుట్టూతే తిప్పారు. సినిమాకి ఆయనే హీరో. కానీ సినిమాలో హీరో పాత్రని మాత్రం డమ్మీ చేశాడు. ఆయా పాత్ర మరింత బలంగా, మరింత తిరుగుబాటు తనంతో ఉంటే బాగుండేది. క్లైమాక్స్ వరకు గట్టిగా లాక్కొచ్చి చివరి నిమిషంలో కాడేత్తేసినట్టుగా ఉంది. అక్కడ మరింత బాగా రాసుకోవాల్సింది. ఏం చేయాలనే కన్‌ఫ్యూజన్ కలుగుతుంది. అదే సినిమాలో ప్రతిబింబం అయ్యింది. ఇందులో `జాజిముక్కులాలి` అనే పాటని ఉపయోగించారు. కానీ అది మిస్ మ్యాచ్ గా అనిపిస్తుంది.దర్శకుడు అజయ్ సామ్రాట్.. రాజమౌళి వద్ద పనిచేశారు. దీంతో ఆయన ప్రభావం ఈసినిమాలో కనిపిస్తుంది. రాజమౌళి తరహాలోనే సీన్లు డిజైన్ చేసుకున్నారు. కానీ ఎమోషన్స్ మిస్ అయ్యారు. ట్టూతే కాకుండా, ఇంకా బలమైన సంఘర్షణ చూపించి ఉంటే బాగుండేది. అలాగే ఎమోషన్స్ ని క్యారీ అయ్యేలా సీన్లు డిజైన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అలాగే చాలా లాజిక్స్ మిస్ చేశాడు.అది కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సినిమాకి బీజీఎం బ్యాక్ బోన్. అదే సినిమాని నిలబెడుతుంది. ఓవరాల్‌గా ఇది ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు.
నటీనటులుః
భీమ్ రావు పాత్రలో జగపతిబాబు తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. ఆయన అద్భుతంగా నటించారు. ఓ రకంగా తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేశారు. సీరియస్‌గా, కామెడీగా అద్భుతంగా చేశారు. దొరగా పర్‌ఫెక్ట్ సెట్ అయ్యారు. పాత్రకి ప్రాణం పోశారు. సినిమాకి నిజమైన హీరో అనిపించుకున్నారు. మల్లేష్ పాత్రలో ఆశిష్ గాంధీ బాగా చేశాడు, మెప్పించారు. కానీ ఆయన పాత్రని ఇంకా బలంగా రాసుకోవాల్సింది. మరోవైపు జ్వాలాబాయ్‌గా మమతా మోహన్‌దాస్ నటన వాహ్ అనిపిస్తుంది. మమతా మోహన్‌దాస్ ఉన్న సీన్లలో ఆమె డామినేషనే కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె ఉన్నంత సేపు సీన్లు రక్తికడుతాయి. మరోవైపు దొర పెద్ద భార్య మీరాబాయ్ పాత్రలో విమలా రామన్ నటన ఆకట్టుకుంటుంది. ఆమె చాలా సెటిల్డ్ గా చేసింది. మరోవైపు రుద్రంగి పాత్రలో గనవి లక్ష్మణ్ సినిమాకి మరోపెద్ద అసెట్ అనే చెప్పాలి. ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా చాలా ఇంపాక్ట్ ని చూపించింది. సినిమాకి మరో పెద్ద అసెట్ ఆర్ ఎస్ నందా. కరుణం పాత్రలో కామెడీలు చేస్తూ నవ్వులు పూయించాడు. శెభాష్ అనిపించుకున్నాడు. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఫర్వాలేదు.
టెక్నీషియన్లుః
నవ్‌పాల్ రాజా సంగీతం సినిమాకి బ్యాక్ బోన్. అదే కథని నడిపిస్తుంది. కొత్తగా సాగేలా చేస్తుంది. పాటలు కూడా గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. సంతోష్ షానమోని సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. ప్రతి విజువల్ కలర్ఫుల్‌గా ఉంది. రిచ్‌గా ఉంది. సినిమాకి గ్రాండియర్ లుక్ తీసుకొచ్చింది. మరోవైపు ఎడిటర్ నాగేశ్వర రెడ్డి బొంతల పనితనం సినిమాకి హెల్ప్ అవుతుంది. అనవసరమైన సోదీ సీన్లు లేకుండా కట్ చేసేశారు. సినిమా నిడివి తగ్గించడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఏది అవసరమో అదే ఉంచారు. షార్ట్ అండ్ స్వీట్‌గా ఎడిటింగ్ చేశారు. ఎడిటర్‌గా ఆయన పేరు బాగా వినబడుతుంది. నిర్మాత రసమయి బాలకిషన్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. లొకేషన్లు, సీన్లు రిచ్‌గా ఉన్నాయనంటే నిర్మాత సహకారం వల్లే అని చెప్పొచ్చు. ఇక దర్శకుడు అజయ్ సామ్రాట్.. దర్శకుడిగా అతనిలో ఉన్న ఫైర్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. కానీ కథని ఇంకాస్త బాగా డీల్ చేసే ఉంటే బాగుండేది, ఎమోషన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది. ఆయన రాజమౌళి స్టయిల్‌ని ఫాలో అయినట్టు తెలుస్తుంది. హైలైట్ సీన్లు డిజైన్ చేసుకున్నారు. కానీ వాటికి సోల్ మిస్ అయ్యింది. అదే ఈ సినిమాకి మేజర్ లోటు. అది మాత్రం పక్కాగా వర్కౌట్ అయితే ఇది భారీ స్థాయి సినిమా అయ్యుండేది. కానీ ఉన్నంతలో చాలా కొత్తగా డిజైన్ చేశారు దర్శకుడు. డైలాగ్‌లు సైతం ఆకట్టుకుంటున్నాయి. కథపై, దాన్ని నడిపించే విధానంపై దర్శకుడు ఫోకస్ పెట్టాల్సింది.
ఫైనల్‌గాః తెలంగాణలోని దొరల నేపథ్యాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన సినిమా. `రుద్రంగి`కి కావాల్సింది బానిసత్వం కాదు, బడులు.
రేటింగ్‌ః 2.5
తారాగణం : జగపతిబాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, గణవి లక్ష్మణ్, ఆర్ఎస్ నందా తదితరులు
ఎడిటర్ : నాగేశ్వర రెడ్డి బొంతల
సంగీతం : నవ్ ఫాల్ రాజా
సినిమాటోగ్రాఫర్ : సంతోష్ షానమోని
నిర్మాత : డాక్టర్ రసమయి బాలకిషన్
దర్శకత్వం : అజయ్ సామ్రాట్