క్రైమ్ థ్రిల్లర్ : రవితేజ ‘రావణాసుర’ రివ్యూ
రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు.
Ravanasura review
రవితేజ సినిమా అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. తనదైన ఫన్, డైలాగు డెలవరీ, యాక్షన్ అంతా రెగ్యులర్ కు కాస్తంత భిన్నంగా ఉంటాయి. అయితే రవితేజ ఆ మూసలోంచి బయిటకు వద్దామని కొన్ని విభిన్న ప్రయత్నాలు చేసారు. అయితే కమర్షియల్ లెక్కలు తప్పిన ప్రతీసారి ఆయన సినిమా భాక్సాఫీస్ కు దూరం జరిగింది. దాంతో వింటేజ్ రవితేజను వదలకుండానే తన విభిన్నతను ప్రదర్శించాలనుకున్నారు. కమర్షియల్ యాంగిల్ లోనే కొత్త కథలు చెప్పాలనుకుంటున్నారు. అలా . 'రావణాసుర' అనే యాక్షన్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చారు. అయితే మరి ఈ సినిమా రవితేజ బాణీలోనే ఉందా...వాల్తేరు వీరయ్య, థమాకా లతో దూసుకుపోతున్న రవితేజకు మరో సక్సెస్ ని ఇచ్చిందా..అసలు కథేంటి అనేది చూద్దాం.
కథేంటి
క్రిమినల్ లాయిరే క్రిమిల్ అయితే అనే పాయింట్ చుట్టూ అల్లిన కథ ఇది. క్రిమినల్ లాయిర్ రవీంద్ర( రవితేజ)...కనకమహాలక్ష్మీ (ఫరియా అబ్దుల్లా) వద్ద జూనియర్ గా పనిచేస్తుంటాడు.ఇక సిటీలో వరసగా హై ప్రొఫైల్ మర్డర్స్ జరుగుతూంటాయి. కానీ హత్యలు చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుబడిన వాళ్లు తాము ఈ హత్యలు చేయలేదని, అసలు ఆ టైమ్ లో తాము కాన్షస్ లో లేమని చెప్తూంటారు. ఈ కేసులు రవీంద్ర దగ్గరకు వస్తూంటాయి. మరో ప్రక్క సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ హత్యల వెనుక రవి హస్తం ఉందని ఏసీపీ హన్మంతు (జయరామ్) కు డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. మరో ప్రక్క హోం మినిస్టర్ (రావు రమేష్) హత్యకు కూడా ప్లానింగ్ జరుగుతూంటుంది. అసలు ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు. రవీంద్రకు ఈ హత్యలకు సంభందం ఏమిటి... హోం మినిస్టర్ ని చంపేసారా...ట్రైలర్ లో చూపించినట్లు రవితేజ నెగిటివ్ క్యారక్టరా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఆ మధ్యన రవితేజ చేసిన ఖిలాడి, అంతకు ముందు శ్రీను వైట్లతో చేసిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు... ఈ సినిమా చూస్తూంటే గుర్తు వస్తాయి. వాటితో కథా విషయంలో సంభందం లేకపోయినా రవితేజకు ఓ క్రైమ్ థ్రిల్లర్ చేసి హిట్ కొట్టాలన్న ఆశ ఈ సినిమాల్లో కనిపిస్తుంది. అయితే రవితేజ వంటి హీరో నుంచి ఏ సినిమాలు ఆశిస్తారో అవి ఈ సినిమాలో కనపడకపోవటం నిరాశపెట్టిస్తుంది. ఇప్పుడీ సినిమాలో కూడా రవితేజ అదే క్రైమ్ థ్రిల్లర్ దారిలో వెళ్లాలనే ప్రయత్నం చేసారు. అదేమీ పొరపాటు కాకపోయినా క్రైమ్ థ్రిల్లర్స్ ని ఓటిటిలతో అటు వంటి సినిమాలు ఎన్నో చూసేసిన ప్రేక్షకుడుని మెప్పించటం మాత్రం మామూలు విషయంకాదు. ఎంత కసరత్తు చేసి కథ వండినా తన ఎక్సపెక్టేషన్స్ కు మించిన థ్రిల్స్ లేకపోతే ..ఆ ..కంటెంట్ లేదు సినిమాలో అని బై చెప్పేస్తున్నాడు. ఇవన్నీ తెలియకా కాదు రవితేజ వంటి సీనియర్ కు. తన అభిరుచికి తగ్గ కథను వండి వడ్డించాలనుకున్నాడు.
'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్' - అంటూ ఈ సినిమాలో వచ్చే డైలాగులో మొత్తం కథ ఉంది. విన్సీడా అనే బెంగాలీ సినిమాను బేస్ చేసుకుని రావణాసుర చిత్రాన్ని చేసారు. అందులో మెయిన్ పాయింట్ ని తీసుకుని ,మిగతాది అంతా తెలుగు కమర్షియల్ ఫార్మెట్ లో కథ అల్లి అందించారు. అయితే ఈ ప్రాసెస్ లోనే కథ,కథనం రెండూ దెబ్బ తిన్నాయి. ఫస్టాఫ్ లోనే కీ పాయింట్ రివీల్ అవటంతో మిగతాది అంతా ప్రెడిక్టబుల్ గా సాగింది. అలాగే ఎక్కడా కాంప్లిక్ట్ స్టైయిట్ గా ఉండదు. ఏ సీన్ కా ఆ సీన్ కాంప్లిక్ట్ చూసుకున్నారు. ఓవరాల్ గా కథలో కాంప్లిక్ట్ అంటే హీరో సమస్యలో పడటం అనేది ఉండదు. అలాగే విలన్స్ యాక్టివేట్ అవటానికి ఫలానా వాళ్లు తమని చంపుతున్నారనే విషయం తెలియదు. అలా నెగిటివ్ క్యారక్టర్స్ ఉన్నా..అవి హత్యకు గురి అవ్వటం తప్పించి చేసేదేమీ ఉండదు. కేవలం ప్రేక్షకులు థ్రిల్ అవుతారు ఈ ట్విస్ట్ లకు అని స్క్రీన్ ప్లే రాసుకున్నారు కానీ రవితేజ వంటి స్టార్ కు తగ్గ కథ ఇది అనుకుని ట్రీట్మెంట్ చేయలేదు.
ఇక తాము సినిమాలో ఎత్తుకున్న కొత్త పాయింట్ ని సినిమా ప్రారంభం నుంచి చెప్తే ఇబ్బంది అవుతుందనుకున్నారో ఏమో కానీ ఫస్టాఫ్ ని రెగ్యులర్ టెంప్లేట్ లో రొటీన్ సెటప్ తో కూడిన స్క్రీన్ ప్లే తో చెప్పుకుంటూ పోయారు. ఫస్టాఫ్ లో ఫస్టాఫ్ ..కొద్ది పాటి కామెడీతో నడుస్తుంది. కథ అంతా సీరియల్ కిల్లింగ్స్ గురించి, ఎవరు చేస్తున్నారు అనే పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఇలాంటివి చాలా చూసి ఉండటంతో కొంతదూరం వెళ్లాక అవుట్ డేటెడ్ స్టఫ్ అనిపిస్తుంది. దాంతో ఏదో కొత్తగా ఉంటుందనుకున్న వాళ్లకు నిరుత్సాహం ఎదురౌతుంది. సుశాంత్ ఎంట్రీ ఇచ్చాక కథలో కదిలిక వస్తుంది. దాదాపు ప్రీ ఇంట్రవెల్ పాయింట్ అది. అప్పటిదాకా ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఇంట్రస్ట్ పుట్టదు. దాంతో ఫస్టాఫ్ యావరేజ్ అనిపించుకుంది. అయితే ఇంట్రవెల్ బ్లాక్ మాత్రం బావుంటుంది. అయితే అక్కడ వచ్చే Makeup Changeover మాత్రం కన్వీన్సింగ్ గా అనిపించదు.
ఈ ఇంట్రవెల్ చూసి సెకండాఫ్ ప్రారంభంలో రవిజే విలనిజం నెక్ట్స్ లెవిల్ లో ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాము. దాంతో మళ్లీ సినిమాపై ఆశలు ఓ రేంజిలో చిగురిస్తాయి. అయితే కాసేపటికి అది ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. కొన్ని క్రైమ్ సీన్స్ రిపీట్ అవుతూంటాయి. అలాగే సినిమాకు కీలకంగా నిలవాల్సిన ప్లాష్ బ్యాక్ సైతం ఊహించగలిగే స్దాయిలోనే ఉంది. దాంతో సినిమా మెల్లి మెల్లిగా డ్రాప్ అయ్యిపోతుంది. క్లైమాక్స్ ఫైట్ డీసెంట్ గా ఉన్నా..సినిమా ఎక్సపెక్టేషన్స్ కు తగ్గ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. అన్నిటికన్నా ఎక్కువ దెబ్బ తీసింది..సినిమాలో వచ్చే మేకప్ ఛేంజోవర్ సీన్స్ లో గాఢత లేకపోవటం. అవన్నీ సిల్లీగా ఉండటం. ఏదైతే సినిమాని నిలబెట్టాలో దాంట్లోనే దమ్ము లేకపోతే ఇంక చేసేదేముంది. సినిమాకు రైటింగ్ విభాగమే పెద్ద మైనస్ అని చెప్పాలి. రవితేజ నెగిటివ్ రోల్ లో పడ్డ కష్టం చాలా చోట్ల బూడిదలో పోసిన పన్నీరే అనిపిస్తుంది.
ప్లస్ లు
రవితేజ ఫెరఫార్మెన్స్
మేకింగ్ వాల్యూస్
సినిమాటోగ్రఫీ
ప్రీ ఇంట్రవెల్ సీన్స్
మైనస్ లు
బాగా ప్రెడిక్టబుల్ గా సాగే కథ
సీన్స్ రిపీట్ అవటం
థ్రిల్స్ ..థ్రిల్ గా ఫీలయ్యేలా ఉండకపోవటం
టెక్నికల్ గా..
దర్శకుడు గా సుధీర్ వర్మ సినిమాలు టెక్నికల్ గా బాగుంటాయి. కథ,కథనం పరంగా నీరసంగా ఉంటాయి. ఇక్కడా అదే జరిగింది. హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. హర్షవర్ధన్‌తో పాటు, భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందించారు.పాటలు యావరేజ్ గా ఉన్నాయి.నవీన్ నూలి ఎడిటింగ్ ..సెకండాఫ్ ని మరింత టైట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. డైలాగులు జస్ట్ ఓకే. స్క్రీన్ ప్లే మాత్రం అసలు వర్కవుట్ కాలేదు.
Ravanasura First Look
నటీనటుల్లో ..
రవితేజ ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. రవితేజ కామిక్ టైమింగ్ ని పెద్దగా వాడలేదు. ఉన్న కాసిని సీన్స్ పేలలేదు. అయితే రవితేజ డార్క్ షేడ్స్ క్యారక్టర్స్ కూడా బాగా చేయగలరని చెప్పుకోవటానికి చేసినట్లు ఉంది. ఈవిల్ స్మైల్ గమ్మత్తుగా ఉంది.సుశాంత్ ది ఫుల్ లెంగ్త్ క్యారక్టరే కానీ మామూలుగా చేసుకుంటూ పోయారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు కానీ ఎవరూ పెద్దగా గుర్తు ఉండరు. మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ మరియు అను ఏమాన్యూల్ తమ పరిధుల్లో బాగానే చేసారు. హైపర్ ఆది కామెడీ ట్రై చేసాడు. అక్కడక్కడా వర్కవుట్ అయ్యింది. సంపత్ రాజ్, మురళీ శర్మ, జయ రామ్ వంటి సీనియర్ రొటీన్ గా చేసుకుంటూ పోయారు.
ఫైనల్ థాట్
రీమేకో, ఫ్రీ మోకో ఏది చేసినా ఇక్కడకు అది మనం కొత్తగా ఫీలవుతామో లేదో చూసుకోవాలి. పాయింటాఫ్ ఇంట్రస్ట్ ఉందని తెచ్చుకుంటే పాయింట్ లోనే ఇంట్రస్ట్ లేదని తేల్చి పారేస్తారు. అయినా మాస్క్ లు..సత్యనారాయణ, ఎన్టీఆర్ కాలం నాటివి ...ఇప్పటికి అవి ఫ్రెష్ గా ఫీలై చూడమంటే కష్టం అనిపిస్తుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
Ravanasura review
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
రన్ టైమ్: 2hr 21mins
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2023