- Home
- Entertainment
- Movie Reviews
- Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్.. విజయ్ దేవరకొండ రష్మిక హిట్ కొట్టారా? డీలా పడ్డారా ?
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్.. విజయ్ దేవరకొండ రష్మిక హిట్ కొట్టారా? డీలా పడ్డారా ?
Ranabaali Movie Review: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన `రణబాలి` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

రణబాలి మూవీ రివ్యూ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన మూవీ `రణబాలి`. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న మూవీ కావడం విశేషం. అదే సమయంలో పెళ్లి తర్వాత కలిసి నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. దీంతో మూవీపై అంచనాలున్నాయి. పీరియాడికల్ హిస్టరీ యాక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(అక్టోబర్ 16)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా? వీరికి హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
రణబాలి మూవీ కథ
1870-80 ప్రాంతంలో ఓ వైపు కరువు వెంటాడుతుంటుంది. మరోవైపు బ్రిటీష్ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని పోతుంటారు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజులవి. కుటుంబాన్ని పోషించుకోవడానికి కొందరు బందిపోట్లుగా మారాల్సి వస్తుంది. అలాంటి సమయంలో భద్రమల్లన్న కొలువున్న సింగణమల ప్రాంతంలో రాజమ్మ(ఈశ్వరీరావు) కొడుక్కి జన్మనిస్తుంది. అతను ఒక కార్యం కోసం పుట్టాడని, స్వయంగా ఆ భద్రమల్లన్న అవతారమే వచ్చి చెబుతుంది. అతనికి రణబాలి(విజయ్ దేవరకొండ) పేరు పెడతారు. భద్రమల్లన్న జాతర సమయంలోనే ఊర్లో బందిపోట్లు పడతారు. వాళ్లని రణబాలి అంతం చేస్తాడు. వాళ్ల తలతో బలిచ్చి జాతర చేస్తారు. ఊరుని రక్షించేందుకు రణబాలి నాయకత్వంలోని ఊరు యువకులు ఒక సైన్యంలా ఉంటారు. మంచి చెడు వాళ్లు చూసుకుంటారు. రణబాలిది పాలెగాళ్ల ఫ్యామిలీ. పెద్ద కుటుంబం అని చెప్పొచ్చు. అయితే పక్క ఊర్లోకి బ్రిటీష్ వాళ్లు వచ్చి అక్కడి ధాన్యాన్ని కొల్లగొడతారు. ప్రజలను చిత్ర హింసలు పెడతారు. వారికి అండగా నిలుస్తాడు రణబాలి. చాలా ఊర్ల ప్రజలకు ఆకలి తీరుస్తాడు. ఈ క్రమంలో బ్రిటీష్ వారితో పోరాడతాడు. అతని పోరాటాన్ని, ఆవేశాన్ని చూసిన అమ్మ రాజమ్మ.. జయమ్మ(రష్మిక మందన్నా)తో పెళ్లి చేస్తాడు. రణబాలి మొరటు. అది జయమ్మకి నచ్చదు. ప్రారంభంలో గొడవలు పడినా, ఆ తర్వాత రణబాలిలోని ప్రేమని, కరుణ గుణాన్ని చూసి దగ్గరవుతుంది. అయితే బ్రిటీష్ కమిషనర్ సర్ హెక్టర్.. మద్రాస్ పోర్ట్ నుంచి లక్షల టన్నుల ధాన్యాన్ని బ్రిటన్ పంపాలని, బ్రిటన్ రాణి వద్ద మెప్పు పొందాలని చూస్తుంటాడు. అందుకు కరువుని క్రియేట్ చేస్తాడు. ఊర్లకి ఊర్ల ధాన్యాన్ని దోచుకుపోతాడు. బ్రిటీష్ వారు వసూలు చేసిన ధాన్యం తరలించేందుకు రైల్వే ట్రాక్ వేస్తారు. అందుకు ప్రజలకు కరువు క్రియేట్ చేసి కూలీలుగా మారుస్తారు. తర్వాత బానిసలను చేస్తారు. ఇది తెలిసి వారిపై రణబాలి దాడి చేసి బ్రిటీష్ వారిని చంపేస్తారు. ఈ విషయం తెలిసి బ్రిటీష్ కమిషనర్ రంగంలోకి దిగుతాడు. మరి రణబాలిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు, వారిని రణబాలి ఎలా ఎదుర్కొన్నారు? ప్రజల ఆకలి తీర్చేందుకు ఆయన చేసిన పోరాటం ఏంటి?, తన జీవితంలోని ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన సినిమా.
రణబాలి మూవీ విశ్లేషణ
1870-80 ప్రాంతంలో మద్రాస్, రాయలసీమ, కర్నూల్.. వంటి ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఓ వైపు, బ్రిటీష్ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని వెళ్లి క్రియేట్ చేసిన కృత్రిమ కరువు మరోవైపు. ఇలా కొన్ని లక్షల(సుమారు 80 లక్షల) మంది ప్రజలు తిండిలేకచనిపోతారు. మరోవైపు బ్రిటీష్ వారిచేత చంపబడతారు. అలాంటి పరిస్థితుల్లో సింగనమల ప్రాంతంలో బ్రిటీష్ వారిపై రణబాలి చేసిన పోరాటమే ఈ చిత్రం అని చెప్పొచ్చు. సినిమా రణబాలి చనిపోయాడనే ఒక లెటర్‌తో సినిమా ప్రారంభమవుతుంది. రాయలసీమ ప్రాంతంలోని బుర్రకథలు చెప్పేవారు ఊరూరా రణబాలి వీరత్వం గురించి, ఆయన ప్రజల ఆకలి తీర్చేందుకు బ్రిటీష్ వారిపై చేసిన పోరాటం గురించి ఊరుర చెబుతున్నారు. కట్ చేస్తే భద్రమల్లన్న కొండపై రాజమ్మ పిల్లాడిని కనడం, అతను పెద్దవాడై ఊరికి కాపాలాగా ఉండటంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో కథని, పాత్రలను ఎస్టాబ్లిష్ చేశారు. రణబాలిగా విజయ్ దేవరకొండ చేసే ఫస్ట్ యాక్షన్ బాగుంది. విజయ్ పాత్ర చేసే యాక్షన్ కొత్తగా ఉంటుంది. అది కొంత ఓవర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత విజయ్.. రణబాలి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. మనకు రణబాలిగానే కనిపిస్తాడు. జయమ్మతో పెళ్లి, ఆమెతో సంసారానికి సంబంధించిన సీన్లు ఫన్నీగా ఉంటాయి. ఆయా ఎపిసోడ్ సరదాగా సాగుతుంది. ఆ తర్వాత బ్రిటీష్ వారిపై, ప్రత్యర్థులపై చేసే యాక్షన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. దీనికితోడు తాను చంపిన వారి కుటుంబాలను కలిసినప్పుడు రణబాలిలో వచ్చిన స్పందన ఎమోషనల్‌గా ఉంటుంది. ఇలా డ్రామా, యాక్షన్ ప్రధానంగా, అలాగే అప్పటి కరువు పరిస్థితులను మెయిన్‌గా చూపిస్తూ సినిమా సాగుతుంది. అది కొంత స్లో అనిపిస్తుంది. దీనికితోడు రియల్ ఇన్సిడెన్స్ సీన్లు కూడా కొంత ల్యాగ్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. క్యాంప్‌లో బ్రిటీష్ వారిపై రణబాలి చేసే పోరాటం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. అది సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇంటర్వెల్ యాక్షన్‌తో హై మూమెంట్‌తో ముగుస్తుంది.
రణబాలిలో ప్లస్, మైనస్‌లు
సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్, కరువుతో ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితి, కరువు రక్షసుడికి ప్రజలు కుప్పలు తెప్పలుగా చనిపోవడం వంటి సీన్లు హృదయాన్ని కదిలిస్తాయి. ప్రజలకు ధాన్యాన్ని ఇచ్చేందుకు రణబాలి సైన్యం తయారు చేయడం, కోటలను కొల్లగొట్టి జనాలకు ధాన్యాన్ని పంచడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. మరోవైపు బ్రిటీష్ వారిపై చేసే ఫైట్ అలరిస్తుంది. కాకపోతే కరువుకి సంబంధించిన సీన్లు, వాటిని వివరించడం వంటి సీన్లు స్లోగా సాగుతాయి. కొంత బోర్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. అదే సమయంలో జయమ్మ పాత్రకి సంబంధించిన సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు సినిమా మరో స్థాయికి వెళ్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయింది. అక్కడ పూనకాలు తెప్పిస్తుంది. బీజీఎం అదిరిపోయింది. విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. ఎండ్‌లో మాత్రం వాహ్ ఫీలింగ్ తెప్పిస్తాడు. ఓవరాల్ గా మూవీ ఆకట్టుకునేలా ఉంది. కొంత కమర్షియాలిటీకి దూరంగా ఉన్నా, చివర్లో దాన్ని బ్యాలెన్స్ చేశారు. గుహలో చేసే ఫైట్ అదిరిపోయింది. చివర్లో బ్రిటీష్ వారిపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా మెప్పించింది. అయితే స్లోగా సాగడం, కొంత డాక్యుమెంటరీ స్టయిల్ ఫాలో కావడం, చాలా చోట్ల డ్రై ఫీలింగ్ కలగడం మైనస్‌గా చెప్పొచ్చు. దీనికితోడు ఊహించేలా కథనం సాగుతుంది. ఇలాంటి మైనస్‌లు పక్కన పెడితే.. కథ, కరువు సీన్లు, ఎమోషన్స్, విజయ్ రష్మిక నటన, క్లైమాక్స్, బీజీఎం, విజువల్స్ సినిమాకి బ్యాక్ బోన్ లా నిలుస్తాయని చెప్పొచ్చు.
రణబాలిలో ఆర్టిస్ట్ ల నటన
రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. ప్రారంభంలో పెద్దగా కనెక్ట్ కాలేకపోయినా, పోయే కొద్ది పాత్రలో జీవించాడు. తనని తాను మర్చిపోయి యాక్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. విభిన్నమైన గెటప్స్ లో విజయ్ కనిపించి మెప్పించాడు. చివర్లో కాంతార మూవీని తలపించాడు. విజయ్ నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. బాడీలాంగ్వేజ్, వీరత్వం, యాక్షన్ సీక్వెన్స్, యాటిట్యూడ్ సీక్వెన్స్ బాగా చేశాడు. ఇక జయమ్మగా రష్మిక మందన్నా పాత్రలో ఒదిగిపోయింది. చివర్లో కన్నీళ్లు పెట్టించింది. తల్లి రాజమ్మగా ఈశ్వరీరావు ఎప్పటిలాగే మెప్పించింది. బ్రిటీష్ కమిషనర్ అర్నాల్డ్ వాస్లూ అదరగొట్టాడు. ఆయన పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రల్లో చేసిన నటీనటులు ఓకే అనిపించారు.
రణబాలి టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
సినిమాకి అజయ్ అతుల్ అందించిన సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. బీజీఎం చివర్లో బాగా వర్కౌట్ అయ్యింది. కొన్ని సీన్లలో ఎలివేట్ అయ్యింది. కానీ ప్రారంభంలో ఆ స్థాయిలో లేదనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీన్లలో బీజీఎం ఇంకా బాగా ప్లాన్ చేయాల్సింది. జిష్ను భట్టాచార్జి, నీరవ్ షా కెమెరా వర్క్ అదిరిపోయింది. కొన్ని ఫ్రేములు అయితే కనువిందు చేస్తాయి. లాంగ్ షాట్స్ బాగున్నాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌కి ఇంకా పని చెప్పాల్సింది. కొన్ని సీన్లు ట్రిమ్ చేయోచ్చు. అప్పుడు సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ ఎంచుకున్న కథ బాగుంది. కథలో చాలా డెప్త్ ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్ చేయడం చాలా కష్టం. కమర్షియల్‌గా, ఎంటర్టైనింగ్గా చెప్పడం మరింత కష్టం. దర్శకుడు కొంత వరకు తడబడ్డా, చాలా వరకు బాగా డీల్ చేశాడు. కథని ఒక ఫ్లోలో తీసుకెళ్లాడు. బాగా చూపించాడు. ఎమోషనల్ సీన్లు, కరువు రాక్షసి సీన్లని బాగా చూపించాడు. హృదయాన్ని కదిలించాడు. క్లైమాక్స్ బాగా డీల్ చేశాడు. జయమ్మ పాత్రలోని ఎమోషన్స్ కూడా బాగున్నాయి. అయితే ఎమోషనల్ సీన్లలో డెప్త్ మిస్ అవుతుంది. కొన్ని సీన్లు అసహజంగా అనిపిస్తాయి. రెగ్యూలర్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. ఇలాంటి వాటిపై మరింత కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. కాకపోతే అప్పటి పరిస్థితులను మాత్రం కళ్లకి కట్టినట్టు చూపించాడు. హృదయాన్ని కదిలించాడు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్.
ఫైనల్‌గా
ఫైనల్‌గా.. రణబాలి మూవీ థియేటర్లో సర్ప్రైజ్ చేస్తుంది. నెగటివ్ టాక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంచనాలు లేకుండా చూస్తే నచ్చుతుంది. విజయ్ ఆకట్టుకుంటాడు. ఓవరాల్‌గా ఒక పీరియాడికల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా `రణబాలి`. అప్పటి కరువు పరిస్థితులు మాత్రం హార్ట్ ని టచ్ చేస్తాయని చెప్పొచ్చు.
రేటింగ్: 3

